Begin typing your search above and press return to search.

టీమిండియాకు బుమ్రా లోటు పెద్దదే!

By:  Tupaki Desk   |   4 Oct 2022 2:30 AM GMT
టీమిండియాకు బుమ్రా లోటు పెద్దదే!
X
సరిగ్గా 20 రోజుల్లో టి20 ప్రపంచ కప్ ప్రయాణం ప్రారంభం అవుతుందనగా టీమిండియాకు భారీ దెబ్బ తగిలింది. జట్టు ప్రధాన పేస్ బౌలర్, యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. బుమ్రా ఇప్పటికే దక్షిణాఫ్రికా సిరీస్ ఆడడం లేదు. జట్టులో ఉన్నప్పటికీ తొలి టి20కి ముందే గాయం అనుమానంతో మైదానంలోకి దిగలేదు. రెండో టి20 కూడా ఆడలేదు. ఇప్పుడు ఏకంగా ప్రపంచ కప్ నకే దూరమయ్యాడు. అసాధారణ పేసర్ అయిన బుమ్రా ప్రతిష్ఠాత్మక కప్ నకు దూరం కావడం ఇబ్బందికరమే.

అయితే, అతడి ఫిట్‌నెస్‌పై వైద్య నిపుణుల నివేదిక ఆధారంగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఆస్ట్రేలియాలో ఈ నెల 16 నుంచి నవంబరు 13 వరకు ప్రపంచ కప్ జరుగుతుంది. గ్రూప్‌-2 సూపర్‌ 12 స్టేజ్‌లో భారత్‌ ఉంది. ఇదే గ్రూప్‌లో పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌ ఉన్నాయి. ఇక ఈ నెల 23న పాకిస్థాన్‌తో మన జట్టు తొలి మ్యాచ్ ఆడుతుంది. నవంబరు 9న తొలి, 10న రెండో సెమీ ఫైనల్ జరుగుతుంది. మెల్‌బోర్న్‌లో నవంబరు 13న తుది సమరం జరుగుతుంది.

అతడి స్థానంలో ఎవరు..?

ప్రధాన పేసర్, మ్యాచ్ విన్నర్ బుమ్రా జట్టుకు అందుబాటులో లేకుండా పోయిన నేపథ్యంలో అతడి స్థానాన్ని భర్తీ చేసేదెవరో చూడాలి. ఇప్పటికైతే ఎవరికి చోటు కల్పించనున్నారనేది బీసీసీఐ ప్రకటించలేదు. టెస్టుల్లో బుమ్రాతో కలిసి బంతిని పంచుకునే మొహమ్మద్ షమీకే ఎక్కువ అవకాశాలున్నాయి. అయితే, షమీ కొవిడ్ బారినపడి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్ లకు దూరమయ్యాడు. టి20 ప్రపంచ కప్ సమయానికి అతడు కోలుకునే అవకాశమైతే ఉంది. కాకపోతే పెద్దగా మ్యాచ్ ప్రాక్టీస్ ఉండదు. అయినా సరే షమీలాంటి పేసర్ గాడినపడేందుకు ఒక్క మ్యాచ్ చాలు. కాకపోతే.. మైదానంలో అతడెలా రాణిస్తాడనేది చూడాలి.

సిరాజ్ కు చాన్సుందా..?

