Begin typing your search above and press return to search.

సూటిప్ర‌శ్న‌తో లోకేశ్‌కు చిరాకు పుట్టించేశాడు

By:  Tupaki Desk   |   24 May 2017 4:46 AM GMT
సూటిప్ర‌శ్న‌తో లోకేశ్‌కు చిరాకు పుట్టించేశాడు
X
గ‌త ప‌రిస్థితులు ఇపుడు లేవ‌న్న‌ విష‌యాన్ని అధినేత‌లు.. వారి వార‌సులు గుర్తించ‌టం లేదా? క‌ష్టాన్ని గుండెల్లో దాచుకొని.. అభిమానాన్ని మాత్ర‌మే ప్ర‌ద‌ర్శించే నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఇప్పుడు త‌గ్గుతున్నార‌ని.. అర్థ‌మైనా ఇంకా జీర్ణించుకోవ‌డం లేదు. విష‌యం ఎలాంటిదైనా మ‌న‌సులో దాచుకోకుండా ఓపెన్ గా మాట్లాడే తీరు ఇప్పుడు పెరిగింద‌న్న విష‌యాన్ని గుర్తించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న‌ది తాజా ఉదంతాన్ని చూస్తే అర్థ‌మ‌వుతుంది.

మాట‌ల్లో చెప్పే ఆద‌ర్శాల‌కు.. చేత‌ల‌కు మ‌ధ్య అంత‌రాన్ని ప్ర‌శ్నించే ధోర‌ణి పార్టీ ముఖ్య‌నేత‌ల‌కు చిరాకు పుట్టిస్తూ ఉంటుంది. తాజాగా అలాంటి చేదు అనుభ‌వ‌మే ఎదురైంది ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న‌యుడు క‌మ్ మంత్రి నారా లోకేశ్‌కు. ఒక స‌మావేశంలో పాల్గొన్న ఆయ‌న‌కు ఒక కార్య‌క‌ర్త సూటిగా అడిగిన ప్ర‌శ్న చిరాకు తెప్పించేసింది.
పార్టీలో క‌ష్ట‌ప‌డిన వారికి న్యాయం జ‌ర‌గ‌లేదంటూ ఓ కార్య‌క‌ర్త ప్ర‌శ్నించటంతో లోకేశ్ ఇబ్బందికి గుర‌య్యారు. పంచాయితీ రాజ్ 40వ వార్షికోత్స‌వ స‌మావేశంలో పాల్గొన్న లోకేశ్ కు.. గొమ్ములూరుకు చెందిన టీడీపీ కార్య‌క‌ర్త ఒక‌రు సూటిప్ర‌శ్న వేసి ఆయ‌న‌కు చిరాకు తెప్పించారు.

క‌ష్ట‌ప‌డుతున్న వారికి పార్టీలో గుర్తింపు ల‌భించ‌టం లేద‌ని.. గ‌తంలో పార్టీ అధినేత చంద్ర‌బాబును నాలుగుసార్లు క‌లిసి ఫిర్యాదు చేసినా.. న్యాయం జ‌ర‌గ‌లేద‌న్న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ మాట‌లు ఇబ్బందిక‌రంగా ఉండ‌టంతో భ‌ద్ర‌తా సిబ్బంది గుర్తించి ఆయ‌న్ను అడ్డుకున్నారు. ఇదే స‌మ‌యంలో స్పందించిన లోకేశ్‌.. మీ అభిప్రాయాన్ని పార్టీ అభిప్రాయంగా చెప్పొద్ద‌ని ఘాటుగా బదులిచ్చారు. ప్ర‌శ్నించిన వారిపై కోపం ప్ర‌ద‌ర్శించే క‌న్నా.. సానుకూలంగా స్పందిస్తే ఫ‌లితం మ‌రింత‌గా ఉంటుందేమో? మ‌రా విష‌యాన్ని లోకేశ్‌కు చెప్పేదెవ‌రు?