Begin typing your search above and press return to search.

వెంకయ్య రాష్ట్రపతి అయ్యే సెంటిమెంట్ లెక్క విన్నారా?

By:  Tupaki Desk   |   15 Jun 2022 1:30 PM GMT
వెంకయ్య రాష్ట్రపతి అయ్యే సెంటిమెంట్ లెక్క విన్నారా?
X
దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 14 మంది రాష్ట్రపతులు దేశానికి పని చేశారు. పదిహేనో రాష్ట్రపతి ఎన్నిక కోసం నోటిఫికేషన్ వెలువడింది. అధికార బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా పలువురి పేర్లు వినిపిస్తున్నప్పటికీ.. ఎవరికి అవకాశం లభిస్తుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ సీనియర్ నేత కమ్ కశ్మీరీ నేత గులాం నబీ అజాద్ ను అభ్యర్థిగా బరిలోకి దింపుతారన్న ప్రచారం జరిగినా.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే.. అవేమీ నిజం కావన్నట్లుగా పరిస్థితి మారింది.

ఇక.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. తెలంగాణ గవర్నర్ తమిళ సై.. బిహార్ సీఎం నితీశ్ కుమార్ లాంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక.. విపక్షాల తరఫున శరద్ పవార్ పేరు వినిపించినా.. తనకు ఆసక్తి లేదన్న విషయాన్ని ఆయన స్పష్టం చేయటంతో రేసు నుంచి ఆయన పేరు డిలీట్ చేయాల్సిన పరిస్థితి. తాజాగా గాంధీ మనమడి పేరు తెర మీదకు వచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా వినిపిస్తున్న ఒక వాదన ఆసక్తికరంగా మారింది.

ఒక సెంటిమెంట్ వర్కువుట్ అయితే తదుపరి రాష్ట్రపతి వెంకయ్య నాయుడే అవుతాడన్న మాట వినిపిస్తోంది. అదెలా అన్న ప్రశ్నకు ఆసక్తికర వాదనను వినిపిస్తున్నారు. ఇప్పటివరకు 13 మంది ఉప రాష్ట్రపతులు పని చేశారు. వీరిలో తొలి ముగ్గురు రాష్ట్రపతులు అయ్యారు. ఆ తర్వాత ముగ్గురు మళ్లీ రాష్ట్రపతులు కాలేదు. అనంతరం మరో ముగ్గురు ఉప రాష్ట్రపతులు రాష్ట్రపతులు అయ్యారు.

మళ్లీ ముగ్గురు ఉప రాష్ట్రపతులు రాష్ట్రపతులు కాలేదు. ఈ లెక్కన చూసినప్పుడు సెంటిమెంట్ ప్రకారం.. ఇప్పుడు ఉప రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్న వెంకయ్యనాయుడికి రాష్ట్రపతి అయ్యే అవకాశం ఉంది.

మరి.. ఆ అవకాశాన్ని మోడీ అండ్ కో ఇస్తారా? అన్నది చూడాలి. ఒకవేళ.. వెంకయ్యను కానీ బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే మాత్రం.. రెండు తెలుగు రాష్ట్రాలు పార్టీలకు అతీతంగా ఆయన పక్షాన నిలిచే అవకాశం ఉంది. అదే సమయంలో.. పలు పార్టీ అధినేతలకు ఆయనకు ఉన్న వ్యక్తిగత పరిచయంతో ఆయనకు మద్దతు పలికే వీలుంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రపతి అభ్యర్థిని బరిలోకి దింపే బీజేపీకి.. తమ అభ్యర్థిని సొంతంగా గెలిపించుకునేంత మద్దతు లేదు. ఈ నేపథ్యంలో వెంకయ్యను రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రకటిస్తే.. ఇప్పుడున్న సీన్ మొత్తం మారే వీలుందన్న మాట వినిపిస్తోంది. మరి.. మోడీషాలు ఏం చేస్తారో చూడాలి.