Begin typing your search above and press return to search.

గాంధీలకు అగ్ని పరీక్ష... ?

By:  Tupaki Desk   |   19 Feb 2022 11:30 PM GMT
గాంధీలకు అగ్ని పరీక్ష... ?
X
ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి మరి కొద్ది నెలల్లో డెబ్బై అయిదు సంవత్సరాలు నిండుతున్నాయి. భారత్ లో అతి పెద్ద రాజకీయ కుటుంబంగా నాటి నుంచి నేటి దాకా గాంధీ నెహ్రూ ఫ్యామిలీ ఉంది. తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఈ దేశాన్ని పదిహేడేళ్ళు సుధీర్ఘ కాలం పాటించారు. ఓటమి ఎరుగని వీరుడుగా ఆయన నిలిచారు. ఆయన తరువాత కుమార్తె ఇందిరా గాంధీ పదహారేళ్ళ పాటు దేశానికి ప్రధానిగా ఉన్నారు. ఆమె ఒక దఫా తాను ఓడి పార్టీని ఓడించారు. అయినా ఇందిరా గాంధీ ఐరన్ లేడీగా ప్రఖ్యాతి చెందారు. ఆమె మంచి వ్యూహకర్త. కాంగ్రెస్ కి అసలైన బలం కూడా అమె.

ఆమె తరువాత నిజానికి వారసుడిగా సంజయ్ గాంధీ రావాల్సింది. కానీ ఆయన ఒక ప్రమాదంలో కేవలం 32 ఏళ్ళకే కన్ను మూశారు. రాజకీయాల పొడ పెద్దగా గిట్టని రాజీవ్ గాంధీ 1980 తరువాత రాజకీయ అరంగేట్రం చేశారు. రాజీవ్ గాంధీ ఒకసారి కాంగ్రెస్ ని గెలిపించగలిగారు. అది తన తల్లి ఇందిరాగాంధీ దారుణ హత్య తరువాత జరిగిన ఎన్నికలు కావడంతో సానుభూతి వెల్లువలా కురిసింది.

ఇక ఆయన 1989లో ఓటమి చెందారు. 1991లో ఆయన సైతం దారుణహత్యకు గురి అయితే వచ్చిన సానుభూతితో కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా అవతరించి పీవీ నరసింహారావు నాయకత్వాన కేంద్రంలో మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సోనియా గాంధీ నాయకత్వాన సైతం కాంగ్రెస్ సొంతంగా మెజారిటీని సాధించకపోయినా మిత్రులను ఆకట్టుకుని యూపీయే వన్ యూపీయే టూ పేరిట రెండు సార్లు అధికారంలోకి వచ్చింది.

మోడీ నాయకత్వాన బీజేపీ చేతిలో 2014, 2019 ఎన్నికలలో రెండు సార్లు కాంగ్రెస్ ఓడింది. దానికి కారణాలు చాలా ఉన్నా కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ తీసికట్టు కావడమే అసలైన రీజన్ అని అంటారు. సోనియా గాంధీ అనారోగ్య కారణాల రిత్యా మునుపటి మాదిరిగా పార్టీ మీద పట్టు బిగించలేకపోతున్నారు. ఇప్పటికి రెండు దశాబ్దాలుగా ఎంపీగా గెలుస్తూ వస్తున్న రాహుల్ గాంధీ అయితే ఇంకా తనను తాను నిరూపించుకునే పనిలోనే ఉన్నారు.

కొత్తగా ప్రియాంకా గాంధీ కూడా రంగప్రవేశం చేసి కాంగ్రెస్ ని బతికించాలని చూస్తున్నారు. ప్రస్తుతం ఉత్తరాదిన అయిదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో కాంగ్రెస్ పంజాబ్ లో మాత్రమే అధికారంలో ఉంది. ఇక యూపీలో 2017లో కాంగ్రెస్ కి యూపీలో ఏడు ఎమ్మెల్యే సీట్లు మాత్రమే వచ్చాయి. కాలికి బలపం కట్టుకుని ప్రియాంకా గాంధీ యూపీ అంతటా తిరుగుతున్నారు. ఆమె కృషి ఫలించి కాంగ్రెస్ ఏడు నుంచి ఏ పాతిక సీట్లకు ఎగబాకినా కూడా అది కాంగ్రెస్ కి ఊపిరిని ఇచ్చినట్లే. రేపటికి ధీమా వచ్చినట్లే.

అయితే సీన్ చూస్తూంటే వార్ అంతా బీజేపీ ఎస్పీల మధ్యనే సాగుతోంది. దాంతో కాంగ్రెస్ సింగిల్ డిజిట్ దాటుతుందా అన్న డౌట్లు వస్తున్నాయి. పంజాబ్ లో చూస్తే కాంగ్రెస్ లోనే గ్రూపులు ఉన్నాయి. ఆప్ సవాల్ చేస్తోంది. కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళిన కెప్టెన్ అమరీందర్ సింగ్ కాంగ్రెస్ ఓట్లకు గండి కొట్టనున్నారని టాక్. ఉత్తరాఖండ్ లో బీజేపీ లెక్కలేనన్ని తప్పులు చేసినా కాంగ్రెస్ లో అంతకు మించి వర్గ పోరు ఉంది. దాంతో అక్కడ కాంగ్రెస్ గెలుపు కష్టమే అంటున్నారు.

గోవాలో కాంగ్రెస్ కి తృణమూల్ కాంగ్రెస్, ఆప్ ల నుంచే ఇబ్బంది ఉంది అంటున్నారు. ఈ రెండు పార్టీలూ అక్కడ పోటీ చేస్తూ కాంగ్రెస్ ఓట్లనే చీలుస్తున్నాయి. దాంతో బీజేపీకి ఇది వరంగా మారినా ఆశ్చర్యం లేదు అని చెబుతున్నారు. మణిపూర్ లో కూడా కాంగ్రెస్ కి ఏమంత ఆశలు లేవని అంటున్నారు.

ఇక ప్రియాంకా గాంధీ రాహుల్ గాంధీ కనుక ఈ ఎన్నికల్లో కనీసం రెండు రాష్ట్రాల్లో ఆ పార్టీని గెలిపించడమే కాదు, మిగిలిన చోట్ల ఆశించిన ఫలితాలు తీసుకురాకపోతే కచ్చితంగా ఆ పార్టీకి అతి పెద్ద ముప్పు పొంచి ఉందనే అంటున్నారు. ఇప్పటికే సీనియర్లు గుర్రు మీద ఉన్నారు.

ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తేడా కొడితే కాంగ్రెస్ లో అసమ్మతి దావానలంగా ఎగిసిపడే ప్రమాదం ఉంది. అపుడు గాంధీలకు చెందని వారు కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా రావాలన్న డిమాండ్ కూడా ఊపందుకోవడం ఖాయం. ఇప్పటికే బయట మిత్రులు ఎవరూ పట్టించుకోకుండా ఉన్న కాంగ్రెస్ లో గాంధీలను పక్కన పెడితే ఈ శతాధిక వృద్ధ పార్టీ ఫ్యూచర్ ఏంటి అన్నది కూడా చూడాలి. ఏది ఏమైనా కాంగ్రెస్ లో గాంధీల శకం కొనసాగుతుందా లేదా అన్నది తేల్చేవి ఉత్తరాది ఎన్నికలే అంటున్నారు.