Begin typing your search above and press return to search.

ఆ దంప‌తుల‌కు హోట‌ల్లో ప్ర‌వేశం లేద‌ట‌!

By:  Tupaki Desk   |   5 July 2017 8:37 AM GMT
ఆ దంప‌తుల‌కు హోట‌ల్లో ప్ర‌వేశం లేద‌ట‌!
X

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో జ‌రిగే కులాంత‌ర వివాహాల నేప‌థ్యంలో ఊరి నుంచి వెలివేత‌లు, సాంఘిక బ‌హిష్క‌ర‌ణ‌ల గురించి విన్నాం. కొన్ని ప్రాంతాల్లో జ‌రిగే ప‌రువు హ‌త్య‌ల గురించి అనేక వార్త‌లు వింటుంటాం. అయితే కులాంత‌ర వివాహం చేసుకున్న వారిని కొన్ని హోట‌ళ్లు కూడా బ‌హిస్క‌రిస్తాయ‌న్న‌సంగ‌తి తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. కులాంత‌ర విహహం చేసుకున్నార‌నే కార‌ణంగా ఓ జంట‌కు గ‌ది ఇవ్వ‌డానికి నిరాక‌రించింది హోట‌ల్ యాజ‌మాన్యం. ఈ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న బెంగుళూరులో జ‌రిగింది.

కేరళకు చెందిన సఫీక్ సుబేదియా హకీం - దివ్యలు కులాంత‌ర వివాహం చేసుకున్నారు. ఈ దంపతులు ఓ పని మీద బెంగుళూరుకొచ్చారు. అణ్ణిపురం మెయిన్‌ రోడ్‌ లో ఉన్న సుధామ నగర్‌ ఆలివ్ రెసిడెన్సీలో రూం కోసం వెళ్లారు. వారి వివరాలు తెలుసుకున్న రిసెప్ష‌నిస్ట్ వారిక రూం ఇవ్వ‌డానికి నిరాక‌రించాడు. కులాంత‌ర వివాహం చేసుకున్న వారికి త‌మ హోట‌ల్లో రూం ఇవ్వ‌బోమ‌ని తెగేసి చెప్పాడు.

తన భార్య ఎల్‌ ఎల్‌ ఎమ్ గ్రాడ్యుయేట్ అని, ఓ కాలేజీలో ఇంటర్వ్యూ కోసం బెంగుళూరుకు వచ్చామ‌ని స‌ఫీక్‌ చెప్పారు. హోట‌ల్ యాజ‌మాన్యం సమాధానం తనకు షాక్‌ కు గురిచేసిందని చెప్పాడు. చివరికి వేరే హోటల్‌ లో రూం తీసుకుని ఇంటర్వ్యూకు హాజరయినట్లు తెలిపాడు. అభివృద్ధి చెందిన బెంగళూరు మ‌హా నగరంలో ఇలా జరగడంపై సఫీక్, దివ్య విస్మయం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేరళ మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నట్లు సఫీక్ చెప్పాడు