Begin typing your search above and press return to search.

ఎన్నికల వేళ కీలక పరిణామం.. బెంగాల్ డీజీపై వేటు.. ఏ బాధ్యత అప్పగించలేదు

By:  Tupaki Desk   |   10 March 2021 5:23 AM GMT
ఎన్నికల వేళ కీలక పరిణామం.. బెంగాల్ డీజీపై వేటు.. ఏ బాధ్యత అప్పగించలేదు
X
దేశంలో జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి అందరి చూపు పశ్చిమ బెంగాల్ మీదనే ఉంది. మమత వర్సెస్ మోడీగా సాగుతున్న ఈ ఎన్నికలు.. భవిష్యత్తు దేశ రాజకీయాలపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. ఇప్పటివరకు వెలువడుతున్న అంచనాల ప్రకారం మమతా బెనర్జీ మరోసారి అధికారాన్ని చేపట్టే అవకాశం ఉందని బలంగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలో మమతకు వరుస షాకులు తగులుతున్నాయి.

పార్టీకి చెందిన నేతలు పలువురు బీజేపీలోకి జంప్ కావటం..ఒకటి తర్వాత ఒకటిగా చోటు చేసుకుంటున్న పరిణామాలన్ని మమతకు ప్రతికూలంగా ఉండటం గమనార్హం. తాజాగా పశ్చిమబెంగాల్ రాష్ట్ర డీజీపీపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. ఆయన్ను పదవి నుంచి తప్పించింది.తమ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని చెప్పింది. మంగళవారం రాత్రి చోటు చేసుకున్న ఈ పరిణామం బెంగాల్ అధికార పక్షానికి మింగుడు పడనిదిగా మారింది. ఇక్కడే మరో విషయాన్ని గుర్తు చేసుకోవాలి.

గత పార్లమెంటు ఎన్నికల సమయంలో కేంద్రానికి.. రాష్ట్ర పోలీసులకు మధ్య పరోక్ష యుద్ధం సాగుతోంది. కేంద్ర హోంశాఖ ఆదేశాల్ని ఖాతరు చేయాల్సిన అవసరం లేదని.. బెంగాల్ పోలీసులకు సీఎం మమత అండగా నిలిచారు. దీనిపై కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరింత దూరం పెరిగింది. అంతేకాదు.. కేంద్ర నిర్ణయాలకు వ్యతిరేకంగా పని చేసిన పోలీసు అధికారులకు మమత సర్కారు సన్మానాలు చేసింది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం డీజీగా వ్యవహరిస్తున్న వీరేంద్రపై వేటు వేసిన ఈసీ.. ఆయన స్థానంలో 1987 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారిక నీరజ్ నయన్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. డీజీ స్థానం నుంచి తప్పించిన వీరేంద్రకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా అట్టే పక్కన పెట్టేయటం గమనార్హం. మొత్తం ఎనిమిది విడతల్లో జరిగే బెంగాల్ ఎన్నికలు సుదీర్ఘంగా సాగి.. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల వేళ ఉన్నతాధికారుల్ని మార్చటం మామూలే అయినా.. బెంగాల్ లోచోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈసీ తాజా నిర్ణయం కీలకంగా మారిందని చెప్పక తప్పదు.