Begin typing your search above and press return to search.

ప్రణయ్ విగ్రహం..మారుతీరావు కోసం ర్యాలీ

By:  Tupaki Desk   |   25 Sep 2018 7:14 AM GMT
ప్రణయ్ విగ్రహం..మారుతీరావు కోసం ర్యాలీ
X
ఎవరి వాదన వారిది.. ఎవరి విశ్లేషణ వారికి అనుకూలంగా వినిపిస్తున్నారు. కులాలు.. మ‌తాలు కాసేపు ప‌క్క‌న పెట్టేసి.. సింఫుల్ గా ఆలోచిద్దాం. ఇద్ద‌రు మేజ‌ర్లు ఇష్ట‌ప‌డ్డారు. త‌మ ప్రేమ‌కు పెళ్లితో కామా పెట్టాల‌నుకున్నారు. పెళ్లి చేసుకున్నారు. అణగారిన సామాజికవర్గానికి చెందిన యువకుడిని త‌న కూతురు పెళ్లి చేసుకోవ‌టం అమ్మాయి తండ్రికి ఇష్టం లేదు. అంత మాత్రానికే కోటికి పైగా సుపారీ ఇచ్చేసి మ‌రీ చంపేయాల‌న్న డ‌ర్టీ ప్లాన్ వేయాల్సిన అవ‌స‌రం ఉందా? అన్న‌ది ఒక ప్ర‌శ్న‌.

స‌రే.. పెంచిన ప్రేమ‌.. చేతిలో ఉన్న వంద‌ల కోట్లతో వ‌చ్చే ఇగో పుణ్య‌మా అని.. ప‌రువు.. ప్ర‌తిష్ఠ అన్న పిచ్చి మాట‌ల‌తో ఒక నిండు ప్రాణాన్ని చిదిమేశాడు.. ఇందులో న్యాయ అన్యాయాలను మనం పక్కనపెడుదాం. ఎందుకంటే మారుతీరావు కోసం కొందరు.. అమ్మాయి అమృత బాధ విని మరికొందరు ఇప్పుడు మిర్యాల గూడలో రెండు వర్గాలుగా విడిపోయారు. తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాలు చూస్తే.. ఏమిటిదంతా? అన్న భావ‌న క‌లుగ‌క మాన‌దు.

మిర్యాల‌గూడ‌లో ఇటీవ‌ల హ‌త్య‌కు గురైన ప్ర‌ణ‌య్ విగ్ర‌హాన్ని ప‌ట్ట‌ణంలో ఏర్పాటు చేయాల‌ని ఆయన భార్య అమృత పూనుకుంది. ఆమెకు సపోర్ట్ గా కొంతమంది విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కొత్తగా మరో వర్గం విగ్రహం పెట్టకూడదని నిరసనకు దిగింది. వీరంతా హత్య చేయించిన మారుతీరావుకు సపోర్టుగా నిలుస్తున్నారు. ప్రణయ్ విగ్ర‌హాన్ని ఎలా ఏర్పాటు చేస్తారో చూస్తామంటూ మంగళవారం వీధుల్లోకి వచ్చారు.

మారుతీరావుకు చెందిన సామాజిక వ‌ర్గానికి (వైశ్య‌) చెందిన ప‌లువురు రోడ్ల మీద‌కు వ‌చ్చారు. న‌ల్గొండ‌లోని వాస‌వీభ‌వ‌న్ నుంచి జైలు వ‌ర‌కు ఆర్య‌వైశ్య సంఘం.. త‌ల్లిదండ్రుల ప‌రిర‌క్ష‌ణ వేదిక ఆధ్వ‌ర్యంలో భారీ ర్యాలీ నిర్వ‌హించారు. అనంత‌రం జైల్లో ఉన్న మారుతీరావు.. ఆయ‌న సోద‌రుడు శ్ర‌వ‌ణ్ ల‌ను క‌లిశారు. అనంత‌రం క‌లెక్ట‌ర్‌.. ఎస్పీ కార్యాల‌యానికి వెళ్లి ప్ర‌ణ‌య్ విగ్ర‌హం ఏర్పాటు చేయ‌కూడ‌ద‌ని డిమాండ్ చేశారు. ఇలా రెండు వర్గాలు ప్రణయ్ విగ్రహ ఏర్పాటు కేంద్రంగా ఇప్పుడు ఆదిపత్య పోరు సలుపుతున్నారు.