Begin typing your search above and press return to search.

పిల్లలకి సోకుతోన్న కొత్త వ్యాధి.. ఎంఐఎస్‌‌-సి

By:  Tupaki Desk   |   1 Jun 2021 10:30 AM GMT
పిల్లలకి సోకుతోన్న  కొత్త వ్యాధి.. ఎంఐఎస్‌‌-సి
X
ప్రస్తుతం ఓ వైపు కరోనా వైరస్ తో సతమతమవుతున్న ప్రజలకి అనేక ఇతర వ్యాధులు కూడా ఒకదాని తర్వాత మరొకటి వెలుగులోకి వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు బ్లాక్‌ ఫంగస్‌, వైట్ ఫంగస్ కేసులు వెలుగులోకి వస్తుంటే , తాజాగా అనేక చోట్ల ఎంఐఎ -సి (మల్టీసిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ ఇన్‌ చిల్డ్రన్‌) లక్షణాలతో కేసులు నమోదవుతున్నాయి. కరోనా నుంచి కోలుకొన్న 15ఏళ్లలోపు పిల్లలకు ఎంఐఎస్-సి వ్యాధి ఎక్కువగా సోకుతోంది. కొన్ని సందర్భాల్లో కరోనా సోకిన పెద్దవారి నుంచి కూడా పిల్లలకు ఎంఐఎస్ -సి వ్యాధి రావచ్చని వైద్యులు చెబుతున్నారు.

రక్తనాళాల్లో వాపు వల్ల శరీరంలోని అనేక అవయవాలు ఎర్రగా మారడం లేదా బయటకు వాపు కనిపించడం ఎంఐఎస్-సి వ్యాధి లక్షణాలు. హృదయానికి సంబంధించిన కండరాలు, ఊపిరితిత్తులు, మెదడు, కళ్లు, కిడ్నీలు తదతర అవయవాలపై దీని ప్రభావం ఉంటుంది.

ఎంఐఎస్-సి సోకిన పిల్లలకు ఆర్‌టీ-పీసీఆర్‌లో కరోనా పాజిటివ్‌ రావడంతోపాటు డీడైమర్‌, సీఆర్‌ పీ, ఫెరిటిన్‌, ఎల్‌ డీహెచ్‌ స్థాయులు పెరుగుతాయి. రోగ నిరోధక కణాలు నశించి రక్తనాళాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటోంది. రక్తం గడ్డకట్టడంతోపాటు తీవ్రంగా షాక్‌ కు లోనవుతారు. ఇవన్నీ అత్యంత ప్రమాదకరమైన సంకేతాలు కాబట్టి పిల్లల్లో వీటిని త్వరగా గుర్తించి వైద్యులకు చూపించడం అవసరం. వీరికి రోగనిరోధక శక్తిని పెంపొందించే ఐవీ ఇమ్యునోగ్లోబులిన్స్‌ సకాలంలో అందించడం ముఖ్యం. కవాసాకి అనే వ్యాధిని పోలిన లక్షణాలు ఇందులోనూ బయటపడుతున్నాయని వైద్యులు అంటున్నారు. వచ్చే కొద్దివారాల్లో ఎంఐఎస్-సి కేసులు ఇంకా పెరగొచ్చని హెచ్చరిస్తున్నారు.

ఈ వ్యాధి వచ్చిన పిల్లలు ఆస్పత్రిలో సగటున ఏడెనిమిది రోజులు ఉన్నారని పరిశోధకులు గుర్తించారు. పిల్లందరికీ జ్వరం వచ్చింది. దాదాపు 73 శాతం మందిలో పొట్ట నొప్పి లేదా డయేరియా సమస్యలు కనిపించాయి. 68 శాతంమంది పిల్లలు వాంతులు కూడా చేసుకున్నారు అని మెడికల్ జర్నల్ ద లాన్సెట్ తన రిపోర్టులో చెప్పింది. ప్రపంచంలోని మరికొన్ని సంస్థలు చెబుతున్న ఇతర లక్షణాలతోపాటూ కళ్ల కలక కూడా ఎంఐఎస్-సి వ్యాధికి సంబంధించిన ఒక ప్రధాన లక్షణమని బ్రిటన్‌ ప్రముఖ మెడికల్ జర్నల్ ద బీఎంజే చెప్పింది. ఇది మొదట చిన్న చిన్న లక్షణాలతో మొదలవుతుంది. కానీ, ఏ చికిత్సా తీసుకోకుంటే అది వేగంగా పెరుగుతుంది. కొన్ని రోజుల్లోనే దానివల్ల చాలా అవయవాలపై ప్రభావం పడుతుంది. అవి ఒకేసారి పనిచేయకుండా పోయే ప్రమాదం ఉంది.

ఎలాంటి పిల్లల్లో ఈ వ్యాధి తీవ్రమవుతోంది. ఎందుకు అవుతోంది అనే విషయంలో సీడీసీ పరిశోధకులు ఇప్పటివరకూ తగిన వివరాలు సేకరించలేకపోయారు. అయితే ఎంఐఎస్-సి లక్షణాలు కనిపించిన పిల్లలకు ఎప్పుడైనా కోవిడ్-19 రావడం, లేదా కోవిడ్ రోగులకు వారు దగ్గరగా మెలగడం జరిగింది.ముందే కొన్ని రకాల వ్యాధులున్న పిల్లలకు, ఎలాంటి ఆరోగ్య స్థితి ఉన్న పిల్లలకు ఈ వ్యాధి ప్రమాదకరం అనేది అప్పుడే చెప్పలేం. ఎంఐఎస్-సికి గురైన ఎలాంటి పిల్లలకు మొదట చికిత్స అందించాలి, ఎవరిపై ఎక్కువ దృష్టి పెట్టాలి అనేది కూడా ఇంకా స్పష్టత రాలేదు సీడీసీ పరిశోధకుల చెప్పారు.