Begin typing your search above and press return to search.

ఈ వీడియో చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి నిరసనలు అవసరమో తెలుస్తుంది

By:  Tupaki Desk   |   10 Aug 2022 5:00 AM GMT
ఈ వీడియో చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి నిరసనలు అవసరమో తెలుస్తుంది
X
రోడ్ల మీద గుంతలు తెలుగు రాష్ట్రాల్లో సర్వసాధారణం. ఈ గుంతలతో చోటు చేసుకునే ప్రమాదాలు.. అలాంటి వాటి కారణంగా పోయే ప్రాణాలెన్నో. అయినా.. పాలకులు మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోని పరిస్థితి. ఇంటి దగ్గర కాలు కదపకుండా ఉండేటోళ్లకు సంక్షేమ పథకాల పేరుతో తాయిలాలు ఇచ్చేసే ప్రభుత్వాల.. ప్రజలకు కనీస సౌకర్యాల్లో భాగమైన రోడ్లను సరిగా వేయటం ఇప్పటికి సాధ్యం కాలేదన్నది మర్చిపోకూడదు.

ఇటీవల కాలంలో రోడ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందన్న విషయాన్ని తెలియజేసేలా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇచ్చిన పిలుపుతో ఏపీలో నిర్వహించిన నిరసన ఎంతటి సూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

ఆ మాటకు వస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రోడ్ల మీద గుంతలు ఇటీవల కాలంలో ఎక్కువ అయ్యాయి. గడిచిన నెలన్నర గా కురుస్తున్న నేపథ్యంలో రోడ్ల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. చిన్న ఊళ్లు మొదలు కొని మహానగరాల వరకు ఇలాంటి పరిస్థితే. దీంతో.. రోడ్ల మీదకు రావాలంటేనే చిరాకు పుట్టే పరిస్థితి. రోడ్ల మీదకు ఏర్పడిన గుంతలతో ట్రాఫిక్ జాంలు ఏర్పడుతున్న పరిస్థితి. రోడ్ల మీద గుంతలపై పెద్ద ఎత్తున ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా.. పాలకుల్లో మాత్రం కదలిక రాని పరిస్థితి.

ఇలాంటి వేళ.. ఒక వైరల్ వీడియో కొత్త స్ఫూర్తిని ఇస్తుంది. పాలకుల చెంప ఛెళ్లుమనిపించేలా ఉన్న ఈ కొత్త తరహా నిరసనకు స్పూర్తి మాత్రం కేరళకు చెందిన ఒక వ్యక్తిగా చెప్పాలి.

కేరళలోని కమ్యునిస్టు ప్రభుత్వంలోనూ రోడ్ల మీద గోతులు తప్పలేదన్న విషయాన్ని తెలియజేయటమే కాదు.. రోడ్డు మధ్యలో ఉన్న గుంతలో నిలిచిన వర్షపు నీటితో స్నానం చేస్తూ.. అతగాడి నిరసన ఇప్పుడు సంచలనంగా మారింది.రోడ్డు మధ్యలో ఏర్పడిన గుంత.. అందులో నిలిచిన వర్షపు నీటితోనే అర్థనగ్నంగా సాన్నం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు అయిన వెంటనే.. ఇది కాస్తా వైరల్ గా మారింది.

ఒంటిపై టవల్.. బకెట్.. సబ్బు పట్టుకొని రోడ్డు మీద ఉన్న గుంతలోకి దిగి స్నానం చేయటం షురూ చేశాడు.ఆ బురద నీటిలోనే సూర్య నమస్కారాలు.. పద్మాసనం వేయటం ద్వారా పాలకుల వైఫల్యాల్ని తనదైన శైలిలో ఎత్తి చూపారని చెప్పాలి. ఈ వీడియో వైరల్ గా మారింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకు తమ వైఫల్యాలను తెలియజెప్పేలా వీడియోలు రావటం ద్వారా.. ప్రభుత్వాల్లో చలనం వస్తుందన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.