Begin typing your search above and press return to search.

53 ఏళ్లుగా ఓ భూ వివాదం.. 108 ఏళ్ల పిటీషనర్‌ మృతి

By:  Tupaki Desk   |   23 July 2021 9:30 AM GMT
53 ఏళ్లుగా ఓ భూ వివాదం.. 108 ఏళ్ల పిటీషనర్‌ మృతి
X
మన భారత న్యాయ వ్యవస్థలో కోర్టు కేసులు కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉంటున్నాయి. కేసులను త్వరగా తేల్చిచే సరిపోతుంది కదా అని ఎవరైనా అడిగితే, వంద మంది దోషులకు శిక్ష పడటం గురించి కాదు ఆలోచించాల్సింది. ఏ ఒక్క నిర్దోషికి అన్యాయం జరిగినా, అది న్యాయవ్యవస్థకు మాయని మచ్చగా మిగిలిపోతుంది అని విశ్లేషకులు అంటారు. అయితే ఒక్క సారి కేసు విచారణకు వచ్చినప్పటి నుంచి, అది పూర్తై ఫలితం వచ్చే దాకా కేసుతో సంబంధం ఉన్న వ్యక్తుల్లో ఎవరు బతికి ఉంటారో, ఎవరు చనిపోతారో చెప్పలేము. అయితే, ఇలాంటి ఒక సంఘటన మహారాష్ట్రలో జరిగింది.

ఓ భూమి వివాదానికి సంబంధించి కేసు విచారణ దాదాపు 53 సంవత్సరాల నుంచి కొనసాగుతుండటం ఆశ్చర్యంగా ఉంది. ఆఖరికి, దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కేసు విచారణను స్వీకరించే సమయానికి సదరు పిటిషన్ దారుడు దాదాపు 108 ఏళ్ల వయసులో చనిపోయాడు.వివరాల్లోకి వెళితే... మహారాష్ట్రకు చెందిన సోపాన్ నర్సింగ్ గైక్వాడ్ కొంత మొత్తంలో భూమిని ఒక వ్యక్తి నుంచి కొన్నాడు. అయితే సదరు వ్యక్తి నుంచి సేల్ డీడ్ ద్వారా సోపాన్ భూమిని కొనగా, భూమిని అమ్మిన వ్యక్తి అంతకు ముందే భూమి కాగితాలు బ్యాంకులో తనఖా పెట్టి లోన్ తీసుకున్నాడు.

అమ్మిన వ్యక్తి భూమి మీద తీసుకున్న లోన్ కూడా సకాలంలో చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు సోపాన్‌కు నోటీసులు పంపించారు. దీనిపై సోపాన్ కోర్టుకు వెళ్లగా భూమికి సంబంధించిన లోన్‌ను రికవరీ చేసుకోవడానికి బ్యాంకు అధికారులు అమ్మిన వ్యక్తికి సంబంధించిన ఇతర ఆస్తులను జప్తు చేసుకోవాలని, భూమిని కొన్న వ్యక్తిగా సోపాన్ ఉంటాడని కోర్టు సెప్టెంబర్ 10, 1982న తీర్పు ఇచ్చింది. దీంతో అమ్మిన వ్యక్తి అప్పీల్‌కు వెళ్లడమే కాకుండా, ట్రయల్ కోర్టు ఇంతకుముందు ఇచ్చిన తీర్పును 1987లో అతనికి అనుకూలంగా అక్రమ పద్ధతిలో మార్చుకున్నాడు.

సోపాన్ 1988లో రెండవ సారి అప్పీల్ కోసం హైకోర్టుకు వెళ్లగా ముంబయి కోర్టు దీనిని 2015లో కొట్టివేసింది. రెండవ సారి అప్పీల్ కోసం కోర్టును కోరడానిని చాలా ఆలస్యం చేశామని, దీని కోసం తమను క్షమించాలని ముంబయి కోర్టుకు దరఖాస్తు కూడా చేసుకున్నామని సోపాన్ తరపున న్యాయవాది కదీమ్ పేర్కొన్నాడు. అయితే ఆలస్యం అయినందుకు సెకండ్ అప్పీల్‌ను ఫిబ్రవరి 13, 2019లో ముంబయి కోర్టు కొట్టివేసింది.

పిటిషన్ దారుడు గ్రామీణ ప్రాంతంలో ఉండటం మరియు హైకోర్టు తీర్పు వెల్లడించేసరికి ఆలస్యం అయిందని సోపాన్ తరపున న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలపడంతో ఈ నెల 12న విచారిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సుప్రీంకోర్టులో విచారణ కూడా ఆలస్యం అయింది. అయితే, దురదృష్టవశాత్తూ సోపాన్ కొద్ది రోజుల క్రిందట చనిపోయారు. మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతం నుంచి కేసును సుప్రీంకోర్టు వరకూ తీసుకుని వచ్చాడని, సుప్రీంకోర్టు విచారణకు అంగీకరించే సమయంలో అతను చనిపోయాడని లాయర్ విరాజ్ కదమ్ తెలిపాడు. ఇప్పుడు అతని వారసుల ద్వారా విచారణ కొనసాగుతుందని చెప్పాడు.