Begin typing your search above and press return to search.

బీజేపీలోకి పొంగులేటి ఎంట్రీలో కొత్త ట్విస్ట్

By:  Tupaki Desk   |   21 Jan 2023 5:30 AM GMT
బీజేపీలోకి పొంగులేటి ఎంట్రీలో కొత్త ట్విస్ట్
X
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అడుగులు తడబడుతున్నాయి. ఆయన బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరుతారన్న ప్రచారం మొదలైంది. ఈ మేరకు రంగం కూడా సిద్ధం చేశారు. అయితే సడెన్ గా ఆయన ఆలోచన మారిందా? అన్న సంశయం వెంటాడుతోంది. తుమ్మలను తిరిగి బీఆర్ఎస్ లో చేర్చడంలో సఫలమైన కేసీఆర్, హరీష్ లు ఇప్పుడు పొంగులేటి విషయంలోనూ వెనక్కి తగ్గనున్నట్టు సమాచారం.

పొంగులేటి ఇప్పుడు జిల్లావ్యాప్తంగా 10 అసెంబ్లీ నియోజకవర్గంలో తన అనుచరువర్గంతో భేటిలు నిర్వహిస్తున్నారు. తమ లక్ష్యాలను వివరిస్తున్నారు. దీంతో ఇప్పుడు పొంగులేటి తాజా రాజకీయ అడుగులపైన కొత్త చర్చ మొదలైంది. పొంగులేటి ఏం చేయబోతున్నారన్నది ఆసక్తి రేపుతోంది.

పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్త లక్ష్యంతో ముందుకు వెళుతున్నారు. తాజాగా ఆయన అశ్వారావుపేటలో తన అనుచర వర్గంతో సుధీర్ఘ మంతనాలు జరిపారు. నాలుగేళ్ల కాలంలో గులాబీ పార్టీలో తనను నిర్లక్ష్యం చేస్తున్న తీరుపైన పార్టీ నేతలతో ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ మారటం ఖాయమని చెప్పుకొచ్చారు. అయితే ఏ పార్టీలో చేరే అంశంపైన మాత్రం అనుచరుల నుంచే అభిప్రాయ సేకరణ చేశారు. బీజేపీలో చేరితే ప్రయోజనం ఉంటుందని అనుచరులు సూచించారు. కాంగ్రెస్ లో చేరితే కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని.. బీజేపీలో చేరడం ద్వారా రాజకీయంగా మేలు జరుగుతుందని చెప్పుకొచ్చారు. ఎక్కడా పొంగులేటి తాను బీజేపీలో చేరుతున్న విషయాన్ని అనుచరుల వద్ద బయటపెట్టకపోవడంతో ఈ అనుమానాలకు దారితీస్తోంది.

ఈనెల 18న అమిత్ షాతో భేటి అయ్యాక పొంగులేటి బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగింది. ఖమ్మం వేదికగానే భారీ సభ ఏర్పాటు చేసి అక్కడ బీజేపీ కండువా కప్పుకుంటారని వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి బీజేపీలో చేరడం పైన తనకు సమాచారం లేదన్నారు.ఎవరైనా పార్టీలో తమ సిద్ధాంతాలు నచ్చి చేరితే ఆహ్వానిస్తామని.. సీట్ల కోసమైతే కష్టమని తెలిపారు. దీంతో పొంగులేటి అడిగినన్నీ సీట్లపై బీజేపీ హామీ ఇవ్వలేదని అర్థమైంది.

ఖమ్మం లోక్ సభతోపాటు పది అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ తన అనుచరులకు తాను చేరే కొత్త పార్టీ నుంచి టికెట్ల పైన హామీ పొందాలని పొంగులేటి ప్రయత్నిస్తున్నారు. అయితే అన్ని సీట్లు ఇవ్వడానికి బీజేపీ నిరాకరించడంతోనే ఆ పార్టీలో చేరే అంశంలో పునరాలోచించాలని పొంగులేటి డిసైడ్ అయినట్లు సమాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.