Begin typing your search above and press return to search.

ఏపీలో కూతురికి గుడి కట్టిన తండ్రి!

By:  Tupaki Desk   |   21 Nov 2022 9:32 AM GMT
ఏపీలో కూతురికి గుడి కట్టిన తండ్రి!
X
ఆడ పిల్ల పుడుతుందనుకుంటే వద్దనుకునే వారే ఎక్కువ. పుట్టాక చీదరించుకునేవారి సంఖ్యా ఎక్కువే. పెళ్లి చేసేసి తమ గుండెల మీద కుంపటి వదిలిందని భావించేవారి సంఖ్యా తక్కువ కాదు. అయితే ఇలాంటి వారందరూ ఈ తండ్రిని చూసి మాత్రం సిగ్గు పడాల్సిందే. తన కుమార్తె మరణిస్తే తట్టుకోలేక తన కూతురికి ఏకంగా గుడే కట్టించాడీ తండ్రి. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరులో గుడి కట్టించి ఆమె పేరిట ఆరాధనోత్సవాలను కూడా నిర్వహిస్తుండటం విశేషం.

వివరాల్లోకెళ్తే.. శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా వెంకటాచలం మండలంలోని కాకుటూరుకు చెందిన చెంచయ్య, లక్ష్మమ్మ భార్యాభర్తలు. వీరికి ఐదుగురు సంతానం ఉన్నారు. వారిలో నాలుగో సంతానంగా కుమార్తె జన్మించింది. ఆమెకు సుబ్బలక్ష్మమ్మ అని పేరు పెట్టారు. ఈమె పుట్టాకే చెంచయ్యకు బాగా కలిసి వచ్చింది. ఆర్థికంగా బాగా స్ధిరపడ్డారు.

ఈ నేపథ్యంలో అప్పటి నుంచి చెంచయ్యకు తన నాలుగో కుమార్తె అంటే బాగా ఇష్టం. డిగ్రీ వరకు సుబ్బలక్ష్మమ్మకు చదువు చెప్పించారు. ఆమె కూడా తన తండ్రి ప్రేమకు తగ్గట్టే బాగా చదువుకుని అటవీ శాఖలో ఉద్యోగం సంపాదించింది.

అంతా సవ్యంగా జరిగిపోతోందనుకునే లోపు విధి ఆ కుటుంబాన్ని చిన్నచూపు చూసింది. 2011లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సుబ్బలక్ష్మమ్మ మృత్యువాత పడింది. దీంతో తల్లిదండ్రులు చెంచయ్య, లక్ష్మమ్మ కన్నీరుమున్నీరుగా విలపించారు. ముఖ్యంగా తన కుమార్తెను గారాల పట్టిగా పెంచిన చెంచయ్య అయితే ఆ బాధ నుంచి కోలుకోలేకపోయాడు. నిత్యం ఆమెను తలచుకుంటూనే బాధపడుతుండేవాడు.

ఈ క్రమంలో ఓ రోజు తండ్రి చెంచయ్యకు కుమార్తె సుబ్బలక్ష్మమ్మ కలలో కనపడింది. తనకు గుడి కట్టించాలని కోరిందట. దీంతో చెంచయ్య తన కూతురిపైన ప్రేమతో గుడి నిర్మించి కుమార్తె రూపంలో ఒక విగ్రహాన్ని తయారు చేయించారు. విగ్రహానికి నిత్య పూజలు చేస్తున్నారు. అంతేకాకుండా ఏటా ఆమె జన్మదినం నాడు ఆరాధనోత్సవాలు కూడా నిర్వహిస్తున్నారు. గుడిని నిర్మించి అందులో విగ్రహాన్ని ప్రతిష్టతించి తన కుమార్తెను అందులో చూసుకుని చెంచయ్య రోజులు వెళ్లదీస్తున్నారు.

కూతురిపైన ప్రేమతో గుడి కట్టించి ఏటా ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్న చెంచయ్యను అంతా పొగుడుతున్నారు. కుమార్తెను పెళ్లి చేసి వదిలించుకునేవారున్న ఈ రోజుల్లో కూతురి పేట గుడి కట్టించడం గొప్ప విషయమని ప్రశంసిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.