Begin typing your search above and press return to search.

కేటీఆర్ బావ‌మ‌రిదినంటూ వేధిస్తున్నాడ‌ట‌

By:  Tupaki Desk   |   10 Aug 2017 5:59 AM GMT
కేటీఆర్ బావ‌మ‌రిదినంటూ వేధిస్తున్నాడ‌ట‌
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కూ రాని స‌రికొత్త ఆరోప‌ణ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆయ‌న పేరును వాడేసుకుంటున్న ఒక ప్ర‌బుద్ధుడు కేటీఆర్ బావ‌మ‌రిదినంటూ బెదిరింపుల ప‌ర్వానికి దిగుతున్న వైనం వెల్ల‌డైంది. తాను మంత్రి కేటీఆర్ బావ‌మ‌రిదినంటూ వేధిస్తున్నట్లుగా రాయ‌దుర్గంలోని ఎట‌ర్న‌ల్ క్వెస్ట్ ఐటీ స‌ర్వీసెస్ సంస్థ పార్ట‌న‌ర్స్ సాయి చ‌ర‌ణ్‌.. అభిషేక్ లు రాష్ట్ర మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్‌ ను ఆశ్రయించారు. త‌మ కంపెనీ వ్య‌వ‌హారాల్లో జోక్యం చేసుకోవ‌టంతో పాటు.. డ‌బ్బుల కోసం డిమాండ్ చేస్తున్న‌ట్లుగా వారు ఆరోపించారు.

కేటీఆర్ బావమ‌రిదిగా చెప్పుకుంటున్న వ్య‌క్తి నుంచి త‌మ‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిందిగా వారు కోరారు. ఈ పిటీష‌న్ ను విచార‌ణ‌కు స్వీక‌రించిన క‌మిష‌న్ అక్టోబ‌రు 4 లోపు ఈ అంశంపై స‌మ‌గ్ర నివేదిక ఇవ్వాలంటూ మాదాపూర్ ఏసీపీకి నోటీసులు జారీ చేశారు.

త‌మ ప్రాజెక్టు మేనేజ‌ర్ వంశీధ‌ర్ సాయంతో ఒక ప్రాజెక్టును తాము అభివృద్ధి చేస్తున్నామ‌ని.. ఇందుకు అవ‌స‌ర‌మైన సాంకేతిక‌త కోసం వెంక‌ట సాయి.. అవినాష్ అనే ఉద్యోగుల్ని నియ‌మించుకున్న‌ట్లు పేర్కొన్నారు. త‌మ మ‌ధ్య త‌ర‌చూ గొడ‌వ‌లు జ‌రిగేవ‌ని.. కొంత‌కాలంగా కంపెనీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంద‌న్నారు. ఈ క్ర‌మంలో వంశీకృష్ణారావు అలియాస్ వంశీరావు అనే వ్య‌క్తి ఫోన్ చేసి అస‌భ్యంగా తిట్ట‌టంతో పాటు తాను తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బావ‌మ‌రిదినంటూ బెదిరిస్తున్నాడ‌న్నారు. ఉద్యోగుల‌కు జీతాలు ఎందుకు ఇవ్వ‌టం లేదంటూ తిడుతున్నార‌న్నారు. జీతాలు త్వ‌ర‌లో చెల్లిస్తామ‌ని చెప్పినా విన‌టం లేద‌న్నారు.

ఇటీవ‌ల పోలీస్ సైర‌న్ తో ఉన్న కారు ఏపీ29 డీఎస్ 0005 లో ఆఫీసుకు వ‌చ్చిన అత‌డు త‌మ‌ను రాయ‌దుర్గం పోలీస్ స్టేష‌న్ కు తీసుకెళ్లిన‌ట్లుగా పేర్కొన్నారు. అక్క‌డి పోలీసుల‌తో త‌మ‌ను బెదిరించాడ‌ని.. అక్క‌డ నుంచి త‌న కారులోనే తీసుకెళుతూ తుపాకీని గురి పెట్టి వార్నింగ్ ఇచ్చాడ‌ని వాపోయారు.