Begin typing your search above and press return to search.

మోడీకి అదిరిపోయే లేఖ

By:  Tupaki Desk   |   14 Nov 2016 4:37 PM IST
మోడీకి అదిరిపోయే లేఖ
X
దేశంలో నల్లధనాన్ని అరికట్టాలన్న ప్రధాని మోడీ ఆలోచన మంచిదే అయినా పెద్దనోట్ల రద్దుతో కలుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయనపై అంతటా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. 500 - 1000 నోట్లు ఇకపై చిత్తుకాగితాలతో సమానం అంటూ ప్రధాని ప్రకటించడంతో ప్రజల్లో ఆందోళన - భయం బయలుదేరింది. దీంతో దేశంలోని కోట్లాది మంది రోడ్ల మీదకు వచ్చేశారు. రెండు రోజుల్లోనే ఏటీఎంలు పనిచేస్తాయని ప్రభుత్వం చెప్పినా అది జరగలేదు. ఏటీఎంలు 2000 నోట్లకు సపోర్ట్ చేయకపోవడంతో సగానికిపైగా ఏటీఎంలు తెరుచుకోలేదు. ఈ నేపథ్యంలో ప్రధానిపై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. కొందరు బహిరంగ లేఖలురాస్తున్నారు. అలాంటి వాటిలో హర్ష గోఖలే అనే వ్యక్తి రాసిన బహిరంగ లేఖ ఇప్పుడు దేశవ్యాప్తంగా హల్ చల్ చేస్తోంది.

లేఖ సారాంశం ఇదీ..

'' రూ.500 - రూ.1000 నోట్లను రద్దు చేసి సోమవారానికి ఆరు రోజులు. మీ ప్రకటన తర్వాత అపశకునాలే ఎక్కువగా కనిపించాయి. అనేక వైరుధ్యాలున్న భారత్‌ లో అత్యున్నత స్థాయిలో ఓ నిర్ణయాన్ని ప్రజలపైకి వదిలే ముందు అన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటారని అనుకొన్నా. కానీ మీ నిర్ణయం తర్వాత తలెత్తిన సమస్యలను నియంత్రించడంలో సఫలం కాలేకపోయారు. దాని వల్ల సామాన్యులు బ్యాంకులతో తలపడాల్సి వస్తున్నది. అత్యంత ఘోరమైన పరిస్థితులను చూసిన తర్వాత మీ మానసిక - రాజకీయ - ఆర్థిక ప్రేరణ ఏంటో తెలుసుకోవాలన్న కోరిక కూడా కలుగలేదు. నరేంద్రమోదీ అంటేనే ప్రభుత్వం.. ప్రభుత్వం అంటే మోదీ అనే భావన నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుత ప్రభావాన్ని మీతో పంచుకోవాలనుకొంటున్నాను. మన దేశంలో ప్రజలు తమ సంపాదనను వివిధ రూపాల్లో దాచుకొంటారు. కొందరు నగదుగా దాచుకోవాలనుకొంటారు. మరికొందరు బంగారం - వజ్రాలుగా దాచుకోవాలనుకొంటారు. మరికొందరు స్థిరాస్తులుగా దాచుకోవాలనుకొంటారు. ఆర్థిక వ్యత్యాసాలు ఎక్కువగా ఉన్న సమాజం మనది. వాస్తవం కంటే సామాజిక బంధాలు - ప్రతిష్ఠ - హోదాలను ఎక్కువగా భావించే భారతీయ సమాజంలో అకస్మాత్తుగా ఎలాంటి క్లారిఫికేషన్ లేకుండా నోట్ల రద్దును ప్రజాసమస్యగా మార్చారు. వ్యాపార వేత్తలు - పెట్టుబడిదారులు డబ్బులు పరుపుల్లో పెట్టుకొని నిద్రిస్తారనే భ్రమకు మీరు గురయ్యారు. అవన్ని వాస్తవాలకు దూరం సార్.

టాయిలెట్లో - గోడల్లో డబ్బులు దాచుకొంటారని చూపించే 80 దశకం నాటి సినిమాలు చూడటం ఆపండి మోదీ గారు.. అప్రకటిత ఆదాయం - అక్రమంగా సంపాదించిన సంపదను వైట్ మనీగా మార్పిడి చేసుకోవడానికి డబ్బు ఎగవేసేలా ఎన్నో సేవలందించడానికి ఎన్నో సంస్థలు ఉన్నాయి. నల్లధనం తెల్లగా ఎలా మారుతుందోననే విషయం పనామా పేపర్స్ కుంభకోణంలో బయటపడిన విషయాన్ని ఇంకా ప్రజలు మర్చిపోలేదు. ఎందరో నా స్నేహితులు - కుటుంబ సభ్యులు - రాజకీయ మిత్రులు - వ్యాపారవేత్తలు దొడ్డిదారిన బ్యాంకుల్లో నగదు ఎప్పుడో మార్చుకొన్నారు. ఇక కుల ప్రభావం ఎక్కువగా కనిపించే గ్రామాల్లో పరిస్థితి మహాదారుణంగా ఉంది. ఒక్కసారిగా కృత్రిమంగా డబ్బు కొరత ఏర్పడింది. కొందరు రోజువారీ పనులు చేసుకోలేకపోతున్నారు.చిన్నపాటి వ్యాపారాలు నిలిచిపోయాయి" అంటూ ఆయన ఆ లేఖలో దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు.. వాస్తవ పరిస్థితులను కళ్లకు కట్టారు. మోడీ ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారన్నట్లుగా ఆలోచింపజేసేలా ఉన్న ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/