Begin typing your search above and press return to search.

గాల్లో విమానం.. బుల్లెట్ తాకి ప్రయాణికుడికి సీరియస్

By:  Tupaki Desk   |   3 Oct 2022 4:23 AM GMT
గాల్లో విమానం.. బుల్లెట్ తాకి ప్రయాణికుడికి సీరియస్
X
అంత ఎత్తులో ఉండే విమానంపైకి కూడా కాల్పులు జరిపారు. ఆ బుల్లెట్ ఏకంగా విమానాన్ని చీల్చుకుంటూ వెళ్లి మరీ ప్రయాణికుడిని గాయపరిచింది. అతడి పరిస్థితి విషమంగా మారింది. ఏంటా బుల్లెట్.? ఎవరు కాల్చారు. అంత ఎత్తున విమానంకు హోల్ పడి మరీ ప్రయాణికుడిని గాయపరిచిందంటే అందరూ షాక్ అవుతున్న పరిస్తితి నెలకొంది.

విమానం గాల్లో ఉండగా తూటా తాకి ఓ ప్రయాణికుడు గాయపడ్డాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. మయన్మార్ ఎయిర్ లైన్స్ లో ప్రయాణిస్తున్న ఓ ప్యాసెంజర్ ను భూమి నుంచి వచ్చిన తూటా గాయపరిచింది. మయన్మార్ లోని లొయికాలో విమానం ల్యాండ్ అయిన వెంటనే బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. విమానాశ్రయానికి తూర్పున నాలుగు మైళ్ల దూరంలో 3500 అడుగుల ఎత్తున విమానం ఎగురుతున్నప్పుడు ఈ ఘటన జరిగింది. విమానంలోని ముఖ్యభాగమైన 'ప్యూజ్ లేజ్' నుంచి ఈ తూటా దూసుకొచ్చింది. ఈ ఘటన తర్వాత వెంటనే అప్రమత్తమైన లయికాలోని మయన్మార్ నేషనల్ ఎయిర్ లైన్స్ సంస్థ ఆ ప్రాంతం నుంచి వెళ్లే అన్ని విమానాలను రద్దు చేసింది.

మయన్మార్ లో కొద్దిరోజులుగా అంతర్యుద్ధం నడుస్తోంది. కయాలోని రెబల్ దళాలే ఈ పనికి పాల్పడ్డాయని మయన్మార్ మిలటరీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే రెబల్స్ మాత్రం ఈ ఘటనతో తమకు సంబంధం లేదని చెబుతున్నారు. ప్రభుత్వంతో పోరాడుతున్న మైనారిటీ మిలీషియా గ్రూప్ 'కరెన్ని నేషనల్ ప్రొగెసివ్ పార్టీ' ఉగ్రవాదులే ఈ విమానంపై కాల్పులు జరిపారని మయన్మార్ మిలటరీ ప్రభుత్వం ఆరోపిస్తోంది.

ప్రయాణికుల విమానంపై ఇలాంటి దాడి యుద్ధ నేరాల కిందకు వస్తుందని మయన్మార్ ప్రభుత్వం హెచ్చరించింది. శాంతి కోసం పరితపించే సంస్థలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించాల్సి ఉందని తెలిపింది.

కొద్దిరోజులుగా మిలటరీకి, స్థానిక ప్రతిస్పందన దళాలకు మధ్యజరుగుతున్న పోరుతో కయా ఉద్రిక్తంగా మారింది. మయన్మార్ లోని ప్రజాస్వామ్యప్రభుత్వాన్ని కూల్చిన మిలటరీ ప్రభుత్వం 2021లో అధికారాన్ని హస్తగతం చేసుకుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.