Begin typing your search above and press return to search.

యూపీలో రెచ్చిపోయిన ఎమ్మెల్యే అనుచరుడు .. అధికారులు, పోలీసుల ముందే ..

By:  Tupaki Desk   |   16 Oct 2020 3:30 PM GMT
యూపీలో రెచ్చిపోయిన ఎమ్మెల్యే అనుచరుడు .. అధికారులు, పోలీసుల ముందే ..
X
యూపీలో మరో దారుణం చోటుచేసుకుంది. అధికారులు, పోలీసులు చూస్తుండగానే ఎమ్మెల్యే అనుచరుడు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. రేషన్ దుకాణాల కేటాయింపుల సందర్భంగా సభ్యుల మధ్య జరిగిన గొడవ పెద్దగా మారి హత్య కు దారితీసింది. జయప్రకాశ్ అనే వ్యక్తిపై బీజేపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు ధీరేంద్ర సింగ్ కాల్పులకు తెగబడ్డాడు. వేదికపై అధికారులు ఉండగానే ఈ ఘటన జరగడం గమనార్హం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే .. బల్లియాలోని దుర్జాపూర్ గ్రామంలో రేషన్ దుకాణాల కేటాయింపుల కోసం అధికారులు సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా హాజరైన జయప్రకాశ్, ధీరేంద్ర సింగ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.దాంతో ధీరేంద్ర తన వెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడని ఎస్పీ దేవేంద్ర నాథ్ తెలిపారు. హత్య జరిగే సమయానికి అధికారులు, పోలీసులు అక్కడే ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. నిందితుడు బల్లియా బీజేపీ ఎక్స్-సర్వీస్‌మెన్ విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నట్టు ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ ధ్రువీకకరించారు. హతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు 15 నుంచి 20 మందిపై పోలీసులు కేసు నమోదుచేశారు. అయితే, ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదు.

కాల్పుల తర్వాత అక్కడ జనం భయంతో పరుగులు తీయగా తొక్కిసలాట చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారీగా జనం గుమిగూడి ఉండగా.. నిందితుడు మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్టు వీడియోలో స్పష్టమవుతోంది. అధికారుల సమక్షంలో ఈ ఘటన జరగడంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తీవ్రంగా స్పందించారు. ఆ సమయంలో ఉన్న అధికారులను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఈ ఘటనను సీఎం తీవ్రంగా పరిగణిస్తున్నారని, ఆర్డీఓ సహా అక్కడ ఉన్న పోలీస్ అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి అవనీశ కుమార్ అవస్థీ తెలిపారు.