Begin typing your search above and press return to search.

ఢిల్లీలో జెండా పాతిన తొలి పార్టీ టీఆర్ఎస్ దే..

By:  Tupaki Desk   |   11 Oct 2020 4:30 AM GMT
ఢిల్లీలో జెండా పాతిన తొలి పార్టీ టీఆర్ఎస్ దే..
X
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి అరుదైన ఘనత సాధించింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఒక ప్రాంతీయ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కేంద్రం కొంత భూమిని కేటాయించడం విశేషం. ఇలా భూమి సంపాదించిన దేశంలోని ఏకైక ప్రాంతీయ పార్టీగా టీఆర్ఎస్ అరుదైన గౌరవాన్ని సాధించింది.

ఇప్పటివరకు ఏ ప్రాంతీయ పార్టీకి సాధ్యం కానీ పనిని టీఆర్ఎస్ చేసి చూపించింది. ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకునేందుకు మోడీ సర్కార్ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్వాతంత్య్రం వచ్చాక దేశ రాజధానిలో సొంతంగా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకోబోయే రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ రికార్డు సృష్టించనుంది.

దేశంలో ప్రాంతీయ పార్టీల హవా మొదలై నాలుగు దశాబ్దాలు గడుస్తున్నాయి. అయినప్పటికీ ఏ ఒక్క ప్రాంతీయ పార్టీకి ఢిల్లీలో కేరాఫ్ ఆఫీసు లేకపోవడం గమనార్హం. ఈ పార్టీలన్నీ కూడా ఆయా ఎంపీలకు కేటాయించే ఇళ్లలోనే రీజనల్ పార్టీలను ఇప్పటిదాకా కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ పార్టీలకు మాత్రమే సొంత కార్యాలయాలున్నాయి.

జాతీయ పార్టీలుగా చెప్పుకునే టీడీపీగానీ.. ఢిల్లీని ఏలుతున్న ఆమ్ ఆద్మీ పార్టీకిగానీ సొంత పార్టీలు లేవు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయం చెప్పుకునే ఏ పార్టీలకు కూడా ఢిల్లీలో పార్టీ కార్యాయాలు లేకపోవడం గమనార్హం. అలాంటిది టీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొనే తొలి పార్టీగా రికార్డు సృష్టించనుండటం గమనార్హం.

మోదీ అండతోనే టీఆర్ఎస్ ఢిల్లీలో పాగావేసేందుకు రెడీ అవుతుందనే టాక్ విన్పిస్తోంది. ఇక జాతీయ పార్టీలో చక్రం తిప్పుతాననే మాజీ సీఎం చంద్రబాబుకు ఇది అవమానంగా మారనుంది. జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు చేయలేని పనిని కేసీఆర్ చేసి చూపించడం చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ చాణిక్యానికి ఇదొక మచ్చుతునక అని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.