Begin typing your search above and press return to search.

కంబోడియాలో విల్లాలు కట్టేద్దామంటూ రూ.4కోట్లకు ముంచేశాడు

By:  Tupaki Desk   |   1 Dec 2021 6:30 AM GMT
కంబోడియాలో విల్లాలు కట్టేద్దామంటూ రూ.4కోట్లకు ముంచేశాడు
X
కాదేదీ కవితకు కనర్హమన్న మహాకవి శ్రీశ్రీ మాటకు ఏ మాత్రం తీసిపోని రీతిలో.. ఆశ పెట్టి ఏదోలా మోసం చేసే కాన్సెప్టును ఇటీవల కాలంలో చాలాబాగా నేర్చుకుంటున్నారు. కొన్ని ఉదంతాల్ని చూసినప్పుడు.. ఇలా కూడా మోసం చేస్తారా? అన్న రీతిలో మోసపుచ్చుతున్న వైనం ఎక్కువైంది.

తాజాగా వెలుగు చూసిన ఒక ఉదంతాన్ని చూసినప్పుడు.. షాకింగ్ గా అనిపించక మానదు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటు చేసుకున్న ఈ మోసం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సీసీఎస్ పోలీసులకు అందిన ఫిర్యాదును విచారిస్తున్న పోలీసులు.. నిందితుడ్ని త్వరలోనే అదుపులోకి తీసుకునే వీలుందన్న మాట వినిపిస్తోంది. ఇంతకూ అసలేం జరిగిందంటే..

సాధారణంగా ఫలానా చోట చౌకగా భూములు ఉన్నాయని.. ఫ్లాట్లు వస్తాయని.. మాయమాటలు చెప్పి మోసం చేయటం చూశాం. అందుకు భిన్నంగా దేశం కాని దేశంలో విల్లాలు నిర్మాణం చేపడదామని.. పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయికి భారీగా లాభం వస్తుందన్న మాయమాటలు చెప్పి మోసం చేసిన వైనం చూస్తే.. ఆశ్చర్యంలో అవాక్కు అవ్వాల్సిందే.

జూబ్లీహిల్స్ లో ఉండే ఆదిత్య అనే వ్యక్తి వ్యాపారం చేస్తుంటాడు. ఐదేళ్ల క్రితం ఒక ఫ్రెండ్ తో కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తితో పరిచయమైంది. అప్పటి నుంచి వారిద్దరూ తరచూ మాట్లాడుకోవటం.. పలు రకాల బిజినెస్ ల గురించి చర్చించుకునే వారు.

ఇందులో భాగంగా తాను కంబోడియాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటానని.. అక్కడ స్కైలాండ్ సిటీలో విల్లాలు నిర్మిస్తే.. రూపాయి ఇరవై రూపాయిల లాభం వస్తుందని ఊరించాడు. అందుకు స్పందించిన ఆదిత్య తనకు రెండు.. మూడు నెలలు టైం కావాలని.. ఆలోచించి చెబుతానని చెప్పాడు. అక్కడితో ఆగని కిరణ్ కుమార్ రెడ్డి..

విల్లాలు ఎలా నిర్మిస్తారో చూపిస్తానంటూ ఆదిత్యను కంబోడియాకు తీసుకెళ్లాడు. నాలుగైదు రోజులు అక్కడే ఉండి.. అక్కడ నిర్మాణంలో ఉన్న భవనాల్ని చూపించి హైదరాబాద్ కు తీసుకొచ్చాడు.
మాటలే కాదు చేతల్లో కూడా కిరణ్ టాలెంట్ ను చూసిన ఆదిత్య అతన్ని పూర్తిగా నమ్మేశాడు. నాలుగేళ్ల క్రితం అంటే 2017లో అతనికి రూ.4 కోట్లు డబ్బులిచ్చి పెట్టుబడులు పెట్టాలని కోరాడు.

ఏడాదిలో నిర్మాణం పూర్తి అవుతుందని.. ఆ తర్వాత నుంచి లాభాల పంటేనని నమ్మబలికాడు. క్యాలెండర్లో నెలలు కాస్తా.. ఏడాదికి ఏడాది గడిచిపోతోంది. ఎప్పటికప్పుడు ఏదో ఒక మాట చెప్పటమే కానీ.. పైసా తిరిగి ఇచ్చింది లేదు. దీంతో అనుమానపడిన ఆదిత్యకు నమ్మకం కలిగేందుకు హైదరాబాద్ లో తన పేరెంట్స్ ఉండే ఇంటి విలువే రూ.3కోట్లు ఉంటుందని చెప్పాడు.

కాలం గడిచిపోవటం.. కిరణ్ కుమార్ రెడ్డి కంబోడియా నుంచి తిరిగి రాకపోవటం.. డబ్బులు ఇవ్వకపోవటంతో తాను పోలీసుల్ని ఆశ్రయిస్తానని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో 2019లో నగరానికి వచ్చిన అతను రూ.4కోట్లకు వడ్డీగా మరో రూ.2 కోట్లు ఇస్తానని చెప్పి డీల్ కుదర్చుకున్నాడు. ఆర్నెల్లలో ఒప్పందం చేసుకున్న డబ్బులు ఇస్తానని చెప్పాడు. ఖర్చుల కోసమన్నట్లుగా రూ.72 వేలు ఇచ్చాడు. ఆ తర్వాత పత్తా లేకుండా పోయాడు. దీంతో.. తాను మొత్తంగా మోసపోయిన విషయాన్ని గుర్తించిన ఆదిత్య తాజాగా సీసీఎస్ పోలీసుల్నిఆశ్రయించటంతో విషయం మొత్తం బయటకు వచ్చింది. మోసం చేయాలనుకునే వారు మన చుట్టూనే ఉంటారు. అప్రమత్తత ఏమాత్రం మిస్ అయినా మొత్తంగా మోసపోవటం ఖాయం. పారాహుషార్.