Begin typing your search above and press return to search.

అద్దింటి కష్టం.. బతికుండగానే శ్మశానికి..

By:  Tupaki Desk   |   28 Aug 2019 10:46 AM GMT
అద్దింటి కష్టం.. బతికుండగానే శ్మశానికి..
X
ఎంత సంపాదించినా.. ఎంత ఊరేగినా నీ పాడె మోయడానికంటూ నలుగురు మనుషులు.. పూడ్చడానికి ఆరడుగుల స్థలం.. అంతిమ సంస్కారాలు చేయడానికి ఒక సొంతిళ్లు అవసరమని పెద్దలు చెబుతుంటారు. సొంత ఇళ్లు లేని అద్దింటి వాసుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు..

జగిత్యాల జిల్లాలో అద్దింటి కష్టాలకు ఓ నిరుపేద పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వృద్ధాప్యంతో చావు అంచులో ఉన్న సొంత తల్లిని శ్మశానంలో వదిలిన హృదయ విదారక సంఘటన స్థానికులను కలిచివేసింది. అద్దె ఇంటిలో చనిపోతే యజమాని ఊరుకోడని.. తమను ఇంటినుంచి గెంటివేస్తాడని.. తమ ఆశ్రయం కూడా పోతుందని భయపడ్డ కొడుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

జగిత్యాల పట్టణంలోని వీక్లీ బజార్ కు చెందిన చెట్ పల్లి నర్సమ్మ అనే 95 ఏళ్ల వృద్ధురాలుకు కొడుకు ధర్మయ్యతోపాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈమె భర్త 30 ఏళ్ల కిందటే చనిపోయాడు. అయితే కొడుకు ధర్మయ్య నిరుపేద కావడంతో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అయితే ఇతడి తల్లి నర్సమ్మకు మూడు నెలల క్రితం కాలు విరిగి ఇంట్లోనే మంచాన పడింది. కొన ఊపిరితో ఉంది. అద్దె ఇంట్లో చనిపోతే యజమాని ఊరుకోడని.. ముట్టుడు అంటాడని ఇంట్లోంచి గెంటేస్తాడని భయపడిన ధర్మయ్య తన తల్లిని వేరే గతి లేక స్థానిక మోతె శ్మశాన వాటికకు తీసుకెళ్లి అక్కడే ఉన్నచిన్న గదిలో పారేసి వచ్చాడు. ప్రతీరోజు వృద్ధురాలి వద్దకు ధర్మయ్య భార్య విజయ - కూతురు గంగమ్మ వచ్చి ఆలనాపాలన చూస్తున్నారు.

అయితే కన్నతల్లిని బతికుండగానే కాటికి పంపిన తీరు చూసిన పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులు వృద్ధురాలిని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ధర్మయ్య మాత్రం తన పేదరికం కారణంగానే అద్దె ఇంటి యజమానికి భయపడి ఇలా చేశానని చెబుతున్నాడు.