Begin typing your search above and press return to search.

మునుగోడులో కొత్త ట్రెండ్.. బీరువాలో దాచిన ఖద్దరు బట్టల్ని తీస్తున్నారట

By:  Tupaki Desk   |   28 Sep 2022 4:57 AM GMT
మునుగోడులో కొత్త ట్రెండ్.. బీరువాలో దాచిన ఖద్దరు బట్టల్ని తీస్తున్నారట
X
రెండు తెలుగు రాష్ట్రాల్లోని వారంతా ఎంతో ఆసక్తిగా గమనిస్తున్న మునుగోడు నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న సిత్రాలు అన్నీఇన్నీ కావు. ప్రతి ఒక్క పార్టీకి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారిన ఈ ఉప ఎన్నిక.. అత్యంత ఖరీదైన ఉప ఎన్నికల్లో ఒకటిగా నిలుస్తుందన్న మాట వినిపిస్తోంది. అంతేకాదు.. ఉప ఎన్నికను ఎదుర్కోవటానికి రాజకీయ పార్టీలు ఏం చేయాలి? ఏం చేయకూడదు? అన్న విషయాల మీద సరికొత్త నివేదికల్నిసిద్ధం చేసే పరిస్థితి. తాజాగా అలాంటి ఉదంతమే ఒక ట్రెండ్ నడుస్తోంది.

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో త్వరలో జరిగే ఉప ఎన్నికకు సంబంధించిన హడావుడి ఇప్పటికే మొదలైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి.. పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం తీసుకోవటంతో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఎప్పుడూ నోటిఫికేషన్ విడుదల అవుతుందన్న దానిపై సరైన క్లారిటీ లేనప్పటికీ.. తమ జట్టును సిద్ధం చేసుకోవటంలో పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పలువురు ఛోటా నేతలు.. తమ ఇంట్లోని బీరువాలో దాచి ఉంచిన ఖద్దరు వస్త్రాల్ని ధరిస్తున్నారు.

ఎందుకిలా? అంటే.. మునుగోడులో ఏర్పడిన రాజకీయ డిమాండ్ తో పెద్ద ఎత్తున ఛోటా నేతలు పుట్టుకొస్తున్నారు. పార్టీ ఏదైనా సరే.. నోట్లతోనే రాజకీయం నడుస్తుందన్న విషయాన్ని బాగా వంట పట్టించుకున్ననేతలు.. తమ సత్తా చాటేందుకు చిన్న చితకా నేతల్ని సైతం ప్రోత్సహిస్తున్నారు. దీంతో.. పలువురు ఛోటా నేతలు ఖద్దరు వస్త్రాల్ని ధరించి.. తమకున్న ఓట్ల లెక్కల గురించి గొప్పలు చెప్పుకుంటూ పార్టీల నుంచి దోచుకోవటం ఎక్కువైందన్న మాట వినిపిస్తోంది.

నోటిఫికేషన్ విడుదల ఎప్పుడు అవుతుందో తెలీకున్నా.. ఇప్పటికే పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ మొదలైన విషయాన్ని పలువురు పార్టీ నేతలు లోగుట్టుగా చెప్పుకుంటూ.. ఇలాంటి పరిస్థితి ఇటీవల కాలంలో జరిగిన ఉప ఎన్నకల్లో ఎప్పుడూ చూడలేదని చెబుతున్నారు.

తమను మభ్య పెట్టి డబ్బులు లాగేస్తున్న విషయాన్ని గుర్తించినా.. ఏమీ తెలీనట్లుగా వ్యవహరిస్తున్న విచిత్రం మునుగోడులో ఉంది. కారణం.. ఎవరినైనా నొప్పిస్తే.. తమపై నెగిటివ్ ప్రచారం అవుతుందన్న ఆందోళనతో తొందరపడకుండా సంయమనం పాటిస్తున్నారు.

దీంతో.. ఈ విషయాన్ని పసిగట్టిన పలువురు ఛోటా నేతలు ఖద్దరు ధరించి.. హడావుడి చేస్తున్న వైనం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోని ఛోటా నేతలంతా ఖద్దరు వస్త్రాల్ని ధరిస్తూ.. హడావుడి చేయటంతో పాటు.. వివిధ పార్టీల నేతలపై ఒత్తిడి పెంచేస్తూ.. డబ్బులు లాగేస్తున్న వైనం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. దీంతో.. ఖద్దరు ధరించిన ఛోటా నేతల డిమాండ్ ఒక స్థాయికి చేరినట్లుగా పేర్కొంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.