Begin typing your search above and press return to search.

రామమందిరానికి మొఘల్ వారసుడి బంగారు ఇటుక

By:  Tupaki Desk   |   10 Nov 2019 11:05 AM GMT
రామమందిరానికి మొఘల్ వారసుడి బంగారు ఇటుక
X
ఎన్నో ఏళ్ల నుంచి హిందూ-ముస్లింల మధ్య గొడవకు కారణమవుతున్న అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదానికి సుప్రీం కోర్టు తెరదించిన సంగతి తెలిసిందే. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామమందిరం కట్టుకోవడానికి హిందువులకు సుప్రీం కోర్టు పర్మిషన్ ఇచ్చింది. దీనిపై ప్రతివాదులుగా ఉన్న ముస్లిం సంఘాలు కూడా రిట్ పిటీషన్ వేయకూడదని నిర్ణయించుకున్నాయి. ముస్లింలకు అయోధ్యలోనే 5 ఎకరాల స్థలం ఇవ్వాలని సుప్రీం కోర్టు కూడా తీర్పునిచ్చింది.

అయితే సుప్రీం కోర్టు హిందువులకు అనుకూలంగా ఇచ్చిన ఈ తీర్పుపై ముస్లిం సంఘాలు, ప్రముఖుల్లోనూ సానుకూలత వ్యక్తమవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ వివాదంపై ఎంఐఎం అధినేత ఓవైసీ సహా చాలా మంది స్పందించారు. తాజాగా మోఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ వారసుడు అయిన ప్రిన్స్ యాకుబ్ హబీబుద్దీన్ టుసీ కూడా అయోధ్య వివాదంపై స్పందించాడు.

శనివారం అయోధ్య భూవివాదంపై సుప్రీం తీర్పునివ్వడంతో ప్రిన్స్ యాకుబ్ మీడియాతో మాట్లాడుతూ సంచలన కామెంట్ చేశారు. తాను అయోధ్యలోని రామమందిర నిర్మాణానికి బంగారు ఇటుకను కానుక ఇస్తానని హామీ ఇచ్చారు. ఆలయ నిర్మాణానికి పునాది రాయి పడగానే.. ప్రధాని నరేంద్రమోడీని కలిసి బంగారు ఇటుకను బహూకరిస్తానని చెప్పుకొచ్చాడు.

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి దేశంలోని ముస్లింలు అందరూ హిందువులకు సహకరించాలని.. సోదరభావం చాటాలని ప్రిన్స్ యాకుబ్ పిలుపునిచ్చాడు. హిందూ ముస్లింలు కలిసి సాగితేనే అసలైన సెక్యులరిజమ్, మతసామరస్యం సాధ్యమవుతుందని.. ప్రపంచానికి ఒక గొప్ప పాఠం చెప్పగలమని కోరారు