Begin typing your search above and press return to search.

ఇంతకాలానికి పవన్నుండి ఓ మంచి సూచనొచ్చిందే!!

By:  Tupaki Desk   |   12 Oct 2020 7:00 AM IST
ఇంతకాలానికి పవన్నుండి ఓ మంచి సూచనొచ్చిందే!!
X
రాజకీయాల్లోకి అడుగుపెట్టడమే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంచి దూకుడు మీద వచ్చారు. ఆ దూకుడు కూడా సమస్యల మీదకన్నా జగన్మోహన్ రెడ్డి మీదే ఎక్కువగా కనిపించింది. ప్రతిపక్షంలో ఉన్నంత కాలం జగన్+వైసీపీ నేతలపై పవన్ ఎంతగా మండిపోయాడో అందరు చూసిందే. మామూలుగా ఏ రాష్ట్రంలో చూసినా ప్రతిపక్షాలన్నీ కలిసి కానీ లేదా దేనికదే విడివిడిగా అధికారపక్షాన్ని టార్గెట్ చేస్తాయి. కానీ విచిత్రంగా ఏపిలో మాత్రం ప్రతిపక్షంలో ఉంటూ మరో ప్రతిపక్షాన్ని టార్గెట్ చూసుకోవటం ఒక్క పవన్ కే చెల్లింది.

సరే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొంత కాలం ప్రభుత్వాన్ని టార్గెట్ చేయటం మరికొంత కాలం అడ్రస్ లేకుండా రాజకీయాల నుండి దూరంగా జరగటం పవన్ కు అలవాటైపోయింది. రాజకీయాలకన్నా సినిమాల వైపే ఎక్కువ దృష్టి పెడుతున్న పవన్ తాజాగా ప్రభుత్వానికి ఓ మంచి సూచన చేశారు. అదేమిటంటే ఈమధ్యనే రాష్ట్రప్రభుత్వం అమల్లోకి తెచ్చిన జగనన్న విద్యా కానుక ను మోడి-జగనన్నగారి కానుక అని పేరు మార్చాలని సూచించారు. ఎందుకంటే ఈ పథకానికి ఖర్చయ్యే నిధుల్లో కేంద్రప్రభుత్వం 60 శాతం నిధులను భరిస్తోందట. రాష్ట్రప్రభుత్వం భరిస్తున్న 40 శాతం నిధులకే మొత్తం పథకానికి కేవలం జగనన్నకానుక అని పేరు ఎలా పెడతారంటూ పవన్ అడగటంలో తప్పేమీ లేదు.

అయితే పవన్ మరచిపోయిందేమంటే రాష్ట్రప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ అమలు చేసే కార్యక్రమాలు, పథకాల్లో ఇది కేంద్రప్రభుత్వం షేరు, ఇది రాష్ట్రప్రభుత్వం షేరని ప్రత్యేకంగా చెప్పదు. పథకాలు, కార్యక్రమాలను నేరుగా అమలు చేసేది రాష్ట్రప్రభుత్వాలే కాబట్టి మొత్తంగా తమ పథకాలు, కార్యక్రమాలుగానే అమలు చేస్తాయి. రాష్ట్రాల్లో కూడా నేరుగా కేంద్రమే నిధులిచ్చి అమలు చేసే కార్యక్రమాలుంటే మాత్రం తమ పథకాలుగానే చెప్పుకుంటుంది కేంద్రం. చంద్రబాబునాయుడు హయాంలో కేంద్రం ఇలాగే చేసింది. కేంద్రం నిధులతో వేసిన రోడ్ల విషయంలో కేంద్రం ప్రత్యేకంగా బోర్డులను పెట్టించింది. అంటే ఎన్డీఏలో నుండి చంద్రబాబు బయటకు వచ్చేసిన తర్వాత జరిగిన పరిణామం లేండి అది.

సరే నిధులు కేంద్రానిదా లేకపోతే రాష్ట్రప్రభుత్వానిదా అన్న విషయాన్ని పక్కన పెట్టేస్తే మొత్తం ప్రజలు కట్టే పన్నులే అన్న విషయం అందరికీ తెలిసిందే. జనాలకు పథకాలు అందుతున్నాయా లేదా అన్నది మాత్రం ప్రధానం. డబ్బులు ఎవరివి అన్నది వాళ్ళకు అనవసరం. ఏదేమైనా జగనన్న విద్యా కానుక పథకం పేరు విషయంలో ట్విట్టర్ వేదికగా పవన్ చేసిన సూచనలో తప్పేమీలేదు. కాబట్టి రాష్ట్రప్రభుత్వం ఈ సూచనను పాజిటివ్ గా తీసుకుంటే రాష్ట్ర బీజేపీ నేతలు కూడా సంతోషిస్తారు కదా.