Begin typing your search above and press return to search.
రియల్ లైఫ్ `బిచ్చగాడు`...వైరల్!
By: Tupaki Desk | 3 Aug 2018 1:30 AM GMTవిజయ్ ఆంటోని హీరోగా తెరకెక్కిన `బిచ్చగాడు` చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. తన తల్లిని బ్రతికించుకోవడం కోసం బిచ్చగాడిగా మారిన కోటీశ్వరుడిగా విజయ్ ఆ పాత్రలో జీవించాడు. అప్పటి వరకు తమతో బిచ్చగాడిగా తిరిగిన విజయ్ ...కోటీశ్వరుడని తెలియడంతో తోటి బిచ్చగాళ్లంతా అవాక్కవుతారు. అయితే, అదే తరహాలో తమిళనాడులో జరిగిన ఓ ఘటన ఇపుడు సంచలనం రేపుతోంది. తన కోడలితో గొడవ పడ్డ ఓ కోటీశ్వరుడు...ఇంటి నుంచి వెళ్లిపోయి బిచ్చగాడిగా మారిన వైనం తమిళనాట చర్చనీయాంశమైంది. ఎట్టకేలకు ఆ కుటుంబ సభ్యులు....ఓ గుడి దగ్గర అతడిని గుర్తించడంతో ఈ నయా`బిచ్చగాడి`కథకు తెరపడింది. ప్రస్తుతం ఈ రియల్ లైఫ్ బిచ్చగాడి ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తమిళనాడులోని విల్లాపురం ప్రాంతానికి చెందిన నటరాజన్ కోటీశ్వరుడు. భార్య మరియు ముగ్గురు కుమారులతో ఉన్న ఉమ్మడి కుటుంబానికి నటరాజనే పెద్ద. అయితే, కొద్ది నెలల క్రితం నటరాజన్ కు తన కోడలితో గొడవ జరిగింది. అయితే, ఆ గొడవలో కోడలికే కుటుంబ సభ్యులు మద్దతు తెలిపారు. దీంతో, ఇంటి యజమాని అయిన తనను ఎవరూ పట్టించుకోవడం లేదని నటరాజన్ అలిగారు. తీవ్ర మనస్తాపంతో ఇంటి నుంచి వెళ్లిపోయారు. కొద్ది నెలల నుంచి తిరుపూర్ మురుగన్ ఆలయంలోనే ప్రసాదాలు తింటూ గడిపారు. అయితే, నటరాజన్ కోసం అతడి భార్యాపిల్లలు చాలా చోట్ల వెతికారు. చివరకు తిరుపూర్ మురుగన్ ఆలయంలో బిక్షగాడి ఉన్న నటరాజన్ ను గుర్తించారు. దీంతో, తమను క్షమించమని కోరిన కుటుంబ సభ్యులు అతడిని తమతో పాటు ఇంటికి తీసుకువెళ్లారు. ఇప్పటివరకు తమతో కలిసి ఉన్న బిచ్చగాడు ఓ కోటీశ్వరుడు అని తెలియడంతో తోటి బిచ్చగాళ్లు...అక్కడి స్థానికులు ఆశ్చర్యపోయారు.