Begin typing your search above and press return to search.

చెత్త వేయండి..ఫ్రీ వైఫై పొందండి

By:  Tupaki Desk   |   5 Jan 2017 12:02 PM GMT
చెత్త వేయండి..ఫ్రీ వైఫై పొందండి
X
టెక్నాల‌జీని ప్ర‌జా జీవితంలో స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఉప‌యోగిస్తే ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయో తెలియ‌జెప్పేందుకు ఇది చ‌క్క‌టి ఉదాహ‌ర‌ణ‌. రహదారులు - బహిరంగ ప్రదేశాల్లో కొందరు చెత్త ఎక్కడ పడితే అక్కడ వేస్తుంటారు కదా. ఇది ఎంత చికాకుగా ఉంటుందో మాటల్లో చెప్ప‌లేం. అలాంటి వారిలో మార్పు తేవడం కోసం - చెత్త లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం కోసం ముంబైకి చెందిన ఓ స్టార్టప్ వినూత్న ప్రయోగంతో ముందుకు వచ్చింది. చెత్త వేయండి ఉచితంగా వైఫై పొందండి అనేది ఈ సూప‌ర్ డూప‌ర్ కాన్సెప్ట్ తాలుకూ సారంశం.

ముంబైకి చెందిన థింక్ స్క్రీమ్ (THINK SCREAM) అనే ఓ స్టార్టప్ కంపెనీ కొత్తగా వైఫై ట్రాష్ బిన్‌ లను తయారు చేసింది. వీటిలో చెత్త వేస్తే చాలు. యూజర్లు 15 నిమిషాల పాటు వైఫైని ఉచితంగా వాడుకోవచ్చు. ఇది ఎలా ప‌నిచేస్తుందంటే...ఈ వైఫై ట్రాష్ బిన్ సాధారణ చెత్త కుండీలను పోలి ఉంటుంది. ఎత్తు నాలుగున్నర అడుగులు ఉంటుంది. దీని కింది భాగంలో ఓ ఇన్‌ ఫ్రారెడ్ సెన్సార్ ఉంటుంది. అది యూజర్లు వేసిన చెత్తను గుర్తించి పై భాగంలో అమర్చిన ఎల్‌ ఈడీ స్క్రీన్‌ కు మెసేజ్ పంపుతుంది. దీంతో ఆ మెసేజ్‌ ను రిసీవ్ చేసుకున్న ఎల్‌ ఈడీ స్క్రీన్‌ పై ఓ పాస్‌ వర్డ్ దర్శనమిస్తుంది. దాన్ని ఉపయోగించి ట్రాష్ క్యాన్‌ లో అమర్చిన వైఫై రూటర్‌ కు యూజర్లు కనెక్ట్ అవచ్చు. ఈ క్రమంలో అలా చెత్త వేశాక ఓసారి వైఫైకు కనెక్ట్ అయితే దాన్ని 15 నిమిషాల వరకు ఉచితంగా వినియోగించుకోవచ్చు. 50 మీటర్ల దూరంలోనూ ఆ వైఫై ద్వారా ఇంటర్నెట్‌ ను పొందవచ్చు. ఇది 'చెత్త' స‌మ‌స్య‌కు 'కొత్త' ప‌రిష్కారం.

ఈ మధ్యే కొత్తగా ఏర్పాటు చేసిన ఈ వైఫై ట్రాష్ బిన్‌ లకు మంచి స్పందనే వస్తుందని సదరు స్టార్టప్ చెబుతోంది. ఈ క్రమంలో ముంబై వ్యాప్తంగా ఇలాంటి వైఫై ట్రాష్ బిన్‌ లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది. ఇలాంటి మంచి ప్ర‌య‌త్నం ఫ‌లించి అయినా చెత్త‌కు విముక్తి దొరుకుతుంద‌ని ఆశిద్దాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/