Begin typing your search above and press return to search.

చలాన్లతో పోలీసులు వేధిస్తున్నార‌ని.. బైక్ కు నిప్పు పెట్టాడు !

By:  Tupaki Desk   |   29 Nov 2021 5:01 AM GMT
చలాన్లతో పోలీసులు వేధిస్తున్నార‌ని.. బైక్ కు నిప్పు పెట్టాడు !
X
ట్రాఫిక్ పోలీసుల కారణంగా చాలామంది అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. రూల్స్ అండ్ రెగ్యూలెష‌న్స్ క‌చ్చితంగా అమ‌లు చేయ‌డంలో పోలీసుల‌ను త‌ప్పుప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. కానీ, కావాల‌ని చిన్న చిన్న విష‌యాల‌కు ఫొటోలు తీసి చ‌లాన్లు వేస్తుంటే.. చాలామంది వాహ‌న‌దారులు విసిగిపోతున్న మాట వాస్త‌వం. అయితే, పోలీసులా వ‌సూళ్ల‌కు ఏజెంట్లా అన్న కామెంట్లు కూడా కొన్ని సంద‌ర్భాల్లో నెటిజ‌న్ల నుంచి వినిపిస్తున్నాయి.

అయితే, ఒక పక్క పెట్రోల్‌ ధరలతో విసిగిపోయిన వాహ‌న‌దారుల‌కు మ‌రోవైపు, ట్రాఫిక్ చ‌లాన్లు మ‌రింత ఇబ్బందిగా మారుతున్నాయి. బండిమీద‌ రోడ్డు ఎక్కామంటే చాలు, ఎక్కడ ట్రాఫిక్ పోలీస్ కెమెరాకు చిక్కుతామోన‌ని చాలామంది హడలెత్తిపోతున్నారు. ఏ మూల‌నో న‌క్కి ఎక్కడ ఫోటో తీసి ఇ‌‌-చలాన్‌ పంపిస్తారేమోనని భయపడిపోతున్నారు.

ఆదిలాబాద్ టౌన్‌లోని ఖానాపూర్‌కు చెందిన మక్బూల్‌ అంబేద్క‌ర్ స‌ర్కిల్ సమీపంలోబైక్‌పై వెళ్తుండగా.. ట్రాఫిక్‌ పోలీసులు ఫొటో తీసి ఈ-చలాన్ కింద జరిమానా వేశారు. దీంతో అసహనానికి గురైన వాహనదారుడు తరచూ ట్రాఫిక్ పోలీసులు ఇలా ఫోటోలు తీసి ఈ- చలాన్లు వేస్తున్నారని, నడిరోడ్డుపైనే తన బైక్‌కు నిప్పు పెట్టాడు. దీంతో రోడ్డుపై ఉన్నవారంతా విస్తుపోయారు. వెంటనే అక్కడున్నవారు, పోలీసులు వచ్చి మంటలను ఆర్పేశారు.

అయినా అప్పటికే బైక్ డ్యామేజ్ అయ్యింది. ద్విచక్రవాహనంపై చలాన్లు ఉండగా, వారం క్రితం వెయ్యి రూపాయలు కట్టినట్లు వాహనాదారుడు తెలిపాడు. తనిఖీల్లో భాగంగా అధికారులు ఇవాళ మరోసారి పరిశీలించి, చలాన్లు పెండింగ్‌ లో ఉండడంతో కొంత డబ్బు కట్టాలని అడిగారు.

వారం కిందటే చలాను కట్టానని, మరోసారి ఎక్కడినుంచి డబ్బులు తేవాలంటూ వాహనదారుడు అసహనానికి గురై బైక్‌కు నిప్పుపెట్టాడు. అయితే , పోలీసులు మాత్రం తాము నిబంధనల మేరకే నడుచుకున్నామని, ఫైన్ కోసం మక్బుల్ ను ఎలాంటి వేధింపులకు గురిచేయలేదన్నారు. మక్బుల్ వద్ద బండి కాగితాలు లేవన్నారు.

మొత్తానికి మక్బుల్ చేసిన ఈ పనితో ఇప్పుడు అతడిపై పోలీస్ కేసు నమోదైంది. నడిరోడ్డుపై బైక్ కు నిప్పుపెట్టి ప్రమాదానికి కారణం కావడం ,ఫైన్ కట్టనందుకు ఇంకా పలు అంశాలపై కేసు పెట్టడానికి పోలీసులు సిద్ధం అవుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై వాహనాలను నడిపిన వ్యక్తులను ఈ-చలాన్లు భయపెడుతున్నాయి. పెండింగ్ చలాన్లు ఉన్న వాహనాల్లో ప్రభుత్వ వెహికిల్స్ కూడా ఉండడం గమనార్హం