Begin typing your search above and press return to search.

ఏపీలో ఓ పొలిటికల్ ఇంట్రస్టింగ్ మ్యారేజీ

By:  Tupaki Desk   |   11 April 2022 11:30 AM GMT
ఏపీలో ఓ పొలిటికల్ ఇంట్రస్టింగ్ మ్యారేజీ
X
పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయం అవుతాయంటారు. అందుకే భారతీయ సంప్రదాయంలో వివాహానికి అంత ప్రాధాన్యమిస్తారు. పెళ్లంటే అమ్మాయి-అబ్బాయి కుటుంబాల మధ్యే కాదు.. అనేక రకాల బంధుత్వాలు ఏర్పడతాయి. ఇక రాజకీయాల్లో కొన్ని వివాహాలు అనుకోకుండా కుదురుతుంటాయి. ఇందులో అబ్బాయి-అమ్మాయి అంగీకారం లేకుండా ఏమీ ఉండదు. మరోవైపు పిల్లల అంగీకారం తర్వాతే పెద్దలు కుదర్చిన పెళ్లిళ్లూ ఉంటాయి. ఇదంతా పక్కనపెడితే ఆంధ్రప్రదేశ్ లో ఓ వివాహం ఆశ్చర్యం రేపుతోంది. ఆంధ్రా -రాయలసీమ కలయికగా సాగనున్న ఈ వివాహం ఓ జిల్లాలో రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చినా ఆశ్చర్యం లేదు.

ఎవరిదా వివాహం?

ఉమ్మడి ఏపీలో భూమా నాగిరెడ్డి కుటుంబం గురించి తెలియని వారుండరు. వారికున్న పేరు ప్రఖ్యాతులు అలాంటివి. కర్నూలు జిల్లాలో అయితే భూమా ఫ్యామిలీ అంటేనే స్టేచర్. గతంలో వీరి కుటుంబానికి ముఖ్యంగా నాగిరెడ్డికి వ్యక్తిగతంగా ఆప్తుడు, మిత్రుడు ఏవీ సుబ్బారెడ్డి. ఈయన ఎంత చెబితే నాగిరెడ్డికి అంత. నాగిరెడ్డికి బాల్య మిత్రడైన సుబ్బారెడ్డి.. నాగిరెడ్డి మరణం వరకు ఆయనతోనే ఉన్నారు. అయితే, నాగిరెడ్డి మరణం తర్వాత భూమా కుటుంబంతో ఆయనకు దూరం పెరిగింది. కారణాలు ఏవైనా నాగిరెడ్డి కుమార్తె అఖిల ప్రియ.. సుబ్బారెడ్డిని దూరం పెట్టారు. ఓ దశలో ఆయనపై హత్యా ప్రయత్నం కూడా జరిగింది. ఇది ఎవరు చేసింతి తెలియకున్నా.. అఖిలప్రియ వర్గం పనేనని వార్తలు వచ్చాయి. అయితే, అవేవీ ఇంకా నిర్దారణ కాలేదు. కాగా, చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో సుబ్బారెడ్డి పార్టీకి చేసిన సేవలను గుర్తించి ఆయనను రాష్ట్ర విత్తనాభివ`ద్ధి సంస్థ చైర్మన్ గా నియమించారు. రాష్ట్ర స్థాయి పదవితో గుర్తించారు. అయితే, భూమా అఖిలప్రియతో విభేదాల నేపథ్యంలో తర్వాత సుబ్బారెడ్డి ఆ కుటుంబానికి దూరంగానే ఉంటూ వచ్చారు.

వైసీపీ వచ్చాక

వైసీపీ ప్రభుత్వం వచ్చాక సుబ్బారెడ్డి- అఖిలప్రియ వర్గాల మధ్య దూరం మరింత పెరిగింది. ఆ క్రమంలోనే హత్యాయత్నం వార్తలు వచ్చాయి. వీటిపై సుబ్బారెడ్డి పెద్ద కుమార్తె జశ్వంతి బయటకు వచ్చి నిరసన తెలిపారు. యూట్యూబ్ ఇంటర్వ్యూలూ ఇచ్చారు. జశ్వంతి వాగ్ధాటి అందరినీ ఆకట్టుకుంది. అప్పుడే ఆమెకు రాజకీయంగా మంచి భవిష్యత్ ఉందని అనిపించింది. కాగా, ఇటీవలి జశ్వంతికి.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా పెద్ద కుమారుడు సిద్దార్థతో వివాహం నిశ్చయమైంది. చూస్తుంటే వీరిది ప్రేమ వివాహంగా తెలుస్తోంది. బోండా ఉమా తెలుగుదేశంలో ప్రస్తుతం కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే.

ఇక వచ్చే ఎన్నికల్లో సుబ్బారెడ్డి ఫ్యామిలీకి నంద్యాల, ఆళ్లగడ్డల్లో ఎక్కడో ఒక చోట టిక్కెట్ ఇవ్వక తప్పని పరిస్థితి. ఎందుకంటే ఆ రెండు నియోజకవర్గ్డాల్లో కాపు-బలిజ సామాజిక వర్గం ఓట్లు 40 వేల వరకు ఉంటాయి. జశ్వంతి చేసుకోబోతున్నది ఈ వర్గానికి చెందిన బోండా ఉమా కుమారుడినే. ఈ రెండు కులాల ఓట్లు కలిస్తే ఆ రెండు నియోజకవర్గాల్లో తిరుగుండదు.

టీడీపీ టికెట్ పై ఊహాగానంతో ఇది రాజకీయంగా చెప్పుకొంటున్న విశ్లేషణ. కాగా, సుబ్బారెడ్డి కి ఒకప్పటి ఆప్త మిత్రడైన నాగిరెడ్డి పెద్ద కుమార్తె అఖిలప్రియ కూడా ఇలానే కాపు-బలిజ యువకుడిని వివాహం చేసుకోవడం విశేషం. చిత్తూరు జిల్లాకు చెందిన ఎంఎం నాయుడు కుటుంబం హైదరాబాద్ లో విద్యా సంస్థలను స్థాపించి స్థిరపడింది. ఆయన కుమారుడు భార్గవ్ రామ్ ను అఖిలప్రియ వివాహం చేసుకున్నారు. గత ఎన్నికల సమయంలో తాను కాపుల కోడలినని చెప్పుకొంటూ వారి ఓట్లడిగారు. ఇలా.. ఇప్పుడు సుబ్బారెడ్డి కుటుంబం కూడా తమ నాయకుడి కుటుంబం అడుగుజాడల్లో నడిచిందన్నమాట. చూద్దాం.. సుబ్బారెడ్డి రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతోందో?