Begin typing your search above and press return to search.

మొదటి కస్టమర్‌కు వినూత్నంగా.. బంగారు కత్తెరతో హెయిర్ కట్

By:  Tupaki Desk   |   30 Jun 2020 5:00 PM GMT
మొదటి కస్టమర్‌కు వినూత్నంగా.. బంగారు కత్తెరతో హెయిర్ కట్
X
కరోనా కారణంగా అత్యవసర లేదా నిత్యావసర దుకాణాలు మినహా దాదాపు అన్నీ మూతబడ్డాయి. మూడు నెలల తర్వాత తెరుచుకున్న దుకాణాల్లోకి కచ్చితంగా అవసరమైతే తప్ప ఎవరూ రాని పరిస్థితి. సెలూన్‌కు వెళ్లాలంటే చాలామంది భయపడిపోతున్నారు. కేవలం షేవింగ్ మాత్రమేకాదు. అవసరమైతే హెయిర్ కటింగ్ కూడా ఎలా వచ్చినా పర్లేదు ఇంట్లో చేసుకోవడం బెట్టర్ అని భావిస్తున్నారు. సుదీర్ఘ లాక్ డన్ అనంతరం మహారాష్ట్రలో బార్బర్ షాప్స్ 28న తెరుచుకున్నాయి. కానీ కస్టమర్లు ఆసక్తి చూపించడం లేదు.

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో (పుణేకు 250 కిలో మీటర్ల దూరం) ఓ సెలూన్ యజమాని కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్తగా ఆలోచన చేశాడు. రాంభౌ సంకల్ప్ (52) అనే సెలూన్ యజమాని ఆదివారం తన సెలూన్‌కు వచ్చిన తొలి కస్టమర్‌కు బంగారు కత్తెరతో కటింగ్ చేశాడు. మిషన్ బిగిన్ ఎగైన్ కింద మహా ప్రభుత్వం ఆంక్షలు సడలించి 2 రోజుల క్రితం బార్బర్ షాప్స్ ఓపెన్ కావడానికి అనుమతిచ్చింది. దీంతో సెలూన్లూ, బ్యూటీ పార్లర్స్ ఆదివారం నుండి తెరుచుకున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి జరగకుండా సెలూన్ యజమానులు భద్రతా చర్యలు కచ్చితంగా తీసుకోవాలి. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

లాక్ డౌన్ కారణంగా మూడు నెలలుగా సెలూన్లు క్లోజ్ అయ్యాయని, తమలా సెలూన్ యజమానులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాంభౌ సంకల్ప్ అన్నారు. అతని కొడుకు కూడా ఇదే బిజినెస్‌లో ఉన్నాడు. మేం ఏదోలా పరిస్థితికి ఎదురీదుతున్నామని, ఇప్పుడు ప్రభుత్వం సెలూన్లు తీసుకోవడానికి అనుమతించినందున తమ అందరి ముఖాల్లో నవ్వు కనిపిస్తోందని, ఈ ప్రత్యేక సందర్భంలో తన వద్దకు వచ్చిన తొలి కస్టమర్‌కు వినూత్నంగా స్వాగతం పలికి గౌరవించాలని భావించానని సంకల్ప్ చెప్పారు. అందుకే గత కొన్నేళ్లుగా తాను చేసిన సేవింగ్స్ ద్వారా 10 తులాలతో బంగారు కత్తెరను చేయించినట్లు తెలిపారు.