Begin typing your search above and press return to search.

భగత్ సింగ్ ను ఉరి తీసిన రోజున మరే సీఎం చేయని సంచలన ప్రకటన

By:  Tupaki Desk   |   24 March 2022 12:30 PM GMT
భగత్ సింగ్ ను ఉరి తీసిన రోజున మరే సీఎం చేయని సంచలన ప్రకటన
X
అవసరానికి అనుగుణంగా స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ పేరును వాడేయటమే కనిపిస్తూ ఉంటుంది. అందుకు భిన్నంగా అధికారం చేతికి వచ్చిన రోజు నుంచి ఆయన పేరును పదే పదే ప్రస్తావించే ముఖ్యమంత్రి ఎవరూ కనిపించరు. అందుకు భిన్నంగా తరచూ మాటల్లోనూ.. చేతల్లోనూ భగత్ సింగ్ కు పెద్ద పీట వేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఇటీవల పంజాబ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన భగవంత్ మాన్ సర్కారేనని చెప్పాలి.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారాన్ని సైతం భగత్ సింగ్ స్వగ్రామంలో చేస్తానని చెప్పి.. అందుకు తగ్గట్లే చేయటం తెలిసిందే. అంతేనా.. తాజాగా భగత్ సింగ్ ను ఉరి తీసిన రోజును పురస్కరించుకొని దేశంలో మరే ముఖ్యమంత్రి చేయని పనిని చేశారు.

భగత్ సింగ్ బలిదానం చేసిన షహీద్ దివస్ సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి.. భగత్ సింగ్.. రాజ్ గురు.. సుఖ్ దేవ్ ల విగ్రహాల వద్ద నివాళి అర్పించారు. అనంతరం ఆయనో సంచలన ప్రకటన చేశారు. అదేమంటే.. పంజాబ్ రాష్ట్రంలో అవినీతిని రూపుమాపేందుకు వీలుగా ఒక వాట్సాప్ నెంబరును ప్రకటించారు.

పంజాబ్ రాష్ట్రంలో ఎవరైనా ఎవరికైనా లంచం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినా.. ఎవరైనా అడిగిన వెంటనే.. మరో ఆలోచన చేయకుండా 9501200200 వాట్సాప్ నెంబరుకు వివరాలు పంపాలని పేర్కొన్నారు. ఇది భగత్ సింగ్ జీవిత త్యాగం చేసిన రోజునే దీనిని లాంచ్ చేయడం విశేషం.

ఇదే విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా కూడా పోస్టు పెట్టారు. పంజాబ్ ను అవినీతి రహిత రాష్ట్రంగా మార్చేందుకు వీలుగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు. అంతేకాదు.. ఈ వాట్సాప్ నెంబరుకు వీడియో లేదంటే ఆడియో క్లిప్ ను పంపితే.. దాన్ని ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ఉన్న సభ్యుల టీం పరిశీలించి వెంటనే తగిన చర్యలు చేపడతారని పేర్కొన్నారు.

పంజాబ్ ను అవినీతి నుంచి దూరం చేసే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని.. రాష్ట్రాన్ని అవినీతిమయం కాకుండా కాపాడుకునేందుకు స్వాతంత్య్ర సమరయోధులకు ఇచ్చే సరైన నివాళిగా ఆయన పేర్కొన్నారు. మాటల్లోనే కాదు చేతల్లోనూ సరికొత్త తీరును ప్రదర్శిస్తున్న పంజాబ్ ముఖ్యమంత్రి రానున్న రోజుల్లో మరెన్ని సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అవుతారో? ఏమైనా తాజా నిర్ణయం భగత్ సింగ్ కు సరైన నివాళిగానే చెప్పాలి.