వాస్తవానికి బుమ్రా అందుబాటులో ఉండగా.. షమీని టి20 ప్రపంచ కప్ స్టాండ్ బైగా తీసుకున్నారు. ఇప్పుడు బుమ్రా లేనందున అతడు ప్రధాన జట్టులోకి వస్తాడు. స్టాండ్ బైగా మరొకరిని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ చాన్స్ హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ కు దక్కే వీలుంది. ఆస్ట్రేలియా పిచ్ లు సిరాజ్ బౌలింగ్ కు చక్కగా సరిపోతాయి. ఈ కారణంగానే రెండేళ్ల కిందట అతడిని ఆస్ట్రేలియా సిరీస్ కు తీసుకెళ్లారు. అక్కడ సిరాజ్ అద్భుతంగా రాణించి జట్టు నమ్మకాన్ని నిలబెట్టాడు. ఇప్పుడు కూడా సిరాజ్ ను దక్షిణాఫ్రికా సిరీస్ కు తీసుకున్నారు. కాకపోతే అతడు ఇంగ్లండ్ కౌంటీల నుంచి వచ్చాడు. ఇక టి20 ప్రపంచ కప్ నకు ఎంపికలో సిరాజ్ కు మించి మరొక పేసర్ లేరు. శార్దూల్ ఠాకూర్ వంటి ఆల్ రౌండర్లున్నా భారీగా పరుగులివ్వడం అతడి బలహీనత. సిరాజ్ కూ ఈ లోపం ఉన్నప్పటికీ.. వికెట్లు పడగొట్టగల నేర్పు సొంతం. పైగా ఆస్ట్రేలియా పిచ్ లు సిరాజ్ శైలికి అనుకూలం.

బుమ్రా లోటు పెద్దదే

టీమిండియాను ప్రస్తుతం వేధిస్తున్న ప్రధాన సమస్య డెత్ ఓవర్ల బౌలింగ్. దక్షిణాఫ్రికాతో నిన్నటి టి20 మ్యాచ్ లో 237 పరుగులు చేసినా.. కాపాడుకోవడం కష్టమైంది. అర్షదీప్ సింగ్, అక్షర్, అశ్విన్, హార్దిక్ పటేల్.. ఇలా బౌలర్లంతా విఫలమయ్యారు. దీపక్ చాహర్ పొదుపుగా బౌలింగ్ చేయకుంటే మ్యాచ్ చేజారేదే. దీన్నిబట్టే టీమిండియాకు బుమ్రాలాంటి పేసర్ అవసరం ఎంత ఉందో తెలిసిపోతుంది. ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ ఎంతటి మేటి అయినా బుమ్రాను ఎదుర్కొనడం చాలా కష్టం. యార్కర్లకు తోడు వైవిధ్యమైన బుమ్రా బంతులు అంతగా ఇబ్బంది పెడతాయి. అందుకనే టి20ల్లో బుమ్రా జట్టుకు చాలా అవసరం. మరోవైపు భువనేశ్వర్ పూర్తిగా తేలిపోతున్నాడు. డెత్ ఓవర్లలో బంతిని అప్పగిస్తే భువీ పూర్తిగా నిరాశపరుస్తున్నాడు. వీరిద్దరూ కాక సీనియర్ బౌలర్లలో మిగిలిన షమీ.. టి20లు ఆడక చాలా రోజులైంది. అయినప్పటికీ టి20 ప్రపంచ కప్ నకు అతడే ప్రధాన బౌలర్ గా బరిలో దిగాల్సి వస్తోంది.

జూనియర్లదే భారం

షమీ కాక టి20 ప్రపంచ కప్ వంటి పెద్ద టోర్నీకి టీమిండియా పేసర్లు ఎవరయ్యా అంటే.. దీపక్ చాహర్, హర్షల్ పటేల్, సిరాజ్ అనే చెప్పాలి. వీరంతా జూనియర్లే. దీపక్, హర్షల్ ఎప్పుడైనా గాడితప్పి భారీగా పరుగులిచ్చే ప్రమాదం ఉంది. తమదైన రోజు మ్యాచ్ ను మలుపుతిప్పే వీరే.. పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే చేతులెత్తేస్తారు. ఇక భువనేశ్వర్ ఏ మేరకు రాణిస్తాడనేది అంచనా వేయలేం. అంటే.. కప్పు భారమంతా జూనియర్ పేసర్లదే. చూద్దాం ఏ జరుగుతుందో..? కాలమే సమాధానం చెప్పాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.