Begin typing your search above and press return to search.

బ్రెజిల్‌ లో మ‌రో క‌ల‌క‌లం: ఆదివాసీల‌కు క‌రోనా ముప్పు

By:  Tupaki Desk   |   9 April 2020 4:00 PM GMT
బ్రెజిల్‌ లో మ‌రో క‌ల‌క‌లం: ఆదివాసీల‌కు క‌రోనా ముప్పు
X
ప్ర‌పంచంలోనే భారీ విస్తీర్ణంలో ఉన్న అమెజాన్ అటవీ ప్రాంతంలో మొన్న‌టి దాక మంట‌లు వ్యాపించి ప‌చ్చ‌ద‌నమంతా బూడిదైన విష‌యం తెలిసిందే. ఆ మంట‌ల వ్యాప్తితో అట‌వీ ప్రాంతంలోని అరుదైన వృక్ష - జంతు జాతులు స‌జీవ ద‌హ‌న‌మయ్యాయి. దాన్నుంచి ఇంకా కోలుకోని బ్రెజిల్‌ కు ఇప్పుడు క‌రోనా వైర‌స్ తీవ్ర ముప్పు తెచ్చి పెట్టింది. బ్రెజిల్‌ లో ఆ వైర‌స్ తీవ్రంగా వ్యాపిస్తోంది. పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో ఆ వైర‌స్ క‌ట్ట‌డికి.. బాధితుల‌ను ర‌క్షించుకునేందుకు ఆ దేశం తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అయితే ఈ క్ర‌మంలో మ‌రో క‌ల‌క‌లం ఆ దేశంలో రేపింది. అదే అమెజాన్ అట‌వీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీల‌తో. అట‌వీ ప్రాంతంలో నివ‌సిస్తున్న వారికి కూడా క‌రోనా సోకింద‌నే వార్త‌లు ఆ దేశంతోపాటు ప్ర‌పంచంలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

క‌ల్లాక‌ప‌టం ఎరుగ‌ని అట‌వీ జాతి ప్ర‌జ‌ల‌ను కూడా క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెంద‌డం క‌ల‌క‌లం రేపుతోంది. దట్టమైన చెట్ల మాటున జీవించే ఆదివాసీల్లో కూడా ఏడు కరోనా వైరస్ కేసులు బయటపడ్డాయి. దీంతో బ్రెజిల్‌ లో ప‌రిస్థితులు ఆందోళనక‌రంగా మారాయి. ఆ దేశంలోని యానోమామి అనే తెగకు చెందిన ఆదివాసీల్లో ఏడుగురికి క‌రోనా కేసులు సోకాయ‌ని ఆ ఆరోగ్య శాఖ మంత్రి లూయిజ్ హెన్రిక్ మాండెట్టా ప్ర‌క‌టించారు. వాస్త‌వ ప్రపంచంతో సంబంధం ఉండని ఈ ఆదిమ జాతికి కరోనా సోకడం అనేక సందేహాల‌కు దారి తీస్తోంది. అట‌వీ ప్రాంతంలో ఉన్న వారికే క‌రోనా సోక‌డంతో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. ఆ క‌రోనా సోకిన యానోమామి తెగ జాతీయుల్లో 15 ఏళ్ల‌ కుర్రాడు కూడా ఉన్నాడు. ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. అంత‌కుముందు కోకామా తెగకు చెందిన 20 ఏళ్ల యువ‌తికి కూడా ఈ వైర‌స్ సోకింది. దీంతో అట‌వీ ప్రాంతవాసుల‌ను ర‌క్షించేందుకు బ్రెజిల్ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది.

ఆ దేశంలోని అటవీ ప్రాంతాల్లో దాదాపు 300కి పైగా వివిధ తెగలకు చెందిన 18 లక్షల మంది నివసిస్తున్నారని అంచ‌నా ఉంది. అట‌వీ ప్రాంతానికి ప‌రిమిత‌మైన ఈ తెగల్లో యానోమామికి చెందిన 27 వేల మంది ఉన్నట్టు స‌మాచారం. చెట్ల మ‌ధ్య జీవించే వీరికి క‌రోనా వైర‌స్ ఎలా సోకిందోన‌ని అక్క‌డి అధికారులు విచార‌ణ ప్రారంభించారు. ప్ర‌పంచానికి సంబంధం లేకుండా జీవించే ఆదిమ జాతీయులు కరోనా వైర‌స్ సోక‌డంతో మిగ‌తా దేశాలు కూడా అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. తమ దేశాల్లోని అట‌వీ ప్రాంతాల్లో కూడా క‌రోనా వైర‌స్‌పై వివ‌రాలు సేక‌రిస్తున్నారు.