Begin typing your search above and press return to search.

ఆ గ్రామంలో వరుస మరణాలు .. అసలు కారణం ఏంటి ?

By:  Tupaki Desk   |   10 Oct 2020 10:30 AM GMT
ఆ గ్రామంలో వరుస మరణాలు ..  అసలు కారణం ఏంటి ?
X
వరుస మరణాలతో ఆ గ్రామం అల్లాడిపోతోంది. అసలు ఎందుకు చచ్చిపోతున్నామో కూడా కారణం తెలియకుండానే కన్నుమూస్తున్న వారిని చూసి గ్రామం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఎప్పుడు ఏ చావు వార్త వినాల్సి వస్తుందో.. రేపటి జాబితాలో ఎవరు ఉంటారో అని దినదినగండంగా రోజులు వెళ్లదీస్తున్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పెద్ద పోచారం గ్రామం పరిస్థితి ఇది. గ్రామంలో జ్వరాల వ్యాప్తి విస్తృతంగా ఉన్నా, ఎవరికి వారే వైద్యం చేయించుకోవడం, జ్వర తీవ్రత పెరిగితే జిల్లా కేంద్రమైన ఖమ్మం ఆస్పత్రికి వచ్చి చికిత్స చేయించుకుంటున్నారు.

ప్రతి గ్రామంలో కరోనా వైరస్‌ మొబైల్‌ వైద్య బృందాలు పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ , తమ గ్రామానికి ఎందుకు రావడంలేదంటూ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. పూర్తి వ్యవసాయాధారిత ప్రాంతమైన పెద్ద పోచారంలో ఒక్కొక్కరుగా కన్ను మూస్తుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. సెప్టెంబర్‌ 15వ తేదీ నుంచి ఈ నెల 6వ తేదీ వరకు గ్రామంలో 12 మంది మృత్యువాత పడ్డారు. కారణాలు ఏమైనా కానీ వరుసగా ఆ గ్రామంలో మరణాలు సంభవిస్తుండటంతో తమను పట్టించుకునే వారే లేరా.. అనే ఆవేదన గ్రామస్తుల్లో వ్యక్తమవుతోంది. మరణించిన వారిలో కరోనా వైరస్‌ సోకిన వారు, వృద్దులు కూడా ఉన్నారు. ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు ఉన్నారు.

సెప్టెంబర్‌ 15 నుంచి వరుసగా మరణాలు సంభవించడం, మరో వైపు జ్వరాల తీవ్రత పెరగడం, అది ఏ జ్వరమో, చికిత్స ఎక్కడ చేయించుకోవాలో ఎలాంటి మందులు వాడాలో.. చెప్పే వారే కరువయ్యారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జ్వరం అని చెబితే కరోనా.. అని అంటారనే భయంతో అనేక మందికి జ్వరాలు వచ్చినా బయటకు రాక అందుబాటులో ఉన్న వైద్యంతో సరిపెడుతున్నారని.. ఇది ఎటువైపు దారి తీస్తుందోనని భయం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ ప్రజల్లో ధైర్యం పెరగాలంటే, జ్వరపీడితులకు సరైన వైద్యం అందించడంతోపాటు కరోనాపై వారికి ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందని గ్రామపెద్దలు అభిప్రాయ పడుతున్నారు. కాగా, ఇటీవల గ్రామంలో కరోనా‌ పరీక్షలు నిర్వహించారు.