Begin typing your search above and press return to search.

దేశ రాజ‌ధానిలో కొత్త క‌రోనా వేరియంట్ క‌ల‌క‌లం!

By:  Tupaki Desk   |   11 Aug 2022 7:30 AM GMT
దేశ రాజ‌ధానిలో కొత్త క‌రోనా వేరియంట్ క‌ల‌క‌లం!
X
ఇటీవ‌ల కొద్దిగా శాంతించిన కోవిడ్ మ‌రోమారు చాప‌కింద నీరులా విస్త‌రిస్తోంది. ప్ర‌స్తుతం దేశంలో రోజుకు 20000కు పైగా కేసులు న‌మోదవుతున్నాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీలో రోజూ 2 వేలకుపైగా కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి.

సామాన్య ప్ర‌జ‌లే కాకుండా ప్ర‌ముఖులు కూడా కోవిడ్ బారిన ప‌డుతున్నారు. తాజా పరీక్షల్లో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బయటపడినట్టు వైద్యులు చెబుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఢిల్లీలోని లోక్‌నాయక్ జైప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రి వైద్యులు ఈ విష‌యాన్ని తెలిపారు.

కోవిడ్ సోకిన కొంతమందిలో అత్యంత వ్యాప్తి కలిగిన సబ్ వేరియంట్ BA 2.75ను గుర్తించారు. ఈ వేరియంట్ ప్రభావం యాంటీబాడీలు ఉన్నవారిపైన, వ్యాక్సిన్ తీసుకున్నవారిపైనా కూడా ఉంటుంద‌ని చెబుతున్నారు.

కోవిడ్ సోకిన‌వారిలో 90 మంది శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంప‌గా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BA 2.75 బయటపడిందంటున్నారు. ఈ కొత్త వేరియంట్‌తో చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సురేశ్ కుమార్ చెబుతున్నారు.

కాగా ఢిల్లీలో గ‌త 24 గంటల వ్యవధిలోనే 2445 మందికి కోవిడ్ పాజిటివ్ గా తేలింది. ఫిబ్రవరి నుంచి ఢిల్లీలో అత్యధిక సంఖ్యలో నమోదైన కేసులు ఇవే. దీంతో పాజిటివిటీ రేటు 15.41కి చేరింది. ఇప్పటివరకు వైరస్ తో ఏడుగురు మరణించ‌డం కోవిడ్ కేసులు పెరుగుతున్నాయ‌న‌డానికి నిద‌ర్శ‌న‌మ‌ని చెబుతున్నారు.

ఇప్ప‌టికే కాంగ్రెస్ అగ్ర నేత‌లు సోనియా గాంధీ, ప్రియాంకా, రాజ్య‌స‌భ‌లో కాంగ్రెస్ ప‌క్ష నేత
మల్లికార్జున్ ఖర్గే వంటి వారు కోవిడ్ బారిన‌పడ్డారు. వీరిలో కొంత‌మందికి రెండోసారి కూడా కోవిడ్ రావ‌డం గ‌మ‌నార్హం. కాగా మ‌రోవైపు ఢిల్లీలో కేసులు పెరుగుతుండటంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. కోవిడ్ వ్యాక్సిన్ల‌తోపాటు బూస్ట‌ర్ డోసును కూడా అందుబాటులో ఉంచామ‌ని ఆయ‌న చెబుతున్నారు. ఇప్ప‌టికీ వ్యాక్సిన్ తీసుకోని వారు ఉంటే వెంట‌నే వ్యాక్సిన్ తీసుకోవాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.