Begin typing your search above and press return to search.

ఇప్పుడు హనుమంతుడికి నోటీసులు

By:  Tupaki Desk   |   18 Feb 2016 7:04 AM GMT
ఇప్పుడు హనుమంతుడికి నోటీసులు
X
తరచూ చోటు చేసుకుంటున్న ఈ ఉదంతాల్ని చూసినప్పుడు.. సినిమా ప్రారంభానికి ముందు వచ్చే ప్రకటనలో కానీ.. ‘‘ఈ నగరానికి ఏమైంది?’’ అన్నట్లు ఈ దేశంలోని కోర్టులకు ఏమైందన్న మాట నోటి వెంట అప్రయత్నంగా వచ్చే వీలుంది. ఆ మధ్యన ఒక పెద్దమనిషికి పురాణాల్లో ఉన్న సీతారామ చరిత్రను కోర్టు ముందుకు పెట్టి.. అప్పుడెప్పుడో జరిగిపోయిన సీత వనవాసం ఎపిసోడ్ ను తెర మీదకు తీసుకొచ్చి చర్యలు తీసుకోవాల్సిందిగా కోర్టును ఆశ్రయించటం.. దీనిపై విచారణ జరిగి.. కోర్టు కొట్టేయటం తెలిసిందే.

తాజాగా అలాంటి ఉదంతమే మరొకటి చోటు చేసుకుంది. బీహార్ లోని రోహ్తస్ జిల్లాలోని డెహ్రీ ఆన్ సోన్ రోడ్డు పక్కనే పంచముఖ హనుమాన్ ఆలయం ఒకటి ఉంది. దీని కారణంగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ టెంపుల్ ను తొలగిస్తే స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురి అవుతున్న నేపథ్యంలో.. అక్కడి ప్రజా పనుల విభాగం కోర్టుకు వెళ్లింది.

దీనిపై స్పందించిన న్యాయస్థానం.. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయంగా మారిన హనుమంతుడ్ని కోర్టుకు తీసుకురావాలంటూ అధికారుల్ని ఆదేశించింది. దీంతో.. ఏం చేయాలో తోచక అధికారులు కిందామీదా పడుతున్నారు. ఈ నోటీసులు ఎవరికి ఇవ్వాలో అర్థం కాక.. ఆలయం గోడకు అంటించి తిరిగి వచ్చారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలకు అంతకు మించి అధికారులు మాత్రం ఏం చేయగలరు. అయినా.. ఇలాంటి పిటీషన్లపై కోర్టు రియాక్ట్ అయి.. నోటీసులు ఇచ్చే కన్నా.. పిటీషన్ వేసిన వ్యక్తినే గట్టిగా నిలదీస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.