Begin typing your search above and press return to search.

రెండో రాజ‌కీయ పార్టీతో ఈ హీరో రీ ఎంట్రీ

By:  Tupaki Desk   |   17 Sep 2018 6:09 AM GMT
రెండో రాజ‌కీయ పార్టీతో ఈ హీరో రీ ఎంట్రీ
X
క‌న్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర.. మరో మారు ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌క‌ట‌న చేశారు. కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. త‌న పొలిటిక‌ల్ రీ ఎంట్రీకి సెప్టెంబ‌ర్ 18వ తేదీని ఖ‌రారు చేసుకున్నారు. ఆ రోజు ఆయ‌న పుట్టిన రోజు కావ‌డం ఆస‌క్తిక‌రం కాగా...ఈ హీరో ఏడాది కాలంలో రెండో రాజ‌కీయ పార్టీతో రానున్నారు. కొన్ని నెలల కిందటే ఆయన ప్రజాకీయ పేరుతో ఓ పార్టీ పెట్టారు. అవినీతిని అంతమొందిస్తాం.. వారసత్వ రాజకీయాలకు చరమగీతం పాడతాం అంటూ ఆ పార్టీని ఉపేంద్ర ఆవిష్కరించారు. అయితే నాలుగు నెలల త‌ర్వాత తాను ప్రారంభించిన పార్టీ నుంచి ఇప్పుడు ఉపేంద్ర తప్పుకున్నారు. సొంత పార్టీలోనే ఉపేంద్రపై కొందరు తిరుగుబాటు చేయడంతో ఆయన బయటకు రాక తప్పలేదు. పార్టీ పెట్టిన రోజే తన భార్య - సోదరుడికి పార్టీలో అగ్రస్థానాలు ఇవ్వడంపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. పార్టీ పెట్టినా.. ఎలాంటి కార్యకలాపాలు చేపట్టక‌పోవ‌డంతో పార్టీలో వ్యతిరేకత మొదలైంది. రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న ఉపేంద్ర పార్టీ పెట్టిన స‌మ‌యంలో ఓ నియంతలా వ్యవహరిస్తున్నారంటూ ఆయన సొంత పార్టీ నేతలే ఎదురు తిరగ‌డంతో త‌న పార్టీలో నుంచి తానే బ‌య‌ట‌కు వ‌చ్చారు. బీజేపీలో చేరబోతున్నట్లు వార్తలు వచ్చినా.. తాను కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించి ఉపేంద్ర ఆశ్చర్యపరిచారు.

అయితే, మ‌రోమారు ఆయ‌న త‌న పుట్టిన రోజున ఉత్త‌మ ప్ర‌జాకీయ పార్టీ పేరుతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మేర‌కు త‌న స‌న్నిహితులు, అభిమానుల‌కు సిగ్న‌ల్స్ ఇచ్చేశారు.ఇతర పార్టీలు చేసినట్లు గొప్పగా నా రాజకీయ పార్టీని స్థాపించను. సామాజిక మాధ్యమాలు - టెలివిజన్‌ ఛానెల్స్‌ - న్యూస్‌ పబ్లికేషన్స్‌ ద్వారానే నా పార్టీని ప్రచారం చేస్తాను అని ఉపేంద్ర తెలిపారు. గెలుపు ఓటములకు నేను భయపడను. పనిచెయ్యి.. కానీ ప్రతిఫలాన్ని ఆశించకు' అనేది నమ్ముతానని ఆయన పేర్కొంటున్నారు. అయితే గ‌తంలో కూడా ఉపేంద్ర ఇదే త‌ర‌హా సినీ డైలాగులు వ‌ల్లెవేశారు. ఖాకీ రంగు చొక్కా ధరించి వచ్చిన ఉపేంద్ర తాను జన నాయకుడిని - జన సేవకుడిని కాదని.. జన కార్మికుడిననే అర్థం వచ్చేలా ఖాకీ చొక్కా వేసుకున్నానని తెలిపారు. అయితే అనంత‌రం జ‌రిగిన క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో మాత్రం ఆయ‌న ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ఆయ‌న మాజీ పార్టీ త‌ర‌ఫున ఒక్క అభ్య‌ర్థి మాత్ర‌మే గెలిచారు.

ఎన్నిక‌లు ముగిసిపోయిన దాదాపు నాలుగు నెల‌ల తర్వాత తిరిగి త‌న సొంత పార్టీతో ఉపేంద్ర ఎంట్రీ ఇస్తుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. క‌ర్ణాట‌క సంకీర్ణ ప్ర‌భుత్వంలో నెల‌కొన్న లుక‌లుక‌ల‌ను కైవ‌సం చేసుకునేందుకు ఆయ‌న ఎంట్రీ ఇస్తున్నారా? లేక రాబోయే సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారా అనే చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రోవైపు పాత అనుభ‌వాల‌ను ప‌రిశీలించుకోక‌పోతే....ఉపేంద్ర తిరిగి చేదు అనుభ‌వాల‌ను మూట‌గ‌ట్టుకోక‌త‌ప్ప‌ద‌ని అంటున్నారు.