Begin typing your search above and press return to search.

సీఎం జగన్ మీద కేసు పెట్టటానికి స్టేషన్ కు వెళ్లిన సామాన్యుడికి ఏమైంది?

By:  Tupaki Desk   |   13 Dec 2022 5:05 AM GMT
సీఎం జగన్ మీద కేసు పెట్టటానికి స్టేషన్ కు వెళ్లిన సామాన్యుడికి ఏమైంది?
X
ఒక సామాన్యుడు రోటీన్ కు భిన్నంగా ఒక సాహసం చేశాడు. సంచలనంగా మారేలా తన చేష్టతో తన సమస్య పరిష్కారం అవుతుందని ఆశించాడో? లేదంటే ముఖ్యమంత్రి కంట్లో పడి.. సమస్య పరిష్కారం కావటమే కాదు.. సంబంధిత అధికారులకు షాకిస్తారని ఆశించినట్లున్నాడు. కానీ.. అతడి ప్రయత్నం బెడిసి కొట్టటమే కాదు.. తుక్కుగా దెబ్బలు తిని మరీ బయటకు రావాల్సి వచ్చిందంటూ భోరుమంటున్న వైనం ఏపీలో చోటు చేసుకుంది.

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం పరిధిలోని తిరిపాలు అనే వ్యక్తి తమ సమస్యల పరిష్కారానికి వినూత్న మార్గాన్ని ఎంచుకున్నాడు. తాము నివసించే వీరాయిపాలెం గ్రామంలో 500 మందికి పైనే ఉన్నా.. అందరికి కలిపి ఒకటే బోరు ఉండటంతో నీళ్ల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఈ సమస్య పరిష్కారానికి చాలామంది అధికారుల వద్దకు వెళ్లాడు.

తన విన్నపాన్ని వారికి ఇచ్చాడు. అయినా.. అధికారులు స్పందించలేదు. దీంతో.. సమస్య పరిష్కారం కోసం తమ సమస్యలకు కారణమైన ముఖ్యమంత్రి జగన్ మీద కేసు పెట్టాలని భావించాడు.

ఇందులో భాగంగా యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. ఎస్ఐ లేకపోవటంతో తాను స్టేషన్ కు వచ్చిన కారణాన్ని వెల్లడించాడు. అతడి మాటలు విన్నంతనే అక్కడి కానిస్టేబుల్ కు మంట మండింది. ముఖ్యమంత్రిపైనే కేసు పెట్టేందుకు వచ్చావా? అంటూ బెల్టుతో చితకబాదాడు.

దీంతో గాయాలపాలైన అతడు మీడియాతో మాట్లాడాడు. గత ఎన్నికల్లో తాను వైసీపీకి ఓటు వేశానని.. మరి తమ సమస్యల్ని జగన్ కాక మరెవరు తీరుస్తారు? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిపై కేసు పెట్టేందుకు స్టేషన్ కు వస్తావా? అంటూ కానిస్టేబుల్ వ్యవహరించిన తీరు ఇప్పుడు షాకింగ్ గా మారింది.

ఈ పోలీస్ స్టేషన్ మంత్రి అదిమూలపు సురేశ్ ప్రాతినిధ్యం వహిస్తుండటం గమనార్హం. పోలీసుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.