Begin typing your search above and press return to search.

తోడు కోసం మూడువేల మైళ్లు తిరిగిన పులి..!

By:  Tupaki Desk   |   19 Nov 2020 12:30 PM GMT
తోడు కోసం మూడువేల మైళ్లు తిరిగిన పులి..!
X
తొడు కోసం ఆ పులి సుమారు మూడువేల మైళ్లు తిరిగింది. మన దేశంలో ఇప్పటివరకు ఏ పులి కుడా ఇంతదూరం నడవలేదని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. దీనికి అటవీఅధికారులు ‘వాకర్​’ అని పేరుపెట్టారు.

మహారాష్ట్రలో పుట్టిన ఈ పులి గత ఏడాది జూన్​లో ఆ రాష్ట్ర అడవుల నుంచి బయలుదేరింది. అయితే అది ఆడతోడు కోసం తిరుగుతున్నట్టు అధికారులు గుర్తించి.. ఈ పులి ఎక్కడికి వెళ్తుందో తెలుసుకొనేందుకు దీనికి ఓ రేడియో కాలర్​ను అమర్చారు. ఈ పులి తొమ్మిది నెలల పాటు మహారాష్ట్ర, తెలంగాణల్లోని ఏడు జిల్లాల్లో మొత్తంగా దాదాపు 3,000 కిలోమీటర్లు (1,864 మైళ్లు) ఇది తిరిగినట్టు అధికారులు గుర్తించారు.

చివరకు మహారాష్ట్రలోని మరొక అభయారణ్యంలో స్థిరపడింది. గత ఏప్రిల్‌లో దీని కాలర్‌ను అధికారులు తొలగించారు. ఈ పులి ప్రస్తుతం 205 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని ధ్యాన్‌గంగా అభయారణ్యానికి చేరుకుంది. చిరుతలు, నీలి ఎద్దులు, అడవి పందులు, నెమళ్లు, జింకలకు ఈ అరణ్యం నిలయం. ఇక్కడ ఉన్న ఏకైక పులి వాకర్ మాత్రమేనని అధికారులు చెబుతున్నారు. ఈ అభయారణ్యానికి ఒక ఆడ పులిని తోడుగా తీసుకురావాలా? వద్దా అనే అంశంపై అధికారులు చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం భారత్‌లో మొత్తం 3,000 వరకు పులులున్నాయి.

పులుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, వీటి ఆవాస ప్రాంతాలు తగ్గిపోతున్నాయి. మరోవైపు వాటి ఆహారమూ తగ్గిపోతోందని అటవీ అధికారులు చెబుతున్నారు. అభివృద్ధితోపాటు జనాభా పెరుగుతున్నప్పటికీ మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాలు పులులు స్వేచ్ఛగా తిరగడానికి అనువుగా ఉన్నాయని ఈ పులి ప్రయాణం చెబుతోంది. అంటే ఇక్కడ అభివృద్ధి ఏమీ జంతువుల కదలికలకు అవరోధం కాదని తెలుస్తోంది.