Begin typing your search above and press return to search.

గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న టెక్ కంపెనీల ఊచకోత

By:  Tupaki Desk   |   21 Jan 2023 12:30 PM GMT
గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న టెక్ కంపెనీల ఊచకోత
X
రోజు గడిస్తే.. హమ్మయ్య అన్నట్లుగా టెక్ కంపెనీల పరిస్థితి ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం వచ్చి పడిన భారీ రెసీషెన్ సమయంలో యూఎస్ లో వారాంతం వచ్చిందంటే ఎవరికి పింక్ స్లిప్ వస్తుందో అర్థం కాని పరిస్థితి ఉండేది. దీంతో.. ప్రతి వారాంతం వచ్చేసరికి ఉద్యోగులంతా ప్రార్థనలు చేసే వారు.. ఆ జాబితాలో తమ పేరు ఉండకూడదని. మళ్లీ ఇటీవల కాలంలో అలాంటి రోజులు కనిపిస్తున్నాయి.

గడిచిన కొద్ది రోజులుగా టెక్ కంపెనీల ప్రకటలు చూస్తుంటే.. తమ ఉద్యోగుల్ని పెద్ద ఎత్తున తొలగించటానికి సిద్ధమవుతున్న వైనం ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందన్నది ప్రశ్నగా మారింది.

సాధారణంగా కంపెనీల్లో ఉద్యోగుల కోత అప్పుడప్పుడు ఉండేదే అయినా.. ఇప్పుడున్న స్థాయిలో ఊచకోత మాత్రం లేదనే అంటున్నారు. అందుకు ఉదాహరణగా అమెజాన్ తన 28 ఏళ్ల చరిత్రలో అత్యధికంగా 18వేల ఉద్యోగుల్ని ఇంటికి పంపేందుకు సిద్ధమైంది. మెక్రోసాఫ్ట్ 10వేల మందికి గుడ్ బై చెబుతుంటే.. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ 12 వేల మందిని తొలగించేందుకు సిద్ధమైంది. జనవరి 15 లోపు 104 టెక్ కంపెనీలు తొలగించిన ఉద్యోగుల సంఖ్య ఎంతో తెలుసా? అక్షరాల 24 వేల మంది.

ఇంత భారీగా సాగిన కోతలు ఇటీవల కాలంలో చూసింది లేదని చెబుతున్నారు. దీంతో ఈ కొత్త ఊచకోతతో టెకీల గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఫ్యూచర్ మీద కొత్త భయాందోళనల్ని వ్యక్తమయ్యేలా చేస్తున్నాయి. టెక్ కంపెనీలు తమ ఉద్యోగుల్ని తొలగించే విషయంలో అమెరికాలో ఇప్పటికే షురూ చేసినా.. మిగిలిన దేశాల్లో మాత్రం స్థానిక చట్టాలకు అనుగుణంగా అమలు చేస్తాయని చెబుతున్నారు.

ఒకవైపు ఉద్యోగుల్ని తొలగించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తున్న వేళ..కొత్తగా రిక్రూట్ మెంట్ విషయంలో ఇప్పుడు ఆ ఆలోచనే లేదనే మాటను కంపెనీలు చెబుతున్నాయి.

ఒకవేళ నియామకాలు చేపట్టినా.. చాలా తక్కువ స్థాయిలోనే జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. రిక్రూట్ చేసుకున్నప్పటికీ ట్రైనింగ్ పూర్తి అయ్యాక నిర్వహించే పరీక్షలో ఫెయిల్ పేరుతో ఇంటికి పంపే వారి సంఖ్య ఎక్కువైనట్లు చెబుతున్నారు. చాలామంది ఫ్రెషర్స్ కు ఆఫర్ లెటర్ ఇచ్చిన టెక్ కంపెనీలు ఆ తర్వాత ట్రైనింగ్ కోసం పిలిచి.. చివర్లో పరీక్ష పెట్టి.. తమను ఇంటికి పంపిన వైనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పని చేసిన ప్రముఖ కంపెనీల్లో విప్రో కూడా ఉండటం గమనార్హం.
ఇంతకీ ఇలాంటి పరిస్థితి ఎందుకు మొదలైనట్లు? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తాయి. అదేమిటన్నది చూస్తే..
- 2008లో మహా మాంద్యం తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు బలహీన పడ్డాయి. వస్తు, సేవలకు డిమాండ్ తగ్గింది. అప్పులకు డిమాండ్లు తగ్గటంతో బ్యాంకులు తమ వడ్డీ రేట్లను తగ్గించాయి.
- ఈ కారణంతో బ్యాంకుల్లో పెట్టుబడులు పెట్టే వెంచర్ క్యాపిటలిస్టులు మార్జినల్ కాస్ట్ తక్కువగా ఉండే ఐటీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టటం మొదలు పెట్టారు.
- ఇదే సమయంలో స్మార్ట్ ఫోన్ల విప్లవంతో పాటు సోషల్ మీడియా కంపెనీలు దూసుకెళ్లటం జరిగింది. అవి ప్రపంచంలోనే అత్యంత సంపన్న కంపెనీలుగా అవతరించాయి. ఇలా దశాబ్దన్నర (అంటే పదిహేనేళ్లు) పాటు సాగిన హవాకు కరోనా చెక్ పెట్టిందని చెప్పాలి. కరోనా తర్వాత ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచాయి. దీంతో వెంచర్ క్యాపిటలిస్టులు టెక్ కంపెనీల్లో తాము పెట్టిన పెట్టుబడులను ఉపసంహరించుకోవటంతో షురూ చేశారు.
- ప్రపంచం మొత్తం మాంద్యం భయాందోళనలో మునిగిపోవటంతో.. ఖర్చుల తగ్గింపుపై ఫోకస్ చేశాయి. ఫలితంగా ఉద్యోగుల తొలగింపును ముమ్మరం చేశాయి. టెక్ కంపెనీలు కొత్త టెక్నాలజీ దిశగా అడుగులు వేయటం.. వాటికి తగ్గట్లుగా తమను తాము అప్డేట్ చేసుకోని ఉద్యోగుల్ని వదిలించుకోవటం మొదలు పెట్టాయి. తాజా ఉద్యోగాల కోతకు ఇది కూడా ఒక కారణమని చెప్పొచ్చు.
- మహా మాంద్యం తర్వాత పరుగులు తీసిన టెక్ కంపెనీలకు ఉన్న ప్రాథమిక సమస్యలు అన్నీ తీరిపోవటం.. ఇప్పటికిప్పుడు వారికి సమస్యలు పెద్దగా లేకపోవటంతో.. వారు ఇప్పుడు తర్వాతి సాంకేతికత (నెక్ట్స్ లెవల్ టెక్నాలజీ) మీద ఫోకస్ చేశారు. వాటికి తగ్గట్లు తయారుకానీ ఉద్యోగుల్నిలక్ష్యంగా చేసుకొని ఇంటికి పంపుతున్నారు.
- మరి.. ఈ మహాకోత నుంచి మనల్ని మనం రక్షించుకోవటానికి మనమేం చేయాలి? అన్న ప్రశ్న తలెత్తుతుంది. దీనికి వచ్చే సమాధానం ఒక్కటే. ఎవరికి వారు వ్యక్తిగతంగా తమకున్న నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోవటమే. ఒకసారి ఉద్యోగం వచ్చిందా? రిటైర్ అయ్యే వరకు భేషుగ్గా పని చేసుకుంటూ పోవచ్చన్న పాతకాలం నాటి తీరుకు చెక్ పెట్టాల్సిందే.
- ఎప్పటికప్పుడు అందుబాటులోకి వచ్చే కొత్త టెక్నాలజీలపై పట్టు సాధించటం.. ఆదిశగా తమను తాము అప్ గ్రేడ్ చేసుకోవటం తప్పనిసరి అంటున్నారు. అలా చేసే వారు ఎవరైనా ఎలాంటి ఇబ్బందులు లేవని.. ఒకే టెక్నాలజీలో ఉండిపోవటం.. తర్వాతి దశల్లోకి వెళ్లని వారికే ఇప్పుడున్న ఇబ్బందులని చెబుతున్నారు. దీనికి తోడు.. గతంలో మాదిరి కాకుండా కొంతకాలం అనవసర ఖర్చులకు చెక్ చెప్పటం.. వీలైనంత వరకు మర్చిపోయిన పొదుపు చర్యల్ని ఎవరికి వారు తీసుకుంటూ కూడా మంచిందంటున్నారు.
- ఇటీవల కాలంలో క్రేజ్ గా మారిన ఈఎంఐల ధోరణికి చెక్ పెట్టటం మంచిందని చెబుతున్నారు. కొత్త ఏడాది అంటే ఈ జనవరి 1 నుంచి 15 వరకు మన దేశంలోని 91 టెక్ కంపెనీలు ఇప్పటివరకు 24 వేల మంది టెకీలపై వేటు వేశాయి. 20 తేదీకి ఈ సంఖ్య 26 వేలకు చేరినట్లు చెబుతున్నారు. సో.. రానున్న రోజుల్లో ఈ ఊచకోత ఇదే రీతిలో సాగనుంది. అందుకే.. పరిస్థితులకు తగ్గట్లు మారటంతో పాటు.. అందుకు తగ్గట్లు ప్లాన్ చేసుకోవటం చాలా అవసరం. ఈ విషయంలో ఏ మాత్రం తేడా జరిగినా మొదటికే మోసం వస్తుందన్నది మాత్రం మర్చిపోకూడదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.