Begin typing your search above and press return to search.

32 ఏళ్లుగా నడుస్తూనే ఉన్నాడు..కారణం ఇదే!

By:  Tupaki Desk   |   16 Sept 2020 12:30 AM
32 ఏళ్లుగా నడుస్తూనే ఉన్నాడు..కారణం ఇదే!
X
నడక ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుందని వైద్యులు మొత్తుకుంటున్నా.. వారి సూచనలు పాటించేవారు కొందరే. ఏదో ఒక సమస్య వచ్చి వైద్యుడి దగ్గరికి పరిగెత్తుకెళ్లేంత వరకు వాకింగ్ గురించి గుర్తుకు రాదు. తీరికలేని జీవన విధానంతో తగిన వ్యాయామం లేక శరీర నియంత్రణ లేకుండా పోతోంది. జనం బీపీ, షుగర్‌, స్థూలకాయం లాంటి రుగ్మతల బారిన పడుతున్నారు. నడక దేహదారుఢ్యాన్ని పెంపొందిస్తుంది. అధిక బరువును, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గుండెజబ్బులు, మధుమేహం, క్యాన్సర్‌, మానసిక ఒత్తిడి, రక్తపోటు, స్థూలకాయం, కొవ్వును తగ్గించి జీవిత కాలాన్ని పెంచుకోవచ్చు.

అమెరికాకు చెందిన బ్రాడ్ అనే వ్యక్తికి డయాబెటిస్, గుండె సమస్యలు రాగా వాకింగ్ చేయాలని సూచించారు. దీంతో ఆయన 32 ఏళ్లుగా నడుస్తూనే ఉన్నారు. ఆయన నడక భూమి చుట్టు కొలతతో సమానం అంట. మసాచు సెట్స్ కు చెందిన బ్రాడ్ కి ప్రస్తుతం 88 ఏళ్లు. ఆయనకు 56 ఏళ్ల వయసులో డయాబెటిస్, గుండెకు సంబంధించి సమస్యలు రాగా చికిత్స కోసం వైద్యుడిని సంప్రదించారు. ఎంత నడిస్తే అంత మేలని వైద్యుడు సూచించడంతో బ్రాడ్ అప్పటి నుంచి రోజూ వాకింగ్ చేయడం మొదలు పెట్టారు. రోజూ ఎంత నడిచేది లెక్కేసుకుంటూ వస్తున్నారు. ఆయన రోజువారీ నడక ప్రారంభమై 32 ఏళ్లు గడిచాయి. త్వరలో ఆయన 24 901 మైళ్ల(40 075 కిలోమీటర్లు ) నడకను పూర్తి చేయనున్నారు. ఇది భూమి చుట్టు కొలతతో సమానం. అక్టోబర్ 3న బ్రాడ్ ఈ మైలు రాయిని చేరుకోనున్నారు. ఆయన నడక గురించి విన్నవారు ఆశ్చర్య పోతున్నారు.