Begin typing your search above and press return to search.

నవ వధువు కంట కావేరి జలాలు

By:  Tupaki Desk   |   13 Sep 2016 10:01 AM GMT
నవ వధువు కంట కావేరి జలాలు
X
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న సామెత గుర్తుండే ఉంటుంది. తమిళనాడు - కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరి జలాల వివాదం కూడా ప్రజలకు అలాంటి కష్టాలనే తెస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య వివాదం రావణకాష్టంలా మారడంతో జనజీవనం అతలాకుతలమైంది. బస్సులు తగలబెట్టి రాకపోకలను అడ్డుకోవడంతో రెండు రాష్ట్రాల మధ్య ప్రయాణం ప్రయాసగా మారిపోయింది. దీంతో ప్రజల జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను కూడా విషాదంగా మార్చేస్తోంది. ఎంతో సంబరంగా జరుపుకోవాల్సిన పెళ్లి వేడుకలు ఈ వివాదం పుణ్యమా అని వెలవెలబోతున్నాయి. తాజాగా ఓ పెళ్లిపై పడిన కావేరి వివాద ప్రభావం చూస్తే అయ్యో అనిపించక మానదు.

బెంగళూరుకు చెందిన ప్రేమకు తమిళనాడులోని వినియంబాడిలో బుధవారం ఓ వ్యక్తితో పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లికి ముందు రోజే అక్కడికి చేరుకోవాల్సి ఉంది. దీంతో వధువుతోపాటు ఆమె కుటుంబం మంగళవారం ఉదయం తమిళనాడుకు బయల్దేరింది. కానీ, తమిళనాడకు బస్సుల్లేవు. దీంతో అవకాశం ఉన్నంత వరకు ఏదో ఒక వాహనాన్ని పట్టుకుని కొద్ది దూరం వెళ్లి అక్కడి తమిళనాడుకు కాలినడకన బయల్దేరారు వారు. ముస్తాబై కాలు కదపకుండా కూర్చోవాల్సిన నవ వధువు పాపం.. కాళ్లు నొప్పులు పుడుతున్నా కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్తుండడంతో చూసినవారంతా అయ్యో అంటున్నారు.

ఈ కష్టాలు కేవలం వధువు కుటుంబానికే కాదట... పెళ్లికి వస్తున్నవారు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చాలామంది పెళ్లికి రావడం కూడా మానేస్తున్నారట. 600 మందిని పెళ్లికి పిలిస్తే గట్టిగా 20 మంది కూడా వచ్చేలా లేరని చెబుతున్నారు. రెండు రాష్ట్రాల మధ్య రవాణా పూర్తిగా నిలిచిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. జీవితాంతం గుర్తుండిపోవాల్సిన పెళ్లి ఇలా జరుగుతుండడంతో వధువు కాస్త కన్నీటిపర్యంతమవుతోంది. కావేరి జలాల పంపకం సంగతెలా ఉన్నా ఆనందబాష్పాలు రాల్చాల్సిన నవ వధువు కంట కన్నీరు మాత్రం కావేరి జలాల కంటే ఉదృతంగా ప్రవహిస్తున్నాయి.