Begin typing your search above and press return to search.

సూయజ్ ఆసక్తికర చరిత్ర... అప్పట్లోనే ఎనిమిదేళ్లు మూతపడింది!

By:  Tupaki Desk   |   30 March 2021 4:30 PM GMT
సూయజ్ ఆసక్తికర చరిత్ర... అప్పట్లోనే ఎనిమిదేళ్లు మూతపడింది!
X
అంతర్జాతీయ వాణిజ్యానికి పెట్టింది పేరు సూయజ్ కాలువ. ఈజిప్టులోని ఈ కాలువ ద్వారా నిత్యం వేల కోట్లలో వ్యాపారం కొనసాగుతుంది. వివిధ దేశాల నౌకలు సరుకులను తరలిస్తాయి. ప్రపంచ వాణిజ్యంలో దాదాపు పది శాతానికి పైగా దీని ద్వారే జరుగుతుంది. అయితే ఇటీవల ఎవర్ గివెన్ నౌక ఆ కాలువలో చిక్కుకుపోయింది. 400 మీటర్ల పొడవు గల ఆ నౌక 200 మీటర్ల వెడల్పు ఉన్న కాలువలో అడ్డంగా చిక్కుకుపోయింది. దీనిని కదిలించడానికి వారం రోజులుగా టగ్ బోట్లతో కృషి చేస్తున్నారు. ఆ చర్యల్లో సోమవారం కాస్త పురోగతి సాధించారు. అయితే ఈ సమస్య పూర్తి పరిష్కారమవడానికి ఇంకాస్త సమయం పడుతుందని ఆ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇది రెండోసారి
సూయజ్ కాలువ ద్వారా రవాణా నిలిచిపోవడంతో రోజుకు దాదాపు 70 కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని నిపుణులు అంటున్నారు. మరి ఈ అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం మూతపడడం ఇది తొలిసారి కాదు. గతంలో జరిగిన ఓ యుద్ధం కారణంగా ఎనిమిదేళ్లు మూతపడింది. ఆ సమయంలో కాలువలో ఉన్న నౌకలు అలాగే చిక్కుకుపోయాయి. ఓ నౌక ఏకంగా మునిగిపోయింది. కేవలం వారం రోజులకే ఎంతో నష్టం వాటిల్లుతోంది అనుకుంటున్న సూయజ్ కాలువ రవాణా అప్పట్లో అన్ని ఏళ్లు మూతపడితే ఏం జరిగింది? అసలు ఎందుకు మూతపడింది? ఆ తర్వాత ఎలా పునరుద్ధరించారు? అనే ఆసక్తికర అంశాల గురించి విపులంగా తెలుసుకుందాం.

యుద్ధంతో రాకపోకలకు బ్రేక్
1967లో ఈజిప్టు, సిరియా, జోర్డాన్ ల మధ్య యుద్ధ పరిస్థితులు తలెత్తాయి. ఆ యుద్ధం ఆరు రోజులు కొనసాగింది. ఫలితంగా సిక్స్ డే వార్ గా చరిత్ర పుటల్లో నిలిపోయింది. ఆ సమయంలో ఇరు పక్షాల నడుమ కాల్పులు జరిగాయి. ఈ యుద్ధం కారణంగా సూయజ్ రాకపోకలు ఎనిమిదేళ్లు స్తంభించాయి. ఆ సమయంలో కాలువలో 15 వాణిజ్య నౌకలు ఉన్నాయి. వాటిలో ఓ ఓడ నీటిలో మునిగిపోయింది. మిగతా 14 ఓడలు అక్కడే ఎనిమిదేళ్లపాటు నిలిచిపోయాయి. అలా సూయజ్ రాకపోకలకు తొలిసారి అంతరాయం ఏర్పడింది.

యుద్ధానికి కారణాలు
అప్పటి ఈజిప్టు అధ్యక్షుడు గమాల్ అబ్దెల్ నాసిర్ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. 1967 మేలో భారీ సైన్యాన్ని మోహరించారు. ఇక ఇజ్రాయెల్ తో యుద్ధం వస్తే ఆ దేశాన్ని పూర్తిగా నాశనం చేస్తామని ప్రకటించారు. సిరియా కూడా ఇలాంటి బెదిరింపులు మొదలుపెట్టింది. ఇలా కొన్ని వారాల పాటు హెచ్చరికల నడుమ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం జూన్ 5న యుద్ధం ఆరంభమైంది. ఈజిప్టుపై బాంబులతో ఇజ్రాయెల్ దాడి చేసి.. దేశ సైన్యాన్ని దాదాపు తొంభై శాతం దెబ్బతీసింది. సిరియాపై కూడా బాంబుల దాడికి పూనుకుంది.

బాంబుల వర్షం
యుద్ధం రెండో రోజు కాలువ చివర్లో ఉన్న ఓడలు బాంబుల శబ్దాలకు నీటిలో మునిగిపోయాయి. ఇజ్రాయెల్ ఈ కాలువను ఉపయోగించుకోకుండా ఈజిప్టు బాంబులు పెట్టింది. మూడు అరబ్ దేశాలు ఓడిపోవడంతో యుద్ధం జూన్ 10న ముగిసింది. అలా యుద్ధం ఆరు రోజుల పాటు కొనసాగింది. ఫలితంగా సూయజ్ కాలువ ద్వారా రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో బల్గేరియా, చెక్ స్లోవేకియా, ఫ్రాన్స్, పోలాండ్, స్వీడన్, పశ్చిమ జర్మనీ, బ్రిటన్, అమెరికాలకు చెందిన 15 ఓడలు సూయజ్ కాలువలో చిక్కుకున్నాయి. ఇజ్రాయెల్ బాంబుల దాడి వల్ల అమెరికాకు చెందిన ఓ ఓడ నీటిలో మునిగిపోయింది. చేసేది లేక మిగతా ఓడలు గ్రేట్ బిటర్ సరస్సులో ఆశ్రయం పొందాయి. కానీ బయటపడే మార్గం లేకపోయింది. ఈ నౌకల గురించి ఆ దేశాలు ఈజిప్టుతో ఎటువంటి ఒప్పందాలు చేసుకోకవడం గమనార్హం.

ఈజిప్టుపైనా అధిక ప్రభావం
సూయజ్ కాలువ రాకపోకలు స్తంభించిన నేపథ్యంలో చిక్కుకపోయిన నౌకల్లోని సరుకులను కాపాడుకోవడానికి సిబ్బందిని సంబంధిత దేశాలు ఏర్పాటు చేశాయి. వారికోసం గ్రేట్ బిటర్ లేక్ అసోసియేషన్ ను ఏర్పాటు చేశాయి. వారి ఆరోగ్యం కోసం పలు కార్యక్రమాలు, పోస్టాపీసు వంటి సేవలు ప్రారంభించారు. క్రమంగా ఆ దేశాలు ఆ నౌకలను పట్టించుకోవడం మానేశాయి. అవి దుమ్ముతో నిండిపోయాయి. కాలువ మూసేయడంతో అరబ్ దేశాల మీద ఎక్కువ ప్రభావం పడింది. ఈ కాలువ ద్వారా యూరోపియన్ దేశాలకు అరబ్ దేశాలు చమురు సరఫరా చేసేవి. రష్యా చమురు విక్రయాలను పెంచింది. యూరోపియన్ దేశాలకు గుణపాఠం చెప్పాలనుకున్న ఈజిప్టు వ్యూహం పనిచేయలేదు. ఫలితంగా ఈ ప్రభావం ఈజిప్టుపైనే పడడం కొసమెరుపు.

మరో యుద్ధంతో అందుబాటులోకి..
ఎనిమిదేళ్ల అనంతరం చివరకు మరో యుద్ధంతో ఈ కాలువను తిరిగి ప్రారంభించారు. 1973లో జరిగిన యోమ్ కిప్పర్ యుద్ధంలో ఈజిప్టు, సిరియాలు ఇజ్రాయెల్ పై దాడి చేశాయి. కాలువలో మునిగిన ఓడలు, అమర్చిన బాంబులను తొలగించి తిరిగి రాకపోకలు ప్రారంభించేనాటికి ఏడాది పట్టింది. ఈ కాలువను మూసేసిన రోజు అనగా జూన్ 5నే 1975లో తిరిగి తెరిచారు. చిక్కుపోయిన ఓడల్లో రెండు మినహా అన్నీ పాడయ్యాయి. అలా ఓ యుద్ధంతో మూసేసిన సూయజ్ కాలువను మరో యుద్ధంతో తెరిచారు. తాజాగా ఎవర్ గివెన్ నౌక మునకతో సూయజ్ కాలువ చరిత్ర ఆసక్తికరంగా మారింది. నాటి నుంచి నేటి వరకు ఈ కాలువ కేంద్రంగా అంతర్జాతీయ వాణిజ్యం అంతకంతకూ పెరుగుతూనే ఉంది.