Begin typing your search above and press return to search.

ఆంధ్రాలో అందాల వీక్ష‌ణ‌కు అద్దాల రైలు

By:  Tupaki Desk   |   5 Oct 2019 12:43 PM GMT
ఆంధ్రాలో అందాల వీక్ష‌ణ‌కు అద్దాల రైలు
X
విదేశాల్లో ప‌ర్యాట‌క ప్రాంతాల‌ను చూడాలంటే ఓ అద్దాల రైలు వ‌చ్చి ప‌ర్యాట‌కుల‌ను ఎక్కించుకుని తిరుగుతుంది. ఈ అద్దాల రైలుతో ప‌ర్యాట‌క అందాల‌ను మొత్తం అందులో నుంచే వీక్షించే అవ‌కాశం చిక్కుతుంది. ఈ అద్దాల రైళ్ళ‌ను మ‌నం అనేక సినిమాల్లో చూసాం.. కేవ‌లం ఈ అద్దాల రైలులో ప్ర‌యాణం కోసం, పాటల కోసం అనేక సినిమాలు షూటింగ్ కోసం ఇత‌ర దేశాల‌కు త‌ర‌లిన సంద‌ర్భాలు ఉన్నాయి.. అయితే ఇప్పుడు అదే అద్దాల రైలును ఆంధ్రాకు తెప్పిస్తే ఎలా ఉంటుంది.. ఇక్క‌డ ప‌ర్యాట‌క రంగంలో దీన్ని ప్ర‌వేశ‌పెడితే ఎలా ఉంటుంది అనే ఆలోచ‌న వ‌చ్చిందే త‌డువుగా ప‌ర్యాట‌క రంగానికి కొత్త ఊపు రావాలంటే ఇలాంటి అద్దాల రైలు తేవాల్సిందే అనుకున్నారు రైల్వేశాఖ‌.

అందుకు ఇప్పుడు ఆంధ్రా ఊటీ అందాల అర‌కు ప్ర‌దేశాలను అద్దాల రైలులో నుంచి వీక్షించేందుకు ఐదు అద్దాల రైళ్ళ‌ను న‌డుపాల‌ని రైల్వే బోర్డుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఇక యాత్రికులు ఎంచ‌క్కా ఈ అద్దాల రైలు నుంచే అర‌కు అందాల‌ను త‌నివీతీరా చూడ‌వ‌చ్చు... ఇంత‌కు ఈ అద్దాల రైలు ప్ర‌త్యేక‌త‌లు ఏంటో ఓసారి చూద్దాం... విశాఖ నుంచి అరకు వెళ్లే రైలులో 2017 ఏప్రిల్‌ 16 విస్టాడోమ్‌ కోచ్ (అద్దాల పెట్టె)ను ఏర్పాటు చేసింది రైల్వేశాఖ‌. అప్పటి నుంచి ఈ కోచ్‌ నిత్యం కిటకిటలాడుతూ ఉంది. విశాఖ నుంచి అరకు 130 కిలోమీటర్లు ప్రయాణం సాగించేందుకు ప్రతి రోజూ ఉదయం 7 గంటలకు విశాఖ–కిరండోల్‌ రైలులో ఈ విస్టాడోమ్‌ కోచ్‌ని ఏర్పాటు చేశారు.

పర్యాటకులు ఈ బోగీలో ప్రయాణించేందుకు అమితాసక్తి చూపుతుండటంతో మరో కోచ్‌ ఏర్పాటు చేయాలని 2017లోనే ప్రతిపాదించారు. అప్పటి నుంచి ఈ ప్రతిపాదన బుట్టదాఖలవుతూ వస్తోంది. వైసీపీ ఎంపీల కోరిక మేర‌కు ఏకంగా 5 విస్టాడోమ్‌ కోచ్‌లు ఇచ్చేందుకు అంగీక‌రించారు. గ‌త‌నెల‌ 27న ఉదయ్‌ రైలు ప్రారంభించేందుకు వచ్చిన రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్‌ అంగడి 5 అద్దాల కోచ్‌లు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఒక్కో కోచ్‌లో 45 సీట్లుండేవి.. కానీ ఇప్పుడు కొత్తగా రానున్న టూరిస్ట్‌ రైలులో ఏకంగా 270 మంది అరకు అందాల్ని అందాలు వీక్షించవచ్చు.

అనంతగిరి అడవులు, ఎత్తైన కొండలూ.. వాటిపై పరచుకున్న పచ్చదనం.. జలపాతాలు.. ఇలా.. ఎన్నో అందాలు కళ్లార్పకుండా చూసే అవకాశం కలగనుంది. కదిలే రైల్లో విస్టాడోమ్‌ కోచ్‌ నుంచి వీటిని చూస్తుంటే గాల్లో తేలుతున్న అనుభూతి కలుగుతుంది. ఈ కోచ్‌ల‌ను త్వ‌రలో ప్రారంభించ‌నున్నారు. దీంతో యాత్రికుల‌కు రైలులోనే అంద‌మైన అర‌కు లోయ‌ల‌ను, జ‌ల‌పాతాల‌ను త‌నివితీరా వీక్షించ‌వ‌చ్చు.