Begin typing your search above and press return to search.

ఆ అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ ఆచూకీ చెబితే భారీ న‌జ‌రానా!

By:  Tupaki Desk   |   1 Sep 2022 7:45 AM GMT
ఆ అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ ఆచూకీ చెబితే భారీ న‌జ‌రానా!
X
మోస్ట్ వాంటెడ్ అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ దావూద్ ఇబ్ర‌హీం భార‌త్‌కు కొన్ని ద‌శాబ్దాలుగా కొర‌క‌రాని కొయ్యగా మారాడు. 1993లో ముంబై బాంబు పేలుళ్ల‌కు కార‌ణ‌మై వంద‌ల మంది ప్రాణాలు తీసిన దావూద్ ఇబ్ర‌హీం చాలాకాలం పాకిస్తాన్‌లోని అతిపెద్ద న‌గ‌రం క‌రాచీలో త‌ల‌దాచుకున్నాడు. ఓవైపు త‌న ప్రైవేటు సైన్యం మ‌రోవైపు పాకిస్థాన్ ఐఎస్ఐ క‌ల్పించిన భ‌ద్ర‌త మ‌ధ్య ఏళ్ల త‌ర‌బ‌డి క‌రాచీలోనే త‌లదాచుకున్నాడ‌ని భార‌త ఇంటెలిజెన్స్, రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ (రా) ఎప్పుడో తెలిపాయి. అయితే ప్ర‌స్తుతం దావూద్ ఇబ్ర‌హీం అక్క‌డ ఉండ‌టం లేద‌ని.. క‌రాచీ నుంచి మ‌కాం మార్చేశాడ‌ని.. దుబాయ్ లో ఉంటున్నాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి.

కొన్నేళ్ల క్రితం తన కుమార్తెను పాకిస్థాన్ ఒక‌ప్ప‌టి డాషింగ్ బ్యాట్స్‌మెన్ జావేద్ మియాందాద్ కుమారుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ త‌ర్వాత నుంచి అత‌డు క‌నిపించ‌డం మానేశాడ‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం దావూద్ ఇబ్ర‌హీం వ‌య‌సు 66 ఏళ్ల‌ని.. ఆయ‌న చాలాకాలంగా షుగ‌ర్, బీపీ వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్నాడ‌ని అంటున్నారు. అంతేకాకుండా సుగ‌ర్ వ్యాధితో అవ‌య‌వాలు విఫ‌ల‌మై మ‌ర‌ణించాడ‌ని గాసిప్స్ కూడా వ‌చ్చాయి. అయితే దావూద్ ఇబ్ర‌హీం మ‌ర‌ణించ‌లేద‌ని స్ప‌ష్ట‌మైంది.

ఈ నేప‌థ్యంలో మోస్ట్ వాంటెడ్ అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ అయిన దావూద్ ఇబ్ర‌హీం ఆచూకీ చెబితే రూ.25 లక్ష‌ల రివార్డు ఇస్తామ‌ని జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ) సెప్టెంబ‌ర్ 1న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. 1993లో ముంబైలో బాంబు పేలుళ్లు జ‌రిగాక అత‌డిని భార‌త ప్ర‌భుత్వం అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదిగా ప్ర‌క‌టించింది.

డీ-కంపెనీ పేరుతో డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా, ఆయుధాల స్మ‌గ్లింగ్, న‌కిలీ క‌రెన్సీ నోట్ల చ‌లామ‌ణి, మ‌నీ లాండ‌రింగ్, హ‌త్య‌లు, మ‌త క‌ల‌హాలు, ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాలు దావూద్ ఇబ్ర‌హీం నిర్వ‌హిస్తున్నాడు. మత క‌ల‌హాల‌ను రేప‌డానికి సున్నిత ప్రాంతాల్లో పేలుళ్లు కూడా డీ కంపెనీ చేస్తోంది.

అంతేకాకుండా దుబాయ్ కేంద్రంగా దావూద్ ఇబ్రహీం అండర్ వరల్డ్ సిండికేట్ నడుపుతూ మనీలాండరింగ్, నకిలీ కరెన్సీనోట్ల చలామణి చేస్తున్నాడని వెల్లడైంది. మ‌రోవైపు భార‌త్ పై విషం క‌క్కుతున్న‌ లష్కరే తోయిబా, జైషే మహ్మద్, అల్ ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూరుస్తున్నాడని కూడా స్ప‌ష్ట‌మైంది.

ఈ నేప‌థ్యంలో ఎన్నో ఏళ్ల నుంచి త‌మ‌కు కొర‌క‌రాని కొయ్య‌గా ఉన్న‌ దావూద్ ఇబ్ర‌హీం ఆచూకీ చెబితే 25 లక్ష‌ల రూపాయ‌లు ఇస్తామ‌ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అలాగే దావూద్ ఇబ్ర‌హీం ముఖ్య‌ అనుచరుడు ఛోటా షకీల్ ఆచూకీ చెబితే 20 లక్షల రూపాయలు ఇస్తామ‌ని వెల్ల‌డించింది. అదేవిధంగా దావూద్ ఇబ్రహీం సోదరుడు అనీస్ ఇబ్రహీంపై రూ.15 లక్షల రివార్డును ఎన్ఐఏ ప్రకటించింది.

దావూద్ ఇబ్ర‌హీం, చోటా ష‌కీల్, అనీస్ ఇబ్ర‌హీంల ఆచూకీనే కాకుండా దావూద్ ఇబ్ర‌హీం అనుచరులైన జావేద్ పటేల్, జావేద్ చిక్నా, ఇబ్రహీం ముస్తాఖ్, అబ్దుల్ రజాఖ్ మెమోన్ అలియాస్ టైగర్ మెమోన్ ల ఆచూకీ చెప్పిన వారికి కూడా నగదు బహుమతులు ఇస్తామని నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ తెలిపింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.