Begin typing your search above and press return to search.

అరే ఏంట్రా ఇది... దొంగతనం కోసం 10 కేజీలు తగ్గి..!

By:  Tupaki Desk   |   22 Nov 2021 1:30 AM GMT
అరే ఏంట్రా ఇది... దొంగతనం కోసం 10 కేజీలు తగ్గి..!
X
సహజంగా ఎవరైనా ఆరోగ్యం కోసం బరువు తగ్గుతారు. హైట్ కు తగినంత బరువు ఉండడం కోసం చాలామంది కష్టపడుతుంటారు. ఎక్కువ బరువు ఉంటే భవిష్యత్ లో కొత్త కొత్త ఆరోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది. అందుకే బరువు తగ్గడం కోసం ఎవరికి తోచినట్లుగా వారు పాట్లు పడతారు. అయితే ఓ వ్యక్తి పది కేజీల బరువును కోల్పోయాడు. అయితే ఇదేదో ఆరోగ్యం కోసం అనుకుంటే పొరబడినట్లే.

గుజరాత్ అహ్మదాబాద్ కు చెందిన మోహిత్ మరాడియా అనే వ్యక్తి కఠినమైన డైట్ ఫాలో అయ్యారు. ఈ విధంగా పది కేజీల బరువును కోల్పోయాడు. ఇందులో వింత ఏముంది అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు మ్యాజిక్. ఈయన బరువును కోల్పోయింది ఆరోగ్యం మీద శ్రద్ధతో కాదండోయ్... దొంగతనం కోసం. అవును నిజమే. ఓ ఇంట్లో చోరీ చేయడం కోసం ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పది కేజీల బరువును లాస్ అయ్యాడు.

మోహిత్ ఓ ఇంట్లో పనిచేసేవాడు. ఆ ఇంట్లో భారీగా బంగారం, నగదు అతడి కంటపడింది. అంతే ఇక వాటిని కాజేయాలని ఫిక్స్ అయ్యాడు. అందుకు తగినట్లు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆ ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ డోర్ల నుంచి మెల్లగా జారుకోవడానికి సన్నబడాలని నిర్ణయించుకున్నాడు.

ఆ విధంగా డైట్ చేసి పది కేజీల బరువు తగ్గాడు. ఇకపోతే ఆ ఇంట్లోని సీసీకెమెరాలు ఎక్కడ ఉన్నాయో పరిశీలించాడు. వాటిని ధ్వంసం చేయాలని ప్లాన్ చేశాడు.ఇంట్లోని సీసీటీవీలను ధ్వంసం చేయడం కోసం ఓ పరికరాన్ని కొనుగోలు చేశాడు. ఆ విధంగా సొమ్ము దోచేశాడు.

అంతా తాను అనుకున్నట్లుగానే జరిగిందని.. తన ప్లాన్ వర్కౌట్ అయిందని మోహిత్ అనుకున్నాడు. తానే ఇది చేశానని ఎవరికీ అనుమానం రాదని భావించాడు. అయితే అక్కడే మోహిత్ తక్కువ అంచనా వేశాడు. సీసీకెమెరాలు పగలగొట్టేందుకు ఓ పరికరం కోసం వెళ్లిన దుకాణం అతడిని పట్టించింది. అక్కడ పరికరం కొనుగోలు చేసిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డు అయ్యాయి. ఆ నిఘానిత్రాలే పోలీసులకు నిందితుడిని పట్టించాయి.

సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు చోరీకి పాల్పడిన మోహిత్ ను పట్టుకున్నారు. అయితే దొంగతనం కోసం ఇతడు చేసిన ప్లాన్ ప్రస్తుతం వైరల్ గా మారింది. దొంగతనం కోసం ఏకంగా పది కేజీలు తగ్గడం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 'అరే ఏంట్రా ఇది.. దొంగతనం కోసం ఏకంగా 10 కేజీలు ఎలా తగ్గావు?' అని కామెంట్ చేస్తున్నారు.