Begin typing your search above and press return to search.

టామ్ అండ్ జెర్రీని త‌ల‌పిస్తున్న ఈపీఎస్, ఓపీఎస్

By:  Tupaki Desk   |   25 July 2022 6:44 AM GMT
టామ్ అండ్ జెర్రీని త‌ల‌పిస్తున్న ఈపీఎస్, ఓపీఎస్
X
త‌మిళనాడులో అన్నాడీఎంకేలో మాజీ ముఖ్య‌మంత్రులు ఎడ‌పాడి ప‌ళ‌నిస్వామి (ఈపీఎస్), ఒ.ప‌న్నీరుసెల్వం (ఓపీఎస్) మ‌ధ్య ఆధిప‌త్య పోరు టామ్ అండ్ జెర్రీని త‌ల‌పిస్తోంది. త‌మిళ‌నాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జ‌య‌ల‌లిత ఆక‌స్మికంగా క‌న్నుమూసిన త‌ర్వాత ఆ పార్టీ అనేక సంక్షోభాల‌ను ఎదుర్కొన్న సంగ‌తి తెలిసిందే. జ‌య‌ల‌లిత క‌న్నుమూశాక జ‌య‌ల‌లిత నెచ్చెలి శ‌శిక‌ళ పార్టీని, ప్ర‌భుత్వాన్ని త‌న నియంత్ర‌ణ‌లోకి తీసుకున్నారు. ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌లు చేప‌డ‌దామ‌నుకునేలోపే అక్ర‌మాస్తుల కేసులో జైలుకు వెళ్లాల్సి వ‌చ్చింది. దీంతో త‌న న‌మ్మిన బంటు ఎడ‌ప్పాడి ప‌ళ‌ని స్వామి (ఈపీఎస్) ని సీఎం పీఠంపై కూర్చోబెట్టారు.

అదే స‌మ‌యంలో జ‌య‌లలిత క‌న్నుమూశాక సీఎంగా తాత్కాలిక బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఒ.ప‌న్నీర్ సెల్వం కూడా పార్టీ, ప్ర‌భుత్వంపై ప‌ట్టుకు ప్ర‌య‌త్నించారు. శ‌శిక‌ళ జైలుకుపోవ‌డంతో పార్టీ, ప్ర‌భుత్వం బాగు కోసం అటు ఈపీఎస్, ఇటు ఓపీఎస్ క‌లిసిపోయారు. ఈపీఎస్ ముఖ్య‌మంత్రిగా, ఓపీఎస్ పార్టీ క‌న్వీన‌ర్, డిప్యూటీ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

ఇక గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో అన్నాడీఎంకే ప‌రాజ‌యం పాలై స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దీంతో అన్నాడీఎంకే ప్ర‌తిపక్షానికే ప‌రిమిత‌మైంది. దీంతో పార్టీపై పెత్త‌నం కోసం ఈపీఎస్, ఓపీఎస్ మ‌ధ్య ఆధిప‌త్య పోరు రాజుకుంది. పార్టీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశం విష‌యంలో రెండు వ‌ర్గాలు కోర్టును ఆశ్ర‌యించాయి.

అయితే కోర్టులో ప‌న్నీరుకు నిరాశే ఎదురైంది. స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, జిల్లాల పార్టీ అధ్య‌క్షులు, కార్య‌క‌ర్త‌లు ప‌ళినిస్వామికే జై కొట్టారు. దీంతో ఆయ‌న అన్నాడీఎంకే తాత్కాలిక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా బాధ్య‌తలు చేప‌ట్టారు. ప‌న్నీరు సెల్వాన్ని, ఆయ‌న కుమారుడు (ఎంపీ)తోపాటు ప‌లువురిని ప‌ళ‌నిస్వామి పార్టీ నుంచి బ‌హిష్క‌రించారు.

మ‌రోవైపు ప‌న్నీరు సెల్వం ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని క‌లిసి త‌న బాధ చెప్పుకోవ‌డానికి ఢిల్లీ ప్ర‌యాణానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నేప‌థ్యంలో ఎడపాడి పళనిస్వామి కూడా ఢిల్లీ వెళ్లారు. అయితే ఆయ‌న‌కు ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్‌మెంట్‌ దక్కనట్లు తెలుస్తోంది. దీంతో ఆదివారం ఆయన చెన్నైకు తిరిగి వచ్చేశారు. ఈ పరిస్థితుల్లో పన్నీరు సెల్వం ఓ అడుగు ముందుకు వేసి, 14 జిల్లాలకు అన్నాడీఎంకే కార్యదర్శులను నియమిస్తూ ప్రకటన విడుదల చేయడం గమనార్హం.

కాగా పన్నీరు సెల్వంపై పళని వర్గం నేత, ఎంపీ సీవీ షన్ముగం ఇచ్చిన ఫిర్యాదుపై చెన్నై పోలీసులు కేసు నమోదుకు సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకే కార్యాలయంలో వస్తువులు మాయమైనట్లుగా సీవీ షన్ముగం ఇచ్చిన ఫిర్యాదుపై న్యాయ నిపుణులతో ఆదివారం చెన్నై పోలీసులు చర్చించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అయితే రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ కు వీడ్కోలు కార్య‌క్ర‌మానికి ప‌ళ‌నిస్వామికి కేంద్రం నుంచి ఆహ్వానం అందింది. అలాగే కొత్త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ప్ర‌మాణ‌స్వీకారానికి రావాల్సిందిగానూ ఆయ‌న‌ను ఆహ్వానించారు. ఈ నేప‌థ్యంలో ప‌ళనిస్వామి ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపదీ ముర్మును పళనిస్వామి బృందం మర్యాదపూర్వకంగా కూడా కలిసింది. అలాగే రామ్‌నాథ్‌ కోవింద్‌ వీడ్కోలు కార్యక్రమానికి కూడా పళని స్వామి హాజరయ్యారు.

ప‌నిలో ప‌నిగా ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను కలిసేందుకు పళని స్వామి బృందం ప్రయత్నాలు చేసింది. అయితే, అపాయింట్‌మెంట్‌ లభించకపోవడంతో వారంతా తిరిగి చెన్నైకు వచ్చేశారు.

అదే సమయంలో పళని స్వామి వ్యవహరించిన తీరుపై కేంద్రం గుర్రుగా ఉన్నట్టు, అందుకే ఆయనకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వనట్లు పన్నీరు సెల్వం శిబిరం చెబుతుండడం గమనార్హం. ఇక జూలై 28న చెస్‌ ఒలంపియాడ్‌ నిమ్తితం చెన్నైకు రానున్న ప్రధాని నరేంద్ర మోదీ అన్నాడీఎంకేలో విభేదాలకు ముగింపు పలికే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇద్దరూ ఒకేసారిగా తనను కలవాలనే ఆదేశాలు ఢిల్లీ నుంచి పన్నీరు, పళనికి వేర్వేరుగా వచ్చినట్లు సమాచారం. పార్టీ త‌మ‌దంటే త‌మ‌ద‌ని టామ్ అండ్ జెర్రీలా కీచులాడుకుంటున్న ప‌ళ‌నిస్వామి, ప‌న్నీరు సెల్వంల‌కు మోడీ ఏం చెబుతారో వేచి చూడాల్సిందే.