Begin typing your search above and press return to search.

టీడీపీపైనే పెద్ద దెబ్బ

By:  Tupaki Desk   |   19 April 2021 7:31 AM GMT
టీడీపీపైనే పెద్ద దెబ్బ
X
తిరుపతి ఉపఎన్నికలో ఓటింగ్ శాతం బాగా తగ్గటం ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంపార్టీపైనే పడుతుందనే విశ్లేషణలు మొదలయ్యాయి. మొత్తం 17 లక్షల ఓట్లకు గాను పోలైంది సుమారు 11 లక్షలు మాత్రమే. 2019 ఎన్నికల్లో 80 నమోదైన పోలింగ్ తాజాగా మాత్రం 64 శాతానికి పడిపోయింది. అంటే తగ్గిన 16 శాతం ఓటింగ్ ప్రభావం ఎవరిపైన పడుతుందనే చర్చలు మొదలయ్యాయి.

2019 ఎన్నికలో టీడీపీకి వచ్చిన ఓట్లు 4.94 లక్షలు. ఇప్పటి పోలింగ్ తో పోల్చితే తగ్గిన 16 శాతం ఓటింగ్ దెబ్బ సైకిల్ అభ్యర్ధికి తప్పదని అర్ధమైపోయింది. ఈ విషయాన్ని టీడీపీ నేతలే అంగీకరిస్తున్నారు. పోలైన 11 లక్షల ఓట్లలో తమ పార్టీకి మహాఅయితే 2.5-3 లక్షలు రావచ్చని అంచనా వేసినట్లు చెప్పారు. ఇదే సమయంలో బీజీపీ చాలా ఎక్కువగా ఓట్లు వచ్చాయని అనుకున్నా 30వేల నుండి 50వేల దాటదని లెక్కలు కట్టారు.

రెండు ప్రతిపక్ష పార్టీలకు కలిపి సుమారు 3నుండి 3.5 లక్షల ఓట్లుపోలైతే మిగిలిన 7.5 లక్షల ఓట్లు వైసీపీకే పడేందుకు అవకాశం ఉందని స్ధానిక టీడీపీ నేతలు లెక్కలు కట్టారు. తమపార్టీ నేతలు ప్రచారంలో చూపించినంత ఊపు ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకురావటంలో చూపలేదన్నారు. ఎంతసేపు వైసీపీ నేతలు దొంగఓట్లు వేసుకుంటున్నారనే విషయాన్ని హైలైట్ చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వటమే తమకు పెద్ద మైనస్ అయిపోయిందన్నారు.

పోలింగ్ మొదలైన రెండు గంటలకు చాలా కేంద్రాల్లో టీడీపీ పోలింగ్ ఏజెంట్లు కనబడలేదన్నారు. ఎలాగూ గెలిచేది వైసీపీనే కాబట్టి పోలింగ్ ఎందుకు వెళ్ళాలనే ఆలోచన తమ మద్దతు ఓటర్లలో కనిపించిందని చెప్పారు. ఓటింగ్ తగ్గిపోవటానికి ఇది కూడా ఓ కారణంగా పార్టీనేతలు విశ్లేషించుకుంటున్నారు. మొత్తంమీద తగ్గిపోయిన పోలింగ్ శాతం టీడీపీపై గట్టిగానే పడుతుందని పార్టీ నేతల విశ్లేషణ ద్వారా అర్ధమవుతోంది.