Begin typing your search above and press return to search.

వేటకెళ్లి గుహలో ఇరుక్కున్న వ్యక్తి.. 24గంటలుగా నరకయాతన

By:  Tupaki Desk   |   15 Dec 2022 4:26 AM GMT
వేటకెళ్లి గుహలో ఇరుక్కున్న వ్యక్తి.. 24గంటలుగా నరకయాతన
X
వేట అతడి ప్రాణాలకే ముప్పు తెచ్చింది. ఏదో చేద్దామని వెళ్లి ఎరక్కపోయి ఇరుక్కున్నాడు. ఇప్పుడు ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. 30 గంటలుగా గుహలో ఇరుక్కొని నరకయాతన అనుభవిస్తున్నాడు.

తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో 30 గంటలకు పైగా గుహలో చిక్కుకున్న వ్యక్తిని రక్షించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. రెండు బండరాళ్ల మధ్య ఏర్పడిన గుహ నుంచి వ్యక్తిని రక్షించేందుకు రెస్క్యూ అధికారులు జేసీబీ యంత్రాన్ని కూడా మోహరించారు.

రెండు బండరాళ్ల మధ్య ఏర్పడిన 15 అడుగుల లోతున్న గుహలో చిక్కుకున్న వ్యక్తి రెడ్డిపేట గ్రామానికి చెందిన రాజుగా గుర్తించారు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో 30 గంటలకు పైగా చిక్కుకుపోయాడు.

రాజు మంగళవారం సాయంత్రం రెడ్డిపేట నుంచి గణపూర్ తండా మీదుగా సింగరాయపల్లి అటవీ ప్రాంతంలో అడవిలో వేటకు వెళ్లాడు. రాళ్లపై నుంచి వెళ్తుండగా రాజు సెల్ ఫోన్ కింద పడిపోయింది. దానిని తీసేందుకు యత్నించి ఆ రాళ్ల మధ్య ఉన్న గుహలో ఇరుక్కుపోయాడు. అతడితో వచ్చిన స్నేహితుడు కొందరు గ్రామస్థులకు సమాచారం అందించాడు.

బయటకు వెళ్లే అవకాశం లేకపోవడంతో రాజు ఒకరోజుకు పైగా లోపలే ఉండిపోయాడు. ఇంతలో అతడిని రక్షించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించినా కుదరలేదు. అనంతరం వారు పోలీసులకు సమాచారం అందించగా వారు సహాయక చర్యలు చేపట్టారు.

డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కామారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం "మంగళవారం సాయంత్రం, రాజు అనే వ్యక్తి వేటకు వెళ్లి రాళ్ల వెంట నడుచుకుంటూ వెళుతుండగా, అతని సెల్ ఫోన్ రాళ్ల మధ్య లోతుగా పడిపోయింది. సెల్‌ఫోన్‌ తీస్తుండగా లోపల ఇరుక్కుపోయాడు. నిన్న రాజును రక్షించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

"బుధవారం మధ్యాహ్నం వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మేము అతనికి నీరు , ఓఆర్ఎస్ సరఫరా చేసాము. ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారు. జేసీబీ, ఇతర అధికారుల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్‌ జరుగుతోంది" అని డీఎస్పీ తెలిపారు. జేసీబీ సాయంతో రాళ్లను తొలగించి రాజును బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.