Begin typing your search above and press return to search.

సౌదీలో మహిళలకు ఊపిరి.. మరో ఊరటనిచ్చిన గల్ఫ్ దేశం

By:  Tupaki Desk   |   8 Sep 2022 3:30 PM GMT
సౌదీలో మహిళలకు ఊపిరి.. మరో ఊరటనిచ్చిన గల్ఫ్ దేశం
X
సౌదీ అరేబియా అంటేనే ఎన్నో కఠిన నియమాలకు పేరు.. ఇక ఆ దేశంలో మహిళలపై ఉండే వివక్ష అయితే అంతా ఇంతాకాదు.. ఇక్కడ వారి జీవితాలకు ఎన్నో ఆంక్షలున్నాయి. అయితే అక్కడి రాజు సల్మాన్ బిన్ అబ్దుల్లా అజీజ్ అల్ సౌద్ ఇక పై సౌదీ మహిళలు డ్రైవింగ్ చేసుకోవచ్చని అప్పట్లో ప్రకటించడం పెద్ద సంచలనమే అయ్యింది. ఆ దేశ మహిళలందరూ దేశ రాజు నిర్ణయాన్ని చూసి ఆనందానికి గురయ్యారు.

అంతేకాదు.. సౌదీ దేశ చరిత్రలోనే ఇటీవల మహిళలందరిని స్టేడియంలోకి అనుమతించి క్రీడా పోటీలను చూసేందుకు అధికారులు ఏర్పాట్లు చేయడం సంచలనమైంది. దీంతో సౌదీ మహిళల్లో చెప్పలేనంత సంతోషం వ్యక్తం అవుతోంది..

అరబ్ దేశం సౌదీ అరేబియాలో మహిళలకు కొన్నేళ్ల ముందు వరకూ కఠిన ఆంక్షలు అమల్లో ఉండేవి. వారికి అసలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు కూడా అవకాశం ఉండేది కాదు. ఒకవేళ రావాలంటే తోడుగా ఓ పురుషుడు ఉండాల్సిందే. ఇక బయట ఉద్యోగాల మాట దేవుడెరుగు.. వంటింటి కుందేళ్లుగా కాలం వెళ్లదీసేవారు. కానీ గడిచిన కొంతకాలంగా పాశ్చాత్య పోకడలు చూసి సౌదీ అరేబియా కూడా మారింది. కొంతకాలంగా మహిళల విషయంలో సౌదీ అరేబియా సంచలన నిర్ణయాలు తీసుకుంది. వారిని ఒంటరిగా బయటకు వచ్చేందుకు వీలు కల్పించింది.

ఇక తాజాగా సౌదీ అరేబియా ప్రభుత్వం మహిళల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. హై స్పీడు రైళ్లు నడిపేందుకు మహిళలకు అవకాశం కల్పించింది. దీనిలో భాగంగానే 31 మంది మహిళలను శిక్షణ కోసం ఎంపిక చేసింది. మొదట ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు భారీ స్పందన వచ్చింది. ఏకంగా 28వేల మంది మహిళలు దీని కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 145మంది పర్సనల్ ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు.

అందులో కేవలం 31 మందిని మాత్రమే ఫస్ట్ స్టేజ్ ట్రైనింగ్ కు సెలెక్ట్ చేశారు. తాజాగా వీరికి మొదటి దశ శిక్ష పూర్తి చేశారు. త్వరలోనే వీరు రెండో దశ శిక్షణకు వెళ్లనున్నారు. ఐదు నెలలు ఉండే ఈ శిక్షణలో ట్రైనీలు ప్రొఫెషనల్ డ్రైవర్ల సమక్షంలో ప్రాక్టికల్ శిక్షణను పూర్తి చేయనున్నారు. ఈ తుది శిక్షణ పూర్తి చేసుకొని ఎంపికైన మహిళలు మక్కా, మదీనా నగరాల మధ్య ఒక ఏడాది తర్వాత బుల్లెట్ ట్రైన్స్ ను నడుపుతారని అధికారులు తెలిపారు.

గడిచిన ఐదేళ్లలో అనేక రంగాల్లో మహిళల భాగస్వామ్యం 33 శాతానికి పెరిగిందన్నారు. ఒకప్పుడు స్త్రీలు కార్లు కూడా నడపడానికి అనుమతి ఇవ్వని దేశంలో ఇప్పుడీ విప్లవాత్మక మార్పుతో ఏకంగా బుల్లెట్ ట్రైన్ నడిపే స్థాయికి మహిళలు ఎదగడం విశేషం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.