Begin typing your search above and press return to search.

అంతపెద్ద కంపెనీని ముంచిన ప్రేమికుడు!

By:  Tupaki Desk   |   10 Oct 2015 3:46 AM GMT
అంతపెద్ద కంపెనీని ముంచిన ప్రేమికుడు!
X
ఇద్దరు ఉద్యోగుల మధ్య చివురించిన ప్రేమ వ్యవహారం ఒక సంస్థ అంతర్జాతీయ ప్రతిష్టనే నేల కూల్చేసింది. పరువు పోతే రేపు మళ్లీ తెచ్చుకోవచ్చుననుకుంటున్నారేమో. ఆ అంచనా చాలా తప్పు మరి. ఆ సుప్రసిద్ధ కంపెనీ తయారు చేసిన 700 జెనరిక్ మందులపై పాశ్చాత్య దేశాలు నిషేధం విధించడంతో సమీప భవిష్యత్తులో ఆ నష్టం పూడ్చుకోలేనంత దుస్థితిలో పడిపోయిందా కంపెనీ. ఆ కంపెనీ ఏదో కాదు మన దేశ కంపెనీయే. మన హైదరాబాద్ కంపెనీయే. జీవీకే బయోసైన్సెస్ అనే ఆ కంపెనీ ఇప్పుడు నిండా మునిగింది. అంతర్జాతీయ తనిఖీ బారిన పడి విలవిల్లాడుతోంది. ఇంత ఉత్పాతానికి కారణమైన ఆ ప్రేమికుడు ప్రస్తుతం కంపెనీలో లేడు కానీ చేయాల్సిన పని మాత్రం సైలెంటుగా చేసి పడేశాడు.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లోని జీవీకే బయో సైన్సెస్ సంస్థలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి తన జూనియర్ సహచరురాలితో ప్రేమలో పడ్డాడు. వాళ్లిద్దరూ 2011లోనే కంపెనీ విడిచి వెళ్లిపోయారు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులను కలిసి కేసు పెట్టడంతో కంపెనీ వారిద్దరి ఉద్యోగాలూ ఊడబీకింది. అసలు కథ అప్పట్నుంచే మొదలైంది. జీవీకే బయోసైన్సెస్‌ నిర్వహిస్తున్న క్లినికల్ పరిశోధన నాణ్యతపై అనుమానం వ్యక్తపరుస్తూ ఆ ప్రేమికుడు కమ్ మాజీ ఉద్యోగి సుప్రసిద్ధ డ్రగ్ రెగ్యులేటరీ ఏజెన్సీలకు ఈమెయిల్స్ పంపాడని పోలీసు విచారణలో బయటపడింది. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 15 ఈమెయిల్స్‌ను అతగాడు ఔషధ క్రమబద్ధీకరణ సంస్థలకు పంపాడని తెలిసింది.

తీరా తేలిన విషయం ఏమిటంటే పనిచేసిన కంపెనీనే నిండా ముంచిన ఆ అపర ప్రేమికుడు తను ప్రేమించిన జూనియర్ సహచరిని కూడా మోసగించాడు. అప్పటికే వివాహమై ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చిన అతగాడు అదే కంపెనీలో పనిచేస్తున్న జూనియర్ ఉద్యోగితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడట. కానీ వారి ప్రేమ సంబంధం దొంగలెత్తుకు పోనూ.. వాళ్లకు ఉద్యోగమిచ్చిన కంపెనీకి మాత్రం చేటుకాలం దాపురించింది.

జీవీకే బయోసైన్సెస్‌ కంపెనీ ఔషధ పరిశోధనల నాణ్యతపై కొన్ని అంతర్జాతీయ వైద్య సంస్థలు తనిఖీ చేయాలని నిర్ణయించాయి. కొన్నయితే డేటాను ఆ కంపెనీ తారుమారు చేస్తోందని ఆరోపించాయి కూడా. యూరోపియన్ యూనియన్ అయితే జీవీకే బయో సైన్సెస్ కంపెనీ పరీక్షించి నిర్ధారించిన 700 ఔషధాలపై నిషేధం విధించింది.. పైగా కంపెనీ మందుల పరీక్షల నాణ్యతపై సందేహం వ్యక్తీకరిస్తూ ఆ ప్రేమికుడు యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఏజెన్సీకి 15 మెయిల్స్ పంపాడని పోలీసుల దర్యాప్తులో బయటపడింది.

ఔరా ప్రేమికుడా.. కొంపకే ఎసరు తెచ్చావు కదరా నాయనా అంటూ జీవీకే సంస్థ యాజమాన్యం ఇప్పుడు తలపట్టుకు కూర్చుంది.