Begin typing your search above and press return to search.

రైతులకు కేసీఆర్ చెప్పే శుభవార్త ఏమై ఉంటుంది?

By:  Tupaki Desk   |   30 May 2020 7:30 AM GMT
రైతులకు కేసీఆర్ చెప్పే శుభవార్త ఏమై ఉంటుంది?
X
అసలు విషయాన్ని చెప్పటానికి ముందు ఒక చిన్న కొసరు మాటను చెప్పాలి. అప్పుడు విషయం ఇట్టే అర్థమైపోవటమే కాదు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన ధోరణి ఎలా ఉంటుందన్న దానిపైనా స్పష్టత వస్తుంది. కొడుకు తాను చెప్పినట్లుగా వినాలన్న కోరిక ఏ తండ్రికైనా ఉండేదే. తాను చెప్పిన మాటను కొడుక్కి ఇష్టం లేకున్నా.. తప్పని పరిస్థితుల్లో చేస్తుంటారు. అలాంటప్పుడు తన కొడుకు మనసును నొప్పించినట్లుగా ఫీలయ్యే తండ్రి.. కొడుక్కి ఏదో ఒక బహుమతి ఇచ్చి సంతోషపెట్టే పని చేస్తారు. అంతేనా? ఏదైనా తప్పు చేసినప్పుడు దండించాక.. తన కొడుకు బాధ తీర్చేందుకు ఏదో ఒక బహుమతి ఇవ్వటం అందరి ఇళ్లల్లోనూ కనిపించేదే.

తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి వచ్చిన మాట ఈ కోవలోకే చెందిందని చెప్పాలి. రైతులకు శుభవార్త చెప్పనున్నట్లుగా ఆయన ఊరిస్తున్నారు. ఏదైనా స్వీట్ న్యూస్ చెప్పే ముందు నేరుగా సినిమా చూపిస్తే మజా ఏముంటుంది? అందుకే.. తొలుత టీజర్.. తర్వాత సినిమా చూపించాలన్నట్లుగా కేసీఆర్ మాటలు ఉన్నాయి. ఇంతకూ ఇప్పుడు రైతులకు స్వీట్ న్యూస్ చెప్పాల్సిన అవసరం ఉందా? అంటే.. లేదనే చెప్పాలి. కానీ.. తాను చెప్పిన పంటనే పండించాలని.. లేకుంటే ప్రతి ఏటా రెండుసార్లు ఇచ్చే రైతుబంధు పథకాన్ని అమలు చేయమంటూ.. అన్నదాతలకు చికాకు తెప్పించే మాటను కేసీఆర్ చెప్పటాన్ని మర్చిపోకూడదు.

తాను అనుకున్నది అనుకున్నట్లు జరగకపోతే.. కేసీఆర్ కు మా చెడ్డ కోపం వచ్చేస్తుంటుంది. తన మాట వినని వారిని ఆయన అస్సలు తట్టుకోలేరు. అదే సమయంలో రైతులు మిగిలిన వారి మాదిరి కాదు. వారి మీద పరిమితులు తీసుకొచ్చి పని చేయించటం కష్టమైన పని. ఒక్కోరైతు ఒక్కోపంటనే ఎందుకు వేస్తాడన్నదానికి బోలెడన్ని అంశాలు ఉంటాయి.

అయితే.. అందుకు భిన్నంగా నేను చెప్పిన పంటనే నువ్వు పండించాలని రైతును ప్రభుత్వాలు ఆదేశిస్తే.. దాన్ని రైతులెవరూ ఇష్టపడరు. ఆ విషయం కేసీఆర్ కు తెలియంది కాదు. కానీ.. తాను అనుకున్న ప్లాన్ పక్కాగా జరగాలంటే తాను కరకుగా ఉండాలన్నది కేసీఆర్ ఆలోచన. అదే సమయంలో తన మీద వచ్చే వ్యతిరేకతను తగ్గించుకునేందుకు వీలుగా శుభవార్త ఎపిసోడ్ ను తెర మీదకు తెచ్చారని చెప్పాలి. ఇంతకూ కేసీఆర్ చెప్పే శుభవార్త ఏమై ఉంటుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. పంట వేసే రైతులకు తప్పనిసరిగా అవసరమైన పురుగుమందులు.. ఎరువులను ఉచితంగా అందించేందుకు వీలుగా ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో పంటలు పండించే రైతులకు రైతుబంధు.. రైతు బీమా.. విత్తన సబ్సిడీ.. పంట కొనుగోలు కార్యక్రమాల్ని నిర్వహిస్తున్న వేళ.. వారికి అవసరమైన ఎరువులు.. పురుగుమందులే కీలకం అవుతాయి. వాటిని కానీ ఉచితంగా అందిస్తే.. వ్యవసాయం పండుగలా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే.. పెట్టబడి తగ్గి.. రైతులకు వెసులుబాటు కలుగుతుంది. అందుకే.. ఈ అంశం మీద కేసీఆర్ ఫోకస్ చేసినట్లు చెబుతున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికి ఎరువులు.. పురుగుమందులు ఉచితంగా పంపిణీ చేయటం భారీ ఖర్చుతోకూడుకున్నది. అందుకే.. కొన్ని విదివిధానాలతో ఈ పథకాన్ని అమలు చేసే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. ఒకవేళ ఇది కాకుంటే.. ఉపాధి హామీ పనుల్ని వ్యవసాయానికి అనుసంధానం చేయటం.. పంట వేయటానికి ముందే దాని కొనుగోలు ధరను ఫిక్స్ చేయటం లాంటివి కూడా ఉండే అవకాశం ఉందంటున్నారు.