Begin typing your search above and press return to search.

పెరిగిపోతున్న బ్లాక్ ఫంగస్ సమస్య

By:  Tupaki Desk   |   25 May 2021 7:30 AM GMT
పెరిగిపోతున్న బ్లాక్ ఫంగస్ సమస్య
X
రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ సమస్య పెరిగిపోతోంది. కరోనా వైరస్ కు చికిత్స చేయించుకున్న రోగుల్లో షుగర్, ఒబెసిటీ లాంటి సమస్యలున్న పేషంట్లలో బ్లాక్ ఫంగస్ సమస్య పెరిగిపోతోంది. అలాగే ఆక్సిజన్ తీసుకున్న రోగుల్లో కూడా బ్లాక్ ఫంగస్ సమస్య ఎక్కువగా కనబడుతోందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి నేపధ్యంలో యాంపోటెరిసిన్-బి ఇంజక్షన్లు దొరక్క రోగుల తాలూకు కుటుంబసభ్యులు నానా అవస్తలు పడుతున్నారు. అవసరమైన ఇంజక్షన్లు దొరక్కపోవటంతో రోగుల్లో డెత్ రేట్ పెరిగిపోతోంది.

రాష్ట్రం మొత్తం అధికారికంగా 252 మంది బ్లాక్ ఫంగస్ బాధితులున్నట్లు అంచనా. అయితే కేంద్రంనుండి వచ్చిన ఇంజక్షన్లు 575 మాత్రమే. ఈ ఇంజక్షన్లను రోగుల బరువు ప్రకారం ఇవ్వాల్సుంటుంది. రోగి బరువు ప్రతి కిలోలకు 5 ఎంజి చొప్పున ఇంజక్షన్ ఇస్తారు. సో ఈ లెక్కన చూస్తే ఉన్న బాధితులు, వచ్చిన ఇంజక్షన్లకు ఏమాత్రం పొంతనలేదు. 575 ఇంజక్షన్లు మహా అయితే 10 మంది పేషంట్లకు పూర్తిస్ధాయిలో ఇవ్వాలన్నా కష్టమే.

ఇలాంటపుడు వచ్చిన ఇంజక్షన్ల కోసం బాధితుల తరపునుండి వైద్యులపై తీవ్రమైన ఒత్తిడి పెరిగిపోతోంది. అవసరమైన ఇంజక్షన్లు దొరకని కారణంగా బాధితుల కుటుంబసభ్యులు బ్లాక్ లో అయినా సరే కొనాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని ఆవకాశంగా తీసుకుని కొందరు బ్లాక్ మార్కెట్లో కూడా విపరీతమైన ధరలకు అమ్ముతున్నారు. విజయవాడలో ఒక్కో వయల్ కోసం రు. 50 వేలు పెట్టడానికి సిద్ధమైనా దొరకటంలేదు. ఇంజక్షన్ల కొరత కారణంగా ప్రభుత్వమే అవసరం ప్రకారం బాధితులకు అందించే ఏర్పాట్లు చేస్తోంది.

అందుకనే పేషంట్లు చికిత్స తీసుకుంటున్న ఆసుపత్రుల నుండి రిక్వెస్టులు వస్తే మాత్రమే ఇంజక్షన్లు ఇస్తున్నది ప్రభుత్వం. అదికూడా రోగి ఆరోగ్య పరిస్ధితిని సమీక్షించిన తర్వాత ఎవరికి అవసరం అని తేల్చుకున్న తర్వాత వాళ్ళకు మాత్రమే అందిస్తున్నారు. ఈ పరిస్ధితుల్లో 10 ఆసుపత్రుల నుండి ఇంజక్షన్ అవసరమని రిక్వెస్టులు వస్తే అందులో రెండు మూడు ఆసుపత్రుల్లోని బాధితులకు మాత్రమే అందుతున్నాయి. మరి మిగిలిన బాధితుల పరిస్దితి ఏమిటి ?