Begin typing your search above and press return to search.

హుజూరాబాద్‌ అభ్యర్థుల గురించి ఒక కీలక అప్ డేట్

By:  Tupaki Desk   |   4 Oct 2021 9:42 AM GMT
హుజూరాబాద్‌ అభ్యర్థుల గురించి ఒక కీలక అప్ డేట్
X
తెలంగాణ రాజ‌కీయాల్లో ఎంతో కీల‌కంగా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేష‌న్ విడుద‌ల కావ‌డంతో రాష్ట్రంలో పొలిటిక‌ల్ హీట్ మరింత పెరిగింది. ఇప్పుడు రాష్ట్రంలో అంద‌రి చూపు ఆ నియోజ‌క‌వ‌ర్గంపైనే ఉంది. నామినేష‌న్లు ర్యాలీలు ప్ర‌చారం ఇలా ఇప్పుడక్క‌డ సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఇప్ప‌టికే ఇక్క‌డ విజ‌యంపై క‌న్నేసిన ప్ర‌ధాన పార్టీలు త‌మ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేశాయి. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో ఎక్క‌డ ఎలాంటి ప‌రిణామం చోటుచేసుకున్నా హుజూరాబాద్ ఉప ఎన్నిక‌తో దానికి లింక్ పెట్టి చూడ‌డం కామ‌న్ అయిపోయింది.

ఇక ఈ ఉప ఎన్నిక‌లో ప్ర‌ధాన పార్టీల త‌ర‌పున బ‌రిలో దిగుతున్న ముగ్గురు నాయ‌కుల్లో ఓ సారూప్య‌త ఉంది. ఈ ముగ్గ‌రు విద్యావంతులు కావ‌డం.. వీళ్ల‌కు విద్యార్థి రాజ‌కీయ నేప‌థ్యం ఉండ‌డం విశేషం. భూకబ్జా ఆరోప‌ణ‌ల‌తో టీఆర్ఎస్‌ను వీడి ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకుని ఇప్పుడు ఈ ఎన్నిక‌ల్లో త‌న సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు శాయాశ‌క్తులా ప్ర‌య‌త్నిస్తున్న ఈట‌ల రాజేంద‌ర్ ఉస్మానియా నుంచి బీఎస్సీలో డిగ్రీ పూర్తి చేశారు. విద్యార్థి ద‌శ‌లోనే నాయ‌కుడిగా ఎదిగారు. ఆ త‌ర్వాత తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మంలో కేసీఆర్ వెంట న‌డిచి ఉద్య‌మ నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్నారు.

ఇక ఈ ఉప ఎన్నిక‌లో ఈట‌ల‌ను ఎలాగైనా ఓడించి త‌న‌ను ఎదురించిన వాళ్ల‌కు రాజ‌కీయ భ‌విష్య‌త్ ఉండ‌ద‌నే విష‌యాన్ని బలంగా చాటాల‌ని భావిస్తున్న సీఎం కేసీఆర్‌.. అందుకు విసిరిన బాణం గెల్లు శ్రీనివాస్ యాద‌వ్‌. టీఆర్ఎస్ విద్యార్థి విభాగం టీఆర్ఎస్వీ అధ్య‌క్షుడైన శ్రీనివాస్ యాద‌వ్ ఉస్మానియా నుంచి ఎంఏ ప‌ట్టా పొందారు. విద్యార్థి స‌మ‌స్య‌ల‌పై గ‌ళ‌మెత్తే నాయ‌కుడిగా ఆయ‌న‌కు పేరుంది. ఉద్య‌మంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. ఇక కాంగ్రెస్ నుంచి బ‌రిలో నిలిచిన బ‌ల్మూరి వెంక‌ట్ కూడా ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ కావ‌డం విశేషం. కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఆయ‌న ఉన్నారు. రాష్ట్రంలో విద్యార్థి స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లే విష‌యంలో చాలా యాక్టివ్‌గా వ్య‌వ‌హ‌రించారు.

ఇలా మూడు ప్ర‌ధాన పార్టీల త‌ర‌పున విద్యావంతులు పోటీప‌డ‌డం విశేష‌మ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇక ఈ ఎన్నిక‌లో ప్ర‌ధాన పోటీ బీజేపీ నుంచి ఈట‌ల రాజేంద‌ర్ టీఆర్ఎస్ త‌ర‌పున గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ మ‌ధ్య ఉంటుంద‌నే విష‌యంలో సందేహాలే అవ‌స‌రం లేదు. మ‌రి అక్టోబ‌ర్ 30న జ‌రిగే ఎన్నిక‌లో హుజూరాబాద్ ప్ర‌జ‌లు ఎవరి ప‌క్షాన నిలుస్తారో అన్న‌ది వేచి చూడాలి